కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక (Pinapaka) నియోజకవర్గంలోని కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల గోస చూస్తే, ఎవ్వరికైనా మనసు కరిగి కళ్లు చెమర్చాల్సిందే. ఎందుకంటే ఆరుగాలం కష్టపడి, ఎండనక వాననక చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు రోడ్డున పడ్డారు. పినపాక నియోజకవర్గంలోని మార్కెట్ యార్డులో పండించిన పంటను అమ్ముకోవడానికి గత నెల రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నా, పట్టించుకునే నాథుడే కరువయ్యారనీ అన్నదాత కన్నీరు, మున్నీరవుతున్నాడు. సాక్షాత్తు జిల్లా కలెక్టరే వచ్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించినా… పరిస్థితిలో మార్పు రాలేదంటే, స్థానికంగా అధికారుల్లో ఎంత నిర్లక్ష్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.
కోత కోసి, నూర్పిడి చేసి, ఎన్నో ఆశలతో ధాన్యాన్ని మార్కెట్ యార్డుకు తీసుకువస్తే.. అక్కడ అధికారుల ఉదాసీనత రైతులకు శాపంగా మారింది. నెల రోజులుగా మార్కెట్ యార్డులోనే వంటావార్పు చేసుకుంటూ, ధాన్యం కుప్పలపైనే నిద్రిస్తూ రైతులు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ఆకాశం మేఘావృతమైతే గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, అకాల వర్షం వస్తే ఉన్న పంట కాస్తా నీటిపాలవుతుందని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.
అధికారుల మధ్య సమన్వయ లోపం..
పీఏసీఎస్ (PACS) అధికారులు, అగ్రికల్చర్ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఒకరు మరొకరిపై నెపం నెట్టేస్తున్నారే తప్ప, ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంలో చొరవ చూపడం లేదు. మిల్లర్ల కొర్రీలు ఒకవైపు, బస్తాల కొరత మరోవైపు రైతును నలిపేస్తున్నాయి.
పినపాక నియోజకవర్గంలోని మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేయాలని.. అలాగే పీఏసీఎస్, అగ్రికల్చర్ అధికారులు వెంటనే సమన్వయం చేసుకొని కొనుగోళ్లను వేగవంతం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. తూకాల్లో తేడాలు రాకుండా, మిల్లర్ల వేధింపులు లేకుండా చూడాలంటూ… వర్షం ముప్పు పొంచి ఉన్నందున యుద్ధప్రతిపాదికన ధాన్యం తరలించాలనీ రైతులు డిమాండ్ చేస్తున్నారు.
పెట్టుబడి భారమై.. వడ్డీలు కొంప ముంచుతున్నాయ్ : వెంకన్న, పినపాక రైతు
పంట సాగు కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ధాన్యం అమ్ముకుంటే గానీ ఆ అప్పులు తీరవు, తదుపరి పంటకు పెట్టుబడి రాదు. ఈ దుస్థితిలో ప్రభుత్వమే మమ్మల్ని ఆదుకోవాలి. అయినా మా పంటను మేమే అమ్ముకోవడానికి ఇన్ని తిప్పలు పడాలా? వ్యవసాయం చేయాలంటేనే దుఃఖం వస్తుంది.

