కలం, స్పోర్ట్స్ బ్యూరో : ఫుట్ బాల్ మానియాతో దునియా మరోసారి ఉర్రూతలూగనుంది. అమెరికా, కెనడా, మెక్సికో వేదికలుగా జరగనున్న 2026 ఫిఫా వరల్డ్ కప్ (FIFA World Cup 2026) సమరంతో ఒక బంతి చుట్టూనే గింగిరాలు కొట్టనుంది. జూన్ 11 నుంచి జులై 19 వరకు సుమారు 39 రోజుల పాటు జరగనున్న ఈ మెగా టోర్నీలో 48 జట్లు, 104 మ్యాచ్‌లు, కోట్లాది మంది అభిమానుల అంచనాలతో చరిత్రలోనే అత్యంత భారీ క్రీడా పండుగగా నిలవనుంది. అయితే, 140 కోట్ల జనాభా కలిగిన భారత్ మాత్రం మరోసారి ఈ మెగా ఈవెంట్లో కేవలం ప్రేక్షకుడి పాత్రకే పరిమితం కాబోతున్నది. ఇంతటి దుస్థితి ఇండియాకు ఎందుకు వచ్చింది? అద్భుతమైన చరిత్ర, అపారమైన ప్రతిభ ఉన్నప్పటికీ భారత్ ఫుట్‌బాల్ లో ఎందుకు వెనుకబడింది? మౌలిక వసతుల లోపమా లేక వ్యూహాత్మక వైఫల్యమా? అన్నది ఇప్పుడు ప్రతి క్రీడాభిమానిని వేధిస్తున్న ప్రశ్న.
ఒకప్పుడు ఆసియా ఫుట్ బాల్ రారాజుగా వెలుగొందిన భారత్.. 1950 వరల్డ్ కప్ కి అర్హత సాధించి తన సత్తా చాటింది. 1956 ఒలింపిక్స్లో నాలుగో స్థానంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. కానీ, ఆ స్వర్ణయుగం తర్వాత భారత ఫుట్బాల్ మళ్లీ అంతటి స్థాయిని అందుకోలేకపోయింది. 1950లో బూట్లు లేకపోవడం వల్లే భారత్ వరల్డ్ కప్ ఆడలేదని ప్రచారంలో ఉన్నా.. అది కేవలం ఒక చిన్న అంశం మాత్రమే. నిజానికి అప్పటి ట్రావెల్ ఖర్చులు, సమయం, సరైన ప్రణాళిక లోపమే ప్రధాన అడ్డంకులు. ఫిఫా ఆర్థిక సాయం చేస్తామన్నా అప్పటి ఏఐఎఫ్ఎఫ్ (ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్) వెనక్కి తగ్గడం చారిత్రక పొరపాటుగా మిగిలిపోయింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారాయి. నేడు అత్యాధునిక స్టేడియాలు, కార్పొరేట్ మద్దతు, సాంకేతికత, కోట్లాది మంది అభిమానులు ఉన్నా.. వరల్డ్ కప్ ఆశను భారత్ నెరవేర్చుకోలేకపోతున్నది.
ఆ దిశగా అడుగులేవీ..?
ఇందుకు ప్రధాన కారణంగా నిపుణులు బలమైన ఫుట్ బాల్ వ్యవస్థ లోపాన్ని వేలెత్తి చూపుతున్నారు. ప్రపంచ దేశాలు పాఠశాల స్థాయి నుంచే ఆటపై దృష్టి పెట్టాయి. యూరప్ లో అకాడమీ వ్యవస్థ బలంగా వేళ్లూనుకుంది. జపాన్, దక్షిణ కొరియా యువ ఆటగాళ్లను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడంలో విజయం సాధించాయి. క్రొయేషియా, మొరాకో వంటి చిన్న దేశాలు కూడా ప్రపంచ వేదికపై తమ సత్తా చాటాయి. కానీ భారత్ మాత్రం ఆ దిశగా ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లలేకపోయింది. సమగ్ర ప్రణాళికలు లేకపోవడం వల్లనే మనం వెనుకబడిపోయామని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్వాలిఫయింగ్లోనే ఔట్..
2026 ఫిఫా వరల్డ్ కప్ లో జట్ల సంఖ్య 32 నుంచి 48కి పెరిగింది. ఆసియా దేశాలకు అదనపు అవకాశాలు లభించాయి. అయినా భారత్ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోలేకపోయింది. క్వాలిఫయింగ్ పోటీల్లోనే జట్టు నిష్క్రమించడంతో వరల్డ్ కప్ కల మరోసారి ఆశగానే మిగిలిపోయింది. అయితే, ఫుట్ బాల్ ప్రపంచంలో భారత్‌కు ప్రాధాన్యం లేదని చెప్పలేం. జట్టుగా మనం వరల్డ్ కప్లో లేకపోయినా, వీక్షకుల పరంగా భారత్ ఫిఫాకు అత్యంత కీలకమైన మార్కెట్లలో ఒకటిగా నిలుస్తున్నది. మెస్సీ ఆటైనా, రొనాల్డో మ్యాచ్ అయినా, వరల్డ్ కప్ ఫైనల్ అయినా దేశవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షిస్తారు. అందుకే ఫిఫా, ప్రసార సంస్థలు, స్పాన్సర్లు మన మార్కెట్ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి
క్రికెట్ ఏకఛత్రాధిపత్యం..
మన దేశంలో క్రికెట్ ఒక మతంగా మారి క్రీడా ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంతో శాసిస్తున్నది. దీనివల్ల ఫుట్‌బాల్‌కు అటెన్షన్ దక్కట్లేదు. అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో మెస్సీ, రొనాల్డోలతో సమానంగా మన సునీల్ ఛెత్రీ పేరు, ముఖం కూడా ఇండియాలోని చాలా మందికి తెలియదు. కేవలం క్రికెట్ మాత్రమే దీనికి కారణం కాదు. క్షేత్రస్థాయిలో ఫుట్బాల్ శిక్షణ కేంద్రాలు లేకపోవడం, ఫుట్బాల్ ఆడితే మా పిల్లల భవిష్యత్తు ఏంటి? అని తల్లిదండ్రుల్లోని భయం ఇందుకు మరో కారణం. వ్యవస్థలో ఈ లోపాలు సరిదిద్దబడాలి. క్షేత్రస్థాయి నుంచి క్రీడా సంస్కృతి మారాలి. అప్పుడే, ఏదో ఒకరోజు ప్రపంచ కప్ వేదికపై భారత జట్టును చూసే మన ఆశ సాకారమవుతుంది.
మన రక్తంలో ప్రతిభకు కొదవ లేదు..
భారతీయ ఫుట్బాల్లో మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. భారతీయ మూలాలున్న తహసీన్ మహమ్మద్, నిషాని వేలుపిళ్లై లాంటి పలువురు యువ ఆటగాళ్లు విదేశీ జట్ల తరఫున అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ఫుట్‌బాల్‌కు ప్రధాన కేంద్రాలుగా మారాయి. మణిపూర్, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్ వంటి ప్రాంతాల్లో ఫుట్‌బాల్ జీవనశైలిలో భాగమైంది. ప్రస్తుతం భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ఆటగాళ్లు అక్కడి నుంచే రావడం విశేషం. మన రక్తంలో ప్రతిభకు కొదవ లేదు. కేవలం ఆ ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగల పటిష్టమైన వ్యవస్థ, సరైన క్రీడా సంస్కృతిని నిర్మించుకోవడమే మన ముందున్న ప్రధాన సవాల్.
తెలంగాణలో చిగురిస్తున్న కొత్త ఆశలు
కేంద్ర ప్రభుత్వం ‘ఖేలో ఇండియా’ ద్వారా అట్టడుగు స్థాయి నుంచి ఆటగాళ్లను వెలికితీసే ప్రయత్నం చేస్తుంటే.. తెలంగాణ సైతం ఫుట్‌బాల్ అభివృద్ధికి బాటలు వేస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డి క్రీడలను ప్రోత్సహిస్తూ హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి కార్యక్రమాలకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా యోచిస్తున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్శిటీ ద్వారా భవిష్యత్తులో క్రీడలకు, ముఖ్యంగా ఫుట్‌బాల్‌కు పునాదులు బలంగా పడనున్నాయి. ఫుట్బాత్తో సహా అన్ని క్రీడలకు అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులను కల్పిస్తూ ఒక కొత్త ఆశాకిరణాన్ని వెలిగిస్తున్నారు. ఇటీవల ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ రాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అండగా నిలవడంతో యువతలో ఫుట్‌బాల్ పట్ల సరికొత్త ఉత్సాహం కనిపిస్తున్నది.

