కలం, వరంగల్ బ్యూరో: కాకతీయుల రాజధాని వరంగల్ (Warangal)లో 1886లో నిజాం హయాంలో కట్టిన సుబేదారి కలెక్టర్ బంగ్లా హెరిటేజ్ భవన్ గా మారబోతోంది. 139 ఏళ్ల కింద కట్టినా ఇప్పటివరకు చెక్కుచెదరకపోవడంతో ఈ భవనాన్ని వారసత్వ సంపదగా భావితరాలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుమారు 5 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాను కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రూ.2 కోట్లతో పునరుద్దరణ పనులు చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైన రిపేర్లు మరి కొద్ది రోజుల్లో ముగియనున్నాయి. టెంపుల్ ట్రీ. రాయల్ పామ్, యూకోఫెల్లం, లాంటానా, స్పైడర్ లిల్లీ, వడేలియా రుబ్రా వంటి మొక్కలతో గార్డెన్ ను సుందరంగా తీర్చి దిద్దుతున్నారు. లైబ్రరీ, ఫుడ్ కోర్టుల ఏర్పాటు, సాంస్కృతిక కార్యక్రమాల వంటి నిర్వహణతో త్వరలోనే పర్యాటకులను అనుమతించనున్నారు.
వరంగల్ బంగ్లా కేంద్రంగా సుబేదార్ పాలన
కుతుబ్ షాహీల పాలన తర్వాత దక్కన్ ప్రాంతాన్ని అసఫ్ జాహీలు చేజిక్కించుకున్నారు. 150 ఏళ్లకు పైగా పాలించిన వీరు పాలనా సౌలభ్యం కోసం హైదరాబాద్ రాజ్యాన్ని సుభాలుగా విభజించారు. ఒక్కో సుభాకు తరఫ్ దార్ లేదంటే సుబేదార్ స్థాయి అధికారి ఉండేవారు. సుబేదార్ ను ‘సర్ లష్కర్’ అని కూడా పిలిచేవారు. తానీషా కాలంలో గోల్కొండ రాజ్యం ఆరు సుభాలుగా ఉండేది. అందులో వరంగల్ కూడా ఒకటి. ఈ సుభాలో ఎలగందుల (కరీంనగర్), స్తంభగిరి (ఖమ్మం), దేవరకొండ (నల్గొండ), వరంగల్ సర్కార్లు ఉండేవి. వీటన్నింటికీ ఓరుగల్లు కేంద్రంగా ఉండేది. 1853లో మూడో సాలార్ జంగ్ నిజాం రాజ్యాన్ని ఐదు సుభాలుగా, 17 జిల్లాలుగా, ప్రతి జిల్లాను తాలుకాలుగా విభజించారు.
1875లో భూసర్వే శాఖ ఏర్పాటు..
1875లో వరంగల్ లో భూ సర్వే శాఖను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే 1886 ఆగస్ట్ 10న అప్పటి బ్రిటీష్ అధికారి జార్జ్ పాల్మర్ భార్య బంగ్లా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దీనిని సుబేదార్ నివాసంగా ఉపయోగించారు. దీని వల్లే హనుమకొండలోని ఈ ఏరియాకు ‘సుబేదారి ‘ అనే పేరు వచ్చింది. హనుమకొండ కలెక్టరేట్ ఆనుకుని ఉండే ఈ బంగ్లాను 13 ఎకరాల్లో, అడుగడుగునా రాజనం ఉట్టి పడేలా డంగు సున్నంతో కట్టారు. బంగ్లా ప్రవేశ ద్వారంగా భారీ స్థాయిలో కమాన్, ఇరువైపులా కాపలా సిబ్బంది గదులను నిర్మించారు. కమాన్ పై పెద్ద గడియారాన్ని సైతం ఏర్పాటు చేశారు. విశాలమైన ప్రాంగణంలో పూలు, పండ్ల మొక్కలతో పాటు శ్రీ గంధం, నల్లతుమ్మ, రాగి, వేప, అల్లనేరేడు వంటి వందల రకాల చెట్లు ఉన్నాయి.
లోపల 22 గదుల నిర్మాణం..
బంగ్లా లోపల గాలి, వెలుతురు ప్రసరించేలా 22 గదులను నిర్మించారు. అతిథులు కూర్చోవడానికి వీలుగా 44 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో విశాలమైన హాల్ కట్టారు. 22 ఫీట్ల ఎత్తులో స్లాబ్ నిర్మాణం చేపట్టారు. అప్పట్లో రాచరికానికి గుర్తుగా ఏర్పాటు చేసిన శాండ్లియర్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ప్రధాన హాల్ ఎడమ వైపున 8, కుడి వైపు మరో 7 గదులున్నాయి. ఈ బిల్డింగ్ ఒక బాత్రూం 13 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పుతో ఉండడం గమనార్హం. చెక్కలతో ఏర్పాటు చేసిన మెట్ల ద్వారా మొదటి అంతస్థుకు వెళ్తే విశాలమైన టెర్రస్, పెద్ద హాల్, మరో 3 గదులున్నా యి. ఇక్కడి నుంచి చూస్తే చుట్టూరా ఉన్న ఏరియాలు కనిపిస్తాయి. ఉమ్మడి వరంగల్ కేంద్రంగా ప్రస్తుతం ఎన్నో బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, విల్లాలు వచ్చినా ఈ బంగ్లా హంగు, ఆర్భాటం ఏమాత్రం తగ్గలేదు.
43 మంది కలెక్టర్లకు నివాసం..
అసఫ్ జాహీల కాలంలో నిర్మించిన ఈ భవనంలో 1948 సెప్టెంబర్ 17 వరకు సుబేదార్ అధికారి నివాసం ఉండేవారు. 1950 నుంచి ప్రభుత్వ అధికార భవనంగా మార్చి కలెక్టర్ నివాసంగా వినియోగిస్తున్నారు. 1950లో వరంగల్ మొదటి కలెక్టర్ ఎంవీ. రాజ్వేద నుంచి మొన్నటి వరకు హనుమకొండ కలెక్టర్ గా పనిచేసి బదిలీ అయిన కలెక్టర్ ప్రావీణ్య వరకు మొత్తం 43 మంది కలెక్టర్లు, మరికొందరు ఇన్ ఛార్జి కలెక్టర్లు ఈ బంగ్లాలోనే ఉండేవారు. 1982లో జవహర్ కలెక్టర్ గా ఉన్న టైంలో ఈ బిల్డింగ్ ప్రాంగణంలోని బావి పూడికతీత చేపట్టగా.. నిజాం కాలం నాటి కత్తులు, ఇతర సామగ్రి లభించాయి. వాటిని పురావస్తు శాఖకు అప్పగించారు. ఈ బిల్డింగ్ ను హెరిటేజ్ భవన్ గా మార్చేందుకు నిర్ణయించడంతో ప్రస్తుత కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ బంగ్లా ఖాళీ చేసి కొత్త నివాసంలోకి మారారు.

