కలం, వెబ్ డెస్క్: కలం, తెలంగాణ బ్యూరో: రేషన్ కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన కుటుంబాలకు ఇప్పుడు ఊరట లభిస్తున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నరేళ్లలో 6.71 లక్షల కొత్త కార్డులు ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలోనే ఏకంగా 16.32 లక్షలకుపైగా కార్డులు మంజూరు చేసింది. దాదాపు పది రెట్ల వేగం చూపించింది. అర్హత ఉన్నప్పటికీ కార్డులు మంజూరు కాకపోవడంతో అనేక కుటుంబాలు ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగాయి. కార్డు లేకపోవడంతో ఉచిత సన్నబియ్యంతో పాటు ఆహార భద్రత, ఆరోగ్యశ్రీ తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలకు కూడా అనేక కుటుంబాలు దూరమయ్యాయి.
దరఖాస్తుల పరిశీలనలో వేగం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేసింది. ప్రజావాణి, ప్రజాపాలన తదితర కార్యక్రమాల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేసింది. 2025 జనవరి 26 నుంచి ఇప్పటివరకు 16,32,810 కొత్త ఆహార భద్రత కార్డులు జారీ అయ్యాయి. వీటి ద్వారా 61,08,544 మంది కొత్తగా చౌకధరల దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పొందే అవకాశం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ (New Ration Cards)కూడా లాంఛనంగా ప్రారంభం కానున్నది.
దారిద్ర రేఖకు ఎగువన ఆరు శాతమే
గతేడాది నిర్వహించిన కులగణన సర్వే ప్రకారం రాష్ట్రంలో మొత్తం 1,12,15,134 కుటుంబాలు ఉన్నాయి. వీటిలో 1,06,28,092 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. అంటే దాదాపు 96 శాతం కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయన్నమాట. కేవలం ఆరు శాతం కుటుంబాలే దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నట్లు ఈ గణాంకాల ద్వారా వెల్లడవుతుంది. సంపన్నులు సైతం రేషన్ కార్డుల ద్వారా ఆరోగ్యశ్రీ మొదలుకొని అనేక రకాలుగా ప్రయోజనాలు పొందుతున్నారంటూ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ గణాంకాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రెండున్నరేళ్లలో 16.32 లక్షలకుపైగా కార్డులు మంజూరు కావడం రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది.
పూర్తి వివరాలు..
రాష్ట్రంలోని మొత్తం కుటుంబాలు : 1,12,15,134
బీఆర్ఎస్ హయాంలో మంజూరైన కార్డులు : 6,71,010
2014-23 మధ్య వచ్చిన అప్లికేషన్లు : 9,37,969
ఇందులో రిజెక్ట్ అయినవి : 2,66,959
కాంగ్రెస్ హయాంలో మంజూరైనవి : 16,32,810
మొత్తం వైట్ రేషన్ కార్డులు : 1,06,28,092
తెల్ల కార్డు లేని కుటుంబాలు : 5,87,042

