కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ (Nalgonda) జిల్లా వైద్యారోగ్య శాఖ (Health Department) లో నయా దందా జోరుగా సాగుతోంది. ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకుండా కొందరు అధికారులు అక్రమార్జనకే పెద్దపీట వేశారు. వసూళ్లే ధ్యేయంగా ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, రూల్స్ లేకుండానే జిల్లా స్థాయి అధికారి ఒకరు డిప్యూటేషన్ల దందా (Deputation Scam) చేస్తున్నారు. ఒక్కో డిప్యూటేషన్‌కు రూ. 2 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలోని నకిరేకల్, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ వంటి ప్రాంతీయ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు దాదాపు 15 మంది సిబ్బందికి ఆయన కేవలం మౌఖిక ఆదేశాలతోనే డిప్యూటేషన్లు ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వ నిబంధనల మేరకు ఎలాంటి ప్రొసీడింగ్స్ గానీ, ఆమోదిత ప్రోసిజర్ గానీ లేకుండానే దందాను నడుపుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
డ్యూటీ ఒక చోట.. జీతం మరో చోట..
ల్యాబ్ టెక్నిషియన్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది అత్యవసరాలు, రోగులకు జరిగే ఇబ్బందులతో సంబంధం లేకుండా, డబ్బులు ఇచ్చిన వారికి నచ్చిన ప్రాంతానికి డిప్యూటేషన్లు కట్టబెడుతున్నారు. దేవరకొండ ప్రాంతీయ ఆస్పత్రిలో పనిచేసే ఒక సిబ్బందిని సదరు అధికారి తన స్వలాభం కోసం నకిరేకల్ ఏరియా ఆస్పత్రికి పంపించారు. నాగార్జునసాగర్ కమలానెహ్రూ ఆస్పత్రిలో పనిచేసే ఇద్దరు సిబ్బందిని మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రికి మౌఖిక ఉత్తర్వులతోనే మార్చేశారు.
ఈ అక్రమ డిప్యూటేషన్ల వ్యవహారం వెనుక జిల్లా స్థాయి అధికారి ఒకరు కీలక పాత్ర పోషిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. ఏండ్ల తరబడిగా అదే పోస్టులో తిష్టవేసుకుని కూర్చోవడంతో సదరు అధికారి అవినీతి పరాకాష్టకు చేరింది. శాఖలో పనిచేసే ఒక హెడ్ నర్సును ఏజెంట్‌గా పెట్టుకుని, ఆమె ద్వారా ఈ దందాను ‘మూడు పువ్వులు.. ఆరు కాయలు’గా కొనసాగిస్తున్నారు. సదరు హెడ్ నర్సే వసూళ్ల ప్రక్రియను, అభ్యర్థుల ఎంపికను దగ్గరుండి నడిపిస్తుండటం సొంత శాఖలోని సిబ్బందిలోనే తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
ఫిట్నెస్ సర్టిఫికెట్‌కు ఉందో రేటు
పెద్ద మొత్తంలో డిప్యూటేషన్ల దందా నడిపిస్తున్న సదరు అధికారి చిల్లర వసూళ్లలోనూ వెనుకాడకపోవడం గమనార్హం. ఫిట్నెస్ సర్టిఫికెట్ల కోసం వచ్చే విద్యార్థుల నుంచి ఆఖరికి రూ. 100 సైతం వసూలు చేస్తున్నారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయం జిల్లా వ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమైంది. అధికారిక ఆదేశాలు లేకుండా, నిబంధనలను బొందపెట్టి ఏరియా ఆస్పత్రుల్లో సాగిస్తున్న ఈ అక్రమ డిప్యూటేషన్ల వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన సదరు జిల్లా స్థాయి అధికారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

