Mobile Popup Ad
Mobile Popup Ad

నంబర్‌పై నజర్.. ఎంపీ సీట్లను పెంచుకుంటున్న బీజేపీ!

కలం, ఢిల్లీ బ్యూరో: మొన్నామధ్య ఏకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీ (BJP)లో చేరిపోయారు. దాంతో రాజ్యసభలో బీజేపీ బలం 106 నుంచి 113కు చేరింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యులు 20 మంది బీజేపీలో చేరేందుకు రెడీ అయ్యారు. మరో ఇద్దరు కూడా అదే బాటలో ఉన్నారు. వీరందరూ చేరితో లోక్ సభలో బీజేపీ బలం 240 నుంచి 262కు పెరుగుతుంది. ఇలా కొన్నిరోజులుగా బీజేపీ కేవలం నంబర్ పైనే నజర్ పెట్టింది. ఉభయ సభల్లో బలాన్ని పెంచుకునేందుకు ఉన్నదారులన్నీ వెతుకుతున్నది. దీని వెనుక ఎలాగైనా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ సహా పలు కీలక బిల్లులను ఆమోదించుకోవాలన్న లక్ష్యం దాగి ఉందన్న టాక్ వినిపిస్తున్నది. లోక్ సభలో, రాజ్యసభలో సంఖ్యాబలం పెరగగానే బిల్లులు ఆమోదించుకుంటామని తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) కామెంట్ చేశారు. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. సంఖ్యా బలం కోసం బీజేపీ ‘ఆపరేషన్ ఆకర్ష్’ను నమ్ముకుందన్న చర్చ నడుస్తున్నది.

రానున్న మూడేండ్లలో చేయాల్సిన పనులపై మోదీ (PM Modi) స్పెషల్ ఫోకస్ పెట్టారు. డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఉమ్మడి పౌరస్మృతి, జమిలి ఎన్నికలు.. ఇలాంటి కీలక బిల్లులను పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం రెండు సభల్లో సంపూర్ణ మెజారిటీ లేకపోవడంతో సంఖ్యను పెంచుకోవడంపై బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నది. ఏయే పార్టీల నుంచి ఎంత మంది వస్తే అనుకున్న బిల్లులకు ఆమోదం లభిస్తుందో లెక్కలు వేసుకుంటున్నది. పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోవడంతో ఆ పార్టీకి చెందిన లోక్సభ సభ్యులను ‘ఆపరేషన్ ఆకర్ష్’ పేరుతో తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు దాదాపుగా ఫలించాయి. ‘ఇండియా’ కూటమికి దూరమైన డీఎంకే సభ్యుల పరోక్ష సహకారాన్ని తీసుకోవడంపైనా ఆలోచనలు జరుగుతున్నాయి.

ఆ బిల్లులు పాస్ కావడమే లక్ష్యం..

పార్లమెంట్ బడ్జెట్ సెషన్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుపై సుదీర్ఘంగా చర్చ జరిగినా ఓటింగ్ టైమ్‌లో వీగిపోవడం బీజేపీని ఇరుకున పెట్టినట్లయింది. ఆ బిల్లులకు ఆమోదం పొంది చట్టంగా రూపొందించాలని పట్టుదల ప్రదర్శిస్తున్నది. ఈసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టినప్పుడు ఇలాంటి పరిణామం రిపీట్ కావొద్దని స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకున్నది. అది జరగాలంటే పార్లమెంట్ ఉభయ సభల్లో తగినంత మెజారిటీ కోసం గత కొన్ని వారాలుగా విస్తృతమైన ఆలోచనలు చేసింది. సంఖ్యాబలం పెరిగితే మాత్రమే లక్ష్యం సాకారమవుతుందని స్పష్టం కావడంతో అందుకు అనుసరించాల్సిన పటిష్టమైన వ్యూహాలపై దృష్టి పెట్టింది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ ప్లాన్‌ అమలును వేగవంతం చేసింది. సరిగ్గా ఇదే విషయాన్ని, అనుసరించబోయే వ్యూహాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అనధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఢిల్లీలో మీడియాతో మంగళవారం రాత్రి ఆయన చిట్‌చాట్‌ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్లో ‘నంబర్ గేమ్’ ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామన్నారు.

బలం పెరిగిన వెంటనే..: అమిత్ షా

మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, ‘వన్ నేషన్–వన్ ఎలక్షన్’ వంటి కీలక బిల్లులకు పార్లమెంట్ లో సంఖ్యాబలం పెరగడమొక్కడే గ్యారంటీ అని కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. లోక్‌సభ, రాజ్యసభల్లో అవసరమైన సంఖ్యాబలం రాగానే కీలక బిల్లులపై ప్రక్రియను స్పీడప్ చేస్తామన్నారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లు, జమిలి ఎన్నికల బిల్లులకు మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. “అవసరమైన మద్దతు లభించగానే బిల్లులను ఆమోదింప చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీల్లో అసంతృప్తితో ఉన్న ఎంపీలను ఆకర్షించడం, ప్రాంతీయ పార్టీలతో వ్యూహాత్మక సాన్నిహిత్యం పెంచడం, కీలక ఓటింగ్‌లో మద్దతు సాధించడం.. ఇవే అమిత్ షా మాటల్లో వ్యక్తమైన వ్యూహం ప్రధాన అంశాలు. ప్రాంతీయ పార్టీలతో సంబంధాలను మెరుగుపరుచుకుంటూనే, అవసరమైతే వ్యక్తిగత స్థాయిలో ఎంపీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

54 ఓట్ల తక్కువ కావడంతో పాస్ కాని బిల్లు..

బడ్జెట్ సెషన్ సందర్భంగా జరిగిన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, రాజ్యాంగ సవరణ బిల్లులను కలిపి ఒకటిగానే కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టింది. ఆ బిల్లులు ఆమోదం పొందాలంటే మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం. హాజరైన మొత్తం 528 మంది ఎంపీలలో బిల్లులకు అనుకూలంగా 298 మంది, ప్రతికూలంగా 230 మంది ఓటు వేశారు. మూడింట రెండొంతుల మెజారిటీకి ప్రభుత్వానికి ఇంకా 54 మంది ఎంపీల ఓట్లు అవసరం. పర్సెంటేజీ ప్రకారం చూస్తే 66.66% రావడానికి బదులు 56.44% మాత్రమే వచ్చింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నుంచి 20 మంది బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తారన్నట్లు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. టీఎంసీకే చెందిన మరో ఇద్దరు ఎంపీలు కూడా బీజేపీ వైపు వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నది. వీరందరూ(22 మంది) కలిసి బీజేపీకి మద్దతిస్తే లోక్సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి మరో 32 ఎంపీల మద్దతు అవసరమవుతుంది.

లోక్ సభలో డీఎంకేకు 22 మంది సభ్యులున్నారు. కాంగ్రెస్‌తో డీఎంకేకు దూరం పెరగడం బీజేపీకి అడ్వాంటేజ్‌గా మారనున్నది. అయితే.. డీఎంకే మొదటి నుంచి ఉమ్మడిగా మూడు బిల్లులు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నది. సౌత్కు అన్యాయం చేయడానికే కేంద్రం ఇలా డీలిమిటేషన్ బిల్లును పెడుతున్నదని డీఎంకే చీఫ్ స్టాలిన్ మండిపడుతున్నారు. ఆయన వైఖరి ఎలా ఉన్నా.. ఆ పార్టీలోని ఎంపీల పరోక్ష మద్దతు కూడగట్టాలని బీజేపీ ప్రయత్నిస్తున్నదన్న చర్చ జరుగుతున్నది. డీఎంకే ఎంపీలు నేరుగా మద్దతు ఇవ్వకపోయినా.. ఓటింగ్కు దూరం ఉంటే చాలు తమకు లాభం చూకురుస్తాయన్నది బీజేపీ ఆలోచన. దీనికి తోడు ‘ఇండియా’ కూటమి నుంచి క్రాస్ ఓటింగ్ అనుమానాలూ ఉన్నాయి. ఇవన్నీ జరిగితే.. బిల్లులకు లోక్సభలో ఈజీగా ఆమోదం పొందొచ్చని బీజేపీ లెక్కలు వేసుకుంటున్నది.

రాజ్యసభలో కూడా లోక్ సభలో మాదిరి నంబర్ పై బీజేపీ నజర్ పెట్టింది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన 10 మంది రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు బీజేపీలో చేరిపోయారు. దీంతో రాజ్యసభలో కమలం పార్టీ బలం 113కు పెరిగింది. మరోవైపు టీఎం రాజ్యసభ సభ్యుల్లో కొందరు ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారికి తోడు ఇతర పార్టీల రాజ్యసభ సభ్యుల మద్దతును కూడా కూడగట్టాలని బీజేపీ చూస్తున్నది. ఎన్డీయే పక్షాల మద్దతు ఎలాగో ఉన్నందున.. ఇతర పార్టీల ఎంపీల సపోర్ట్ తీసుకొని బిల్లులను గట్టెక్కించాలన్న కసరత్తులో కమలదళం ఉన్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>