సార్థక్‌ దూకుడు.. టీవీఎస్‌కు 1-2 ఫినిష్

కలం, స్పోర్ట్స్: చివరి ల్యాప్‌లో అదిరిపోయే దూకుడు. ఒక్కసారిగా ఇద్దరిని దాటేసి విజయం. పుణేకు చెందిన 19 ఏళ్ల సార్థక్‌ చవాన్‌ (Sarthak Chavan) మద్రాస్‌ ఇంటర్నేషనల్‌ సర్క్యూట్‌లో సత్తా చాటాడు. సూపర్‌ స్పోర్ట్‌ 301-400సీసీ రేస్‌లో విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన ఎంఆర్‌ఎఫ్‌ ఇండియన్‌ నేషనల్‌ రేసింగ్‌ ఛాలెంజ్‌ 2డబ్ల్యూ-2026లో సార్థక్‌ ఈ విజయం సాధించాడు. దీంతో పెట్రోనాస్‌ టీవీఎస్‌ రేసింగ్‌ జట్టుకు 1-2 ఫినిష్‌ దక్కింది. ఆరు ల్యాప్‌ల రేసులో సార్థక్‌ ఎక్కువసేపు రెండో స్థానంలోనే ఉన్నాడు. పోల్‌ పొజిషన్‌లో ఉన్న తన జట్టు సహచరుడు చిరంత్‌ విశ్వనాథ్‌ ముందంజలో ఉన్నాడు.

హైదరాబాద్‌కు చెందిన రాహిల్‌ పిళ్లరిశెట్టి కూడా పోటీలో ఉన్నాడు. రేసులో టర్న్‌-2 వద్ద రక్షిత్‌ డేవ్‌, సావియన్‌ సాబులకు భారీ ప్రమాదం జరిగింది. అయితే ఇద్దరూ క్షేమంగా బయటపడ్డారు. చివరి ల్యాప్‌లో సార్థక్‌ ఒక్కసారిగా వేగం పెంచాడు. చిరంత్‌, రాహిల్‌ను దాటాడు. టర్న్‌-11 వద్ద చిరంత్‌తో స్వల్పంగా ఢీకొన్నా ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు. చివరికి 11 నిమిషాల 1.971 సెకన్లలో రేసును పూర్తి చేసి విజయం అందుకున్నాడు. చిరంత్‌ రెండో స్థానంలో, రాహిల్‌ మూడో స్థానంలో నిలిచారు.

సూపర్‌ స్టాక్‌ 301-400సీసీ ఓపెన్‌ రేసులో త్రిశూర్‌కు చెందిన అల్విన్‌ జేవియర్‌ విజేతగా నిలిచాడు. జట్టు సహచరుడు, 16 ఏళ్ల కబిలేష్‌ రాజినీ కృష్ణన్‌ ఐదో ల్యాప్‌లో థ్రాటిల్‌ బాడీ ఊడిపోవడంతో రేసు నుంచి తప్పుకున్నాడు. దీంతో అల్విన్‌కు విజయం దక్కింది. సూపర్‌ స్టాక్‌ 165సీసీ ఇంటర్మీడియట్‌లో చెన్నైకి చెందిన ఆన్‌ జెన్నిఫర్‌ ఆధిపత్యం ప్రదర్శించింది. పెద్దగా సవాలు లేకుండానే రేసును గెలిచింది. ప్రో-స్టాక్‌ 200సీసీ విభాగంలో బెంగళూరుకు చెందిన సావియన్‌ సాబు విజేతగా నిలిచాడు.

ఆరో స్థానం నుంచి మొదలుపెట్టి ముందుకు దూసుకొచ్చాడు. స్టాక్‌ 165సీసీ నోవిస్‌ విభాగంలో కోయంబత్తూరుకు చెందిన హరి హరన్‌ విజయం సాధించాడు. స్టాక్‌ 301-400సీసీ నోవిస్‌ రేసులో బెంగళూరుకు చెందిన అశ్విన్‌ ఆర్‌ అతి స్వల్ప తేడాతో మొదటి స్థానంలో నిలిచాడు. పెట్రోనాస్‌ టీవీఎస్‌ వన్‌-మేక్‌ ఛాంపియన్‌షిప్‌లోనూ బెంగళూరుకు చెందిన పూజిత అనిల్‌ కుమార్‌ ఆకట్టుకుంది. మహిళల అపాచీ ఆర్‌టీఆర్‌ 200 విభాగంలో ఆమె తొలి జాతీయ స్థాయి విజయాన్ని అందుకుంది.

పోల్‌ పొజిషన్‌ నుంచి ప్రారంభించిన పూజితకు ఆరంభం సరిగా లేదు. ఆరో స్థానానికి పడిపోయింది. అయినా ఒత్తిడికి లోనుకాకుండా తిరిగి ముందుకు వచ్చింది. చివరికి ఆధిక్యాన్ని సాధించి విజయంతో ముగించింది. వన్‌-మేక్‌ ఓపెన్‌ ఆర్‌ఆర్‌ 310 విభాగంలో హైదరాబాద్‌కు చెందిన రాజేందర్‌ బీదాని గెలిచాడు. రూకీ అపాచీ ఆర్‌టీఆర్‌ 200 రేసులో మంచిర్యాలకు చెందిన పొతు విఘ్నేశ్‌ విజేతగా నిలిచాడు. మొత్తంగా సార్థక్‌ చవాన్‌ చివరి ల్యాప్‌ దూకుడు ఈ రేస్‌ డేలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మిగతా విభాగాల్లోనూ విజేతలు తమ ప్రతిభను చాటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>