గ్రేటర్‌లో ‘సర్’ ఎఫెక్ట్.. గులాబీ పార్టీకి గుబులు!

కలం, తెలంగాణ బ్యూరో: ‘సర్’ కారణంగా గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసరాల్లో సుమారు 43 లక్షల మంది ఓటర్ల పేర్లు ముసాయిదా జాబితా నుంచి గల్లంతు అవుతుండటంతో అన్ని ప్రధాన పార్టీల్లో టెన్షన్ మొదలైంది. కాంగ్రెస్, మజ్లిస్, బీజేపీ కంటే బీఆర్ఎస్‌(BRS) లో ఈ గుబులు ఒకింత ఎక్కువగా ఉన్నది. ఓటర్లు తగ్గడంతో పార్టీల అభ్యర్థులకు ఖర్చు తగ్గుతుందనే రిలీఫ్ ఉన్నా పార్టీల నాయకత్వానికి మాత్రం ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లకు గండి పడుతుందోననే భయం పట్టుకుంది.

రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసరాల్లోని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రభావం గణనీయంగానే ఉంది. నాడు పురపాలక శాఖ మంత్రిగా, బీఆర్ఎస్‌లో సెకండ్ ర్యాంక్ లీడర్‌గా ఈ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేయడం, ఎలక్షన్ స్ట్రాటజీని రూపొందించడంలో కేటీఆర్ ప్రత్యేకంగా టైమ్ కేటాయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పవర్ కోల్పోయినా ఇక్కడ మాత్రం 16 స్థానాలను గెలుచుకున్నది. కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా గెల్చుకోలేకపోయింది. సంస్థాగతంగా బీఆర్ఎస్ బలంగా ఉన్నదనే ధీమా ఇంతకాలం కొనసాగితే ఇప్పుడు ‘సర్’ పేరుతో దాదాపు 43 లక్షల ఓట్లు తగ్గిపోతున్న ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తున్నది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ ప్రభావం పడుతుందనే అంచనాకొస్తున్నారు.

గ్రేటర్‌లో భారీగా తగ్గిన ఓటర్లు!

గ్రేటర్ హైదరాబాద్, దాని పరిసరాల్లోని నియోజకవర్గాల్లో భారీగా ఓటర్లు తగ్గుతున్నట్లు ‘సర్’ ప్రస్తుత గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే.. ఏ నియోజకవర్గంలో ఎంత మొత్తంలో ఓటర్లు తగ్గారనేది ఈ నెల 17న ముసాయిదా జాబితా విడుదలతో స్పష్టం కానున్నది. గల్లంతైన ఓటర్ల వివరాలకు తగ్గట్టు ఏ పార్టీకి ఎంత డ్యామేజ్ అనేది తేలనున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో ప్రజలు బీఆర్ఎస్‌కు పట్టం కట్టినందున ఇప్పుడు గల్లంతైన ఓటర్ల కారణంగా ఎక్కువగా ఆ పార్టీకే నష్టం జరుగుతుందనే అభిప్రాయం నెలకొన్నది. ఎక్కువగా ఆంధ్రా సెటిలర్ల పేర్లు మిస్ అయ్యాయనే మాటలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ వీళ్లు బీఆర్ఎస్‌కు అండగా నిలబడ్డారంటూ కేసీఆర్, కేటీఆర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. డబుల్ ఎంట్రీ విషయంలో ఎలక్షన్ కమిషన్ సీరియస్‌గా ఉన్నందున జైలుశిక్ష భయానికి ఇక్కడి జాబితా నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారని సీఈవో వర్గాల సమాచారం. అండగా నిలిచిన సెటిలర్లు దూరమైతే ఆ ఎఫెక్ట్ మరే పార్టీకంటే బీఆర్ఎస్‌కే ఎక్కువగా ఉంటుందని ఆ పార్టీ శ్రేణులు, నగర లీడర్లే అభిప్రాయపడుతున్నారు.

జరిగే నష్టం ఎవరి ఖాతాలోకి!

ఇప్పటివరకు గ్రేటర్‌లో పట్టును నిలుపుకున్న బీఆర్ఎస్‌కు ఇప్పుడు లక్షలాది ఓటర్ల పేర్లు డిలీట్ కానుండటం ఆందోళన కలిగిస్తున్నది. రానున్న రోజుల్లో ఎలాంటి చిక్కులు వస్తాయనే గుబులు పట్టుకున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ వేవ్ వచ్చినా గ్రేటర్‌ హైదరాబాద్, దాని పరిసరాల్లో మాత్రం బీఆర్ఎస్ రికార్డు సృష్టించింది. ఒక చోట బీజేపీ, ఏడు చోట్ల మజ్లిస్ గెలిచినా మిగిలినవన్నీ బీఆర్ఎస్ ఖాతాలోకి వచ్చాయి. బీఆర్ఎస్‌కు గ్రేటర్ ఒక కోటలాగా నిలిచింది.

ప్రభుత్వ పనితీరు, హైదరాబాద్ అభివృద్ధి, ఐటీ రంగం, మౌలిక వసతులు, నగర భవిష్యత్తుపై ఉన్న నమ్మకం, స్థానిక నాయకుల వ్యక్తిగత నెట్‌వర్క్, సెటిలర్ ఓటర్లలో ఏర్పడిన రాజకీయ సమీకరణాలు కలిసి తమను గెలిపించాయంటూ కేటీఆర్ సహా గులాబీ లీడర్లు గొప్పగా చెప్పుకున్నారు. అయితే.. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ స్థానాలను చేజార్చుకున్న బీఆర్ఎస్ ఇప్పుడు ‘సర్’ రూపంలో మరో పరీక్షను ఎదుర్కోబోతున్నది. గ్రేటర్లో ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడాన్ని తన ఖాతాలో వేసుకున్న కేటీఆర్ రానున్న రోజుల్లో ఓటర్ల సంఖ్య తగ్గిన అంశంతో ఏర్పడే చిక్కులను ఎలా ఎదుర్కొంటారన్న దానిపై బీఆర్ఎస్ సిటీ లీడర్లలో చర్చ జరుగుతున్నది. పార్టీకి జరిగే నష్టాన్ని కూడా ఆయన ఖాతాలో వేసుకుంటారా? అని కొందరు మాట్లాడుకుంటున్నారు.

ఆల్టర్నేట్ ఓటర్లపై ఫోకస్

ఇప్పుడు ‘సర్’ రూపంలో కోల్పోయిన సంఖ్యకు తగినంతగా రానున్న రోజుల్లో కొత్త ఓటర్లను ఆకర్షించడం ఒక ఆల్టర్నేట్ ఆలోచనగా మారింది. ఏ పార్టీకి చెందిన కేడర్‌ను, వారికున్న స్థానిక పలుకుబడితో సాధారణ ఓటర్లను బీఆర్ఎస్‌ వైపు తిప్పుకోవాలన్నదే సిటీ లీడర్ల మధ్య జరుగుతున్న చర్చ. ఇప్పుడు డిలీట్ అయ్యే కేటగిరీలోకి వెళ్లిన ఓటర్లను లోకల్ కేడర్ కలిసి తగిన ఆధారాలను రెడీ చేసి గ్రీవెన్స్ పీరియడ్‌లో వీలైనంత ఎక్కువ మంది పేర్లు కంటిన్యూ అయ్యేలా చూడడం మొదటి ఆలోచన. సెటిలర్ ఓటర్లంతా సొంత రాష్ట్రానికి వెళ్లిపోవడంతోనే సంఖ్య తగ్గిందనే క్లారిటీ వస్తే ఇతర పార్టీలకు మద్దతుగా ఉన్న ప్రజలను ఆకర్షించడం రెండో ఆలోచన. ముసాయిదా జాబితా విడుదల అనంతరం నియోజకవర్గాలవారీగా ఎన్ని ఓట్లు తగ్గాయి, ఏ కాలనీలో తగ్గాయి, గత ఎన్నికల్లో ప్రత్యర్థిపై సాధించిన మార్జిన్ ఎంత.. ఇలాంటి అంశాలకు అనుగుణంగా ఇతర పార్టీలకంటే ఎక్కువ బలం ఉండేలా చూసుకోవడం బీఆర్ఎస్‌కు అనివార్యంగా మారింది. ఈ ఏడాది చివర్లో జరిగే జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికే భారీ వ్యూహాన్ని అమలు చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. మెంబర్‌షిప్ డ్రైవ్‌తో ఒకింత కాన్ఫిడెన్స్ వస్తుందని ఆ పార్టీ గ్రేటర్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>