కలం, తెలంగాణ బ్యూరో: ప్రధానిగా నరేంద్ర మోదీ పగ్గాలు చేపట్టి బుధవారంతో పన్నెండేండ్లు పూర్తయింది. దీన్ని దేశవ్యాప్తంగా బీజేపీ సెలబ్రేట్ చేసుకుంటున్నది. కానీ, పన్నెండేండ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఈ సెలబ్రేషన్స్ డే వేళ కూడా మొండిచేయ్యె ఎదురైంది. బుధవారం మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ (Union Cabinet) భేటీలో తెలంగాణ అంశమే ప్రస్తావనకు రాలేదు. గుజరాత్ లోని అహ్మదాబాద్ మెట్రో రైల్ ఎక్స్‌టెన్షన్ (2-ఏ) ప్రతిపాదనకు మాత్రం సమావేశంలో ఆమోదం లభించింది.
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ మెట్రో (Hyderabad Metro) రైల్ సెకండ్ ఫేజ్ కారిడార్ విషయంలో మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పటికే ‘‘తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతున్నది.. ‘సవతి తల్లి’ ప్రేమ తీరులో వ్యవహరిస్తున్నది..’’ అనే విమర్శలున్నాయి. గుజరాత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి తెలంగాణకు రెడ్ సిగ్నల్ ఇవ్వడం.. అదీ మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి పన్నెండేండ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కేబినెట్ భేటీలో మరింత విమర్శలకు కారణమవుతున్నది.
విమర్శలపాలు
2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్‌గా సీఎం రేవంత్ (Revanth Reddy) సెటైరికల్ క్యాంపెయిన్ చేపట్టారు. రాష్ట్రానికి కేంద్రంలోని మోదీ సర్కార్ ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అంటూ దుయ్యబట్టారు. ‘గాడిద గుడ్డు’ అని రాసి ఉన్న ఫ్లకార్డులను ప్రచార సభల్లో విస్తృతంగా ప్రదర్శించారు. రాష్ట్రంపై ప్రధాని మోదీ వివక్ష చూపుతున్నారని, ఏది అడిగినా ఇవ్వడం లేదని ఇప్పటికీ ఆయన అంటున్నారు. అయితే.. మోదీ (PM Modi) అధికారంలోకి వచ్చి 12 ఏండ్లు పూర్తయిన సందర్భంగానైనా రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏమైనా ప్రాజెక్టు దక్కుతుందని భావిస్తే.. మళ్లీ గాడిద గుడ్డే లభించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అహ్మదాబాద్ మెట్రోకు (Ahmedabad Metro) ఓకే చెప్పి.. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విషయంలో నిర్ణయం తీసుకోకపోవడం ఏమిటన్న ప్రశ్నలు వస్తున్నాయి. హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్‌కు అనుమతి ఇవ్వాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి పదేపదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా నిర్వహిద్దామనే ప్రతిపాదన పెట్టారు. గత నెలలో డీపీఆర్‌ను కూడా కేంద్రానికి అందించారు. ప్రధాని అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ అంశం ప్రస్తావనకే రాలేదు.
రికార్డును బ్రేక్ చేశామన్న రోజునే..!
మొత్తం దేశానికి ప్రధానిగా వ్యవహరించాల్సిన మోదీ కేవలం గుజరాత్ రాష్ట్రానికే అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని, తెలంగాణకు వచ్చే పెట్టుబడులను కూడా ఆ రాష్ట్రానికి డైవర్ట్ చేస్తున్నారని పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ కంటే అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న రికార్డును మోదీ సొంతం చేసుకున్నారంటూ బీజేపీ నేతలు గొప్పగా చెప్పుకుంటున్నారు. సరిగ్గా ఆ రోజున (బుధవారం) జరిగిన కేబినెట్ (Union Cabinet) భేటీలోనే తెలంగాణ మెట్రో సెకండ్ ఫేజ్ ప్రాజెక్టుకు మొండిచేయి చూపడం చర్చకు తావిచ్చింది.
అహ్మదాబాద్‌కు వరం దక్కితే హైదరాబాద్‌కు గుండు సున్నా మిగిలిందన్న ఆగ్రహం కాంగ్రెస్ నేతల్లో వ్యక్తమైంది. దాదాపు రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదించిన 122.9 కిలోమీటర్ల హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు ప్రస్తుతానికి కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లింది. ‘ఇన్-ప్రిన్సిపల్ అప్రూవల్’కు సానుకూలంగా స్పందించి, ఆర్థిక ఆమోదం తెలపకుండా నాన్చివేత ధోరణి అవలంబిస్తోందనే విమర్శలను కేంద్రం మూటగట్టుకున్నది.
కిషన్‌రెడ్డే అడ్డం పడుతున్నారంటున్న సీఎం
సీఎం రేవంత్ పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిని కలిసి సెకండ్ ఫేజ్ మెట్రో రైల్ ప్రాజెక్టు గురించి వివరించి అనుమతులతో పాటు ఆర్థిక సాయాన్ని చేయాలని కోరారు. మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్ కారిడార్‌ను సింగిల్ ఎంటీటీగా మార్చాలన్న కేంద్ర నిబంధనకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ. 1,461 కోట్లు రుణం తీసుకుని ఎల్ అండ్ టీ వాటాలను కొనుగోలు చేసింది. కేంద్రం అడిగిన అన్ని షరతులన్నింటినీ నెరవేర్చినా కేంద్ర కేబినెట్ క్లియరెన్స్ ఇవ్వకుండా కాలయాపన చేయడం వివాదానికి తావిచ్చినట్లయింది.
“మెట్రో విస్తరణపై అన్ని అనుమతులు వచ్చినా ఇక్కడి నుంచి గెలిచిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధికి ఆయన స్పీడ్ బ్రేకర్‌లా మారారు” అంటూ ఉప్పల్‌లో ఇటీవల జరిగిన బహిరంగసభలో సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ నుంచి 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించి, కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టినా రాష్ట్ర ప్రయోజనాల సాధనలో విఫలమయ్యారనే ఆరోపణలు సీఎం రేవంత్ చేశారు.
జూన్ 15 తర్వాత ఏం జరగనున్నది?
ఇప్పటికే వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్రం తీరును ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై (Kishan Reddy) సీఎం రేవంత్ ఫైర్ అయ్యారు. ఈ నెల 15న కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత కిషన్‌రెడ్డి సంగతి తేలుస్తామన్నారు. సరిగ్గా ఇదే సమయంలో మెట్రో రైల్ సెకండ్ ఫేజ్‌కు కేంద్ర కేబినెట్ నుంచి అనుమతి రాకపోవడం మరింత పొలిటికల్ హీట్ పెంచినట్లయింది. మూసీ ప్రాజెక్టు విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిషన్‌రెడ్డి చేస్తున్న కామెంట్లపై సీఎం సెటైర్లు వేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పొలిటికల్ వార్‌కు ఈ అంశాలన్నీ ప్రధాన ప్రచారాస్త్రాలుగా మారబోతున్నాయి.
సెమీ కండక్టర్ పరిశ్రమల స్థాపన విషయంలోనూ తెలంగాణకు వస్తున్న కంపెనీలను గుజరాత్‌కు డైవర్ట్ చేస్తున్నారని ఇప్పటికే ప్రధానిపై విమర్శలున్నాయి. తెలంగాణ ఏర్పాటుపై ‘తల్లిని చంపి బిడ్డను..’ అంటూ స్వయంగా ప్రధాని వివాదాస్పద కామెంట్లు చేయగా, ‘ఇండియా-పాకిస్తాన్ విభజన తరహాలో…’ అంటూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య కామెంట్ చేశారు. నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి సీఎం హాజరవుతున్న నేపథ్యంలో దీన్ని ఎలా ప్రస్తావిస్తారన్నది కూడా కీలకంగా మారింది.
హైదరాబాద్‌లో మెట్రో సెకండ్ ఫేజ్.. పరిశీలనలోనే..!
మొత్తం అంచనా వ్యయం: రూ.38,595 కోట్లు
కనెక్టివిటీ: 122.9 కిలోమీటర్లు
కారిడార్ల సంఖ్య: 7
మే 4న కేంద్ర ప్రభుత్వానికి డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్)ను అందజేసిన రాష్ట్ర ప్రభుత్వం.
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా ఫిఫ్టీ ఫిఫ్టీ నిధులతో నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన.
పరిశీలనలోనే ఉందంటూ మే 26న రాతపూర్వకంగా తెలిపిన కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ.
తాజాగా కేబినెట్ (Union Cabinet) లో ప్రస్తావనకు రాని అంశం
Read Also: నేటి నుంచే ఫిఫా వరల్డ్ కప్.. ఈసారి ఆ చరిత్రను తిరగరాస్తారా?
Follow Us On : WhatsApp

