బీజేపీకి బీసీ సెగ.. పార్లమెంటులో హమీ.. కానీ!!

కలం, తెలంగాణ బ్యూరో: ‘జనగణనలో కులగణన’ (Caste Census) అంశం బీజేపీ మెడకు చుట్టుకుంది. సెన్సస్‌ సెకండ్ ఫేజ్లో బీసీ లెక్కలు తీస్తామని పార్లమెంట్ వేదికగానే కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చినా, పలు సందర్భాల్లో ప్రధాని మోదీ చెప్పినా.. ప్రస్తుతం విడుదల చేసిన ప్రశ్నావళిలో ‘ఓబీసీ’ అని ప్రత్యేకంగా లేకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. సెన్సస్ విభాగం రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం రూపొందించిన క్వశ్చనీర్ (10వ నెంబర్)లో ఎస్సీ, ఎస్టీ మాత్రమే ప్రస్తావించారు.

‘ఓబీసీ’ అనేది ఇందులో పొందుపర్చకపోవడంతో బీసీ వర్గాలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జంతర్ మంతర్ ఘటన తర్వాత ఒకింత కార్నర్ అయిన బీజేపీ.. అనంతరం జరిగిన బిహార్‌లోని బంకీపుర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆ స్థానాన్ని కోల్పోయింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్కు కంచుకోట అయిన ఈ సెగ్మెంట్ చేజారడం బీజేపీకి చేదు అనుభవంలా మిగిలింది. ఇప్పుడు జనగణన సెకండ్ ఫేజ్ ప్రక్రియలో ‘ఓబీసీ’ ప్రశ్నను చేర్చకపోవడంతో ఆ సెక్షన్ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఒత్తిడికి దిగొచ్చి నాడు హామీ

బీసీ కులగణన.. కొన్నేళ్లుగా దేశ రాజకీయాలను కుదిపేస్తున్న అంశం. దేశంలో ఓబీసీల జనాభా ఎంత? దేశంలోని ఉద్యోగాలు, ప్రజాప్రాతినిధ్యం, విద్య, సంక్షేమం తదితర రంగాల్లో వారి వాటా ఎంత?.. ఇలాంటి ప్రశ్నలతో కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నాయి. భారత్‌ జోడో యాత్ర సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఈ అంశాన్ని ‘జిత్‌నీ ఆబాదీ.. ఉత్‌నీ హక్’.. అంటూ కులగణనను ప్రధాన రాజకీయ అస్త్రంగా మార్చారు. ఆ తర్వాత పార్లమెంట్ వేదికగా కూడా ఇదే అంశాన్ని పలుమార్లు లేవనెత్తారు.

చివరికి కేంద్ర ప్రభుత్వం కులగణనకు అంగీకరించింది. ఇకపైన జరిగే జనాభా లెక్కల సేకరణ సందర్భంగా ‘జనగణనలో కులగణన’ అని 2025లో మోదీ ప్రభుత్వం ప్రకటించింది. “బీసీల లెక్క ఎందుకు తీయడం లేదు?” అంటూ అప్పటిదాకా బీజేపీని ప్రశ్నించిన కాంగ్రెస్‌కు కేంద్రం నుంచి వచ్చిన నిర్ణయం ఆ సమయంలో రాజకీయ ఎదురుదెబ్బగానే పరిణమించింది. కానీ, రాహుల్‌గాంధీ డిమాండ్‌కు ప్రధాని మోదీ అంగీకరించక తప్పలేదనే కామెంట్లు అప్పట్లో వివిధ పార్టీల నుంచి వినిపించాయి.

సెకండ్ ఫేజ్‌పై పొలిటికల్ హీట్

జనగణన రెండు దశల్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రకటించింది. ఫస్ట్ ఫేజ్లో హౌస్ లిస్టింగ్. ఇది ఇప్పటికే తెలంగాణ సహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో పూర్తయింది. సెకండ్ ఫేజ్లో భాగంగా జనాభా లెక్కింపు ఉంటుంది. ఇది త్వరలోనే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ప్రశ్నావళి తాజాగా విడుదలైంది. ఈ క్వశ్చనీరే ఇప్పుడు చర్చకు దారితీసింది. మరోసారి రాజకీయంగా బీజేపీని ఇరుకునపెట్టేలా తయారైంది. తొలుత కులగణన డిమాండ్‌తో దేశవ్యాప్త చర్చను లేవనెత్తిన రాహుల్‌గాంధీకి ఈ ప్రశ్నావళి ఒక రాజకీయ అస్త్రంగా మారే అవకాశముంది.

దేశవ్యాప్తంగా బీసీ/ఓబీసీల జనాభాను స్పష్టంగా, ప్రత్యేకంగా తేల్చే తీరులో ప్రశ్నావళిలో క్లారిటీ లేకపోవడంతో అనుమానాలు నెలకొన్నాయి. సెకండ్ ఫేజ్‌లో కులగణన చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం దానికి తగ్గట్టు ‘ఓబీసీ’ అనే అంశాన్ని ఎందుకు చేర్చలేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రశ్నావళిలో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక గుర్తింపు ఉండగా.. ఓబీసీ/బీసీ వర్గాల వివరాలను ప్రత్యేకంగా ప్రస్తావించకుండా ఏ విధంగా నమోదు చేస్తారని నిలదీస్తున్నాయి. జనాభా లెక్కల సందర్భంగా వ్యక్తులు చెప్పే కులపేర్లను ఏ ప్రామాణిక జాబితా ఆధారంగా వర్గీకరిస్తారు.. ఆ డేటా దేశవ్యాప్తంగా ఓబీసీల వాస్తవ జనాభాకు ప్రామాణికంగా ఉంటుందా..? ఇలాంటి కామెంట్లు వస్తున్నాయి.

ప్రతిపక్షాలకు అస్త్రం

ఓబీసీ కులాలవారీగా లెక్క తేల్చడానికి స్పష్టమైన ప్రశ్నావళిని సెన్సస్ సెకండ్‌ ఫేజ్‌లో పెట్టకపోతే బీసీ వ్యతిరేక పార్టీ అనే అపవాదును బీజేపీ మూటగట్టుకోవాల్సి వస్తుందన్న అభిప్రాయాలు మొదటి నుంచి ఉన్నాయి. కులగణనలో బీసీల వాస్తవ లెక్కలను వెలికితీస్తే దానికి తగిన విధంగా పథకాలను, పాలసీలను రూపొందించాల్సి వస్తుంది. ఏ రకంగా చూసినా బీజేపీకి సవాళ్లు తప్పేలా లేవు. ప్రశ్నావళిలో మార్పులు చేసి ఓబీసీ కాలమ్ చేర్చకపోతే రాజకీయంగా ఆ పార్టీ కార్నర్ అవుతుంది.

కులగణన చేస్తామని పార్లమెంట్ వేదికగా హామీ ఇచ్చి ‘ఓబీసీ’ కాలమ్‌ను ప్రశ్నావళిలో చేర్చకపోవడంతో క్షేత్రస్థాయిలో సైతం బీసీల నుంచి బీజేపీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. జనాభా లెక్కల ప్రక్రియ రెండో దశలో కుల గణన ఉంటుందంటూ స్వయంగా హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకపోతే ప్రధాని మోదీ సైతం ప్రజలకు, పార్టీలకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది.

ఇప్పటివరకూ రాహుల్‌గాంధీ, రాజకీయ పార్టీల డిమాండ్‌గా ఉన్నది రానున్న రోజుల్లో ప్రజల పోరాటం స్థాయికి తీసుకెళ్లడానికి ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నాయి. ఇకపైన రాహుల్‌గాంధీ ‘కులగణన చేయండి’ అని బీజేపీని డిమాండ్ చేయడానికి బదులు ‘మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఓబీసీల పూర్తి లెక్క ఎక్కడ?’ అని ప్రశ్నించేందుకు ఈ ప్రశ్నావళి అవకాశం ఇచ్చినట్లయింది. సెన్సస్‌ ప్రక్రియలో బీసీల జనాభాకు స్పష్టమైన ప్రాధాన్యం కనిపించకపోయినా, సేకరించిన వివరాల్లో కులాల గణాంకాలు లేకపోయినా మోదీ ఇచ్చిన హామీకి, అమలు చేస్తున్న విధానానికి పొంతన లేదు.. అంటూ కాంగ్రెస్‌ దాడి చేసే అవకాశమున్నది.

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఓబీసీ లెక్కల విషయాన్ని సమాజ్‌వాదీ పార్టీ రాజకీయంగా వాడుకునే చాన్స్ కనిపిస్తున్నది. సామాజిక న్యాయం, రిజర్వేషన్లు, వెనుకబడిన వర్గాల ప్రాతినిధ్యాన్ని పొలిటికల్ అస్త్రంగా మార్చుకోడానికి సెన్సస్ సెకండ్ ఫేజ్ ప్రశ్నావళి ఆస్కారం కల్పించినట్లయింది. సామాజిక న్యాయం, రిజర్వేషన్ల అంశంలో సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న డీఎంకే సహా పలు ప్రతిపక్ష పార్టీలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటం చేయడానికి అవకాశాలు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>