Mobile Popup Ad
Mobile Popup Ad

నేటి నుంచే ఫిఫా వరల్డ్ కప్.. ఈసారి ఆ చరిత్రను తిరగరాస్తారా?

కలం, స్పోర్ట్స్ బ్యూరో: సాకర్ ప్రపంచ మహా సంగ్రామానికి సిద్ధమైంది. అమెరికా, కెనడా, మెక్సికో వేదికలుగా ఫిఫా వరల్డ్ కప్ 2026 (FIFA World Cup) నేటి నుంచే షురూ కానుంది. చరిత్రలోనే మొదటిసారిగా 48 జట్లు, 104 మ్యాచ్లతో నెవ్వర్ బిఫోర్ అనేలా సరికొత్త ఫార్మాట్లో ఆట సాగనుంది. ఈ మెగా టోర్నీలో ఫ్రాన్స్, స్పెయిన్, అర్జెంటీనా, ఇంగ్లండ్, పోర్చుగల్, బ్రెజిల్ ప్రధాన ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. అయితే, వరల్డ్ కప్ చరిత్రలో ‘ఫేవరెట్’ అనే ట్యాగ్ ఓ అందమైన శాపం! కొండంత అంచనాలతో వచ్చిన దిగ్గజ జట్లు సైతం గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పటివరకు ఫేవరెట్ టీమ్ ఏదీ నాకౌట్ స్టేజీకి వెళ్లలేదు. మరి ఈసారి ఆ ఫేవరెట్లు బోర్లా పడుతాయా? లేక రికార్డులు బద్దలు కొడుతూ ఎవరో ఒకరు ట్రోఫీని ముద్దాడుతారా? అన్నదే ఇప్పుడు అసలైన సస్పెన్స్!

పేరు, ప్రతిష్ఠ, స్టార్ ఆటగాళ్లు ఉన్నంత మాత్రాన ఫుట్బాల్ వరల్డ్ కప్లో (FIFA World Cup) విజయానికి ఎలాంటి గ్యారెంటీ ఉండదని చరిత్ర చెబుతున్నది. 2002లో అర్జెంటీనా, 2006లో చెక్ రిపబ్లిక్, 2010లో ఇటలీ (చివరి స్థానం), 2014లో డిఫెండింగ్ ఛాంపియన్ స్పెయిన్, 2018లో జర్మనీ, చివరగా 2022లో బెల్జియం గ్రూప్ దశలోనే నిష్క్రమించడమే ఇందుకు నిదర్శనం. అయితే, ఈసారి అంచనాలను తలకిందులు చేసేందుకు గతంలో లాగా 32 జట్లు కాకుండా, రికార్డు స్థాయిలో 48 జట్లు బరిలోకి దిగుతున్నాయి. నేటి నుంచి జులై 19 వరకు మొత్తం 104 మ్యాచ్లతో సాగే ఈ మహాసంగ్రామాన్ని 12 గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లతో పాటు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన మరో 8 ‘మూడో స్థాన’ జట్లు కూడా నాకౌట్ దశకు అర్హత సాధించేలా సరికొత్త ఫార్మాట్ను రూపొందించడంతో.. పోరు మరింత రసవత్తరంగా మారనుంది.

ఇంగ్లండ్: డిఫెన్సే బలం.. అదే బలహీనత?

కోచ్ థామస్ టుచెల్ ఆధ్వర్యంలో ఇంగ్లండ్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత క్రమశిక్షణ, పటిష్టమైన డిఫెన్స్ ఉన్న జట్టుగా కనిపిస్తున్నది. ప్రత్యర్థి జట్లకు కనీసం గోల్ కొట్టే అవకాశం కూడా ఇవ్వకుండా ఆకట్టుకుంటున్నది. జట్టుకు హ్యారీ కేన్ ప్రధాన గోల్ స్కోరర్గా కొండంత అండగా నిలుస్తున్నప్పటికీ.. మిగతా ఆటగాళ్ల నుంచి ఆశించిన స్థాయిలో గోల్స్ రాకపోవడం జట్టును కాస్త కలవరపెడుతున్నది. ఒకవేళ మ్యాచ్ జరిగే కొద్దీ అటాకింగ్లో అవకాశాలు సృష్టించడంలో ఇబ్బందులు ఎదురైతే ఇంగ్లండ్కు తిప్పలు తప్పవు. అయినా సరే, వారి అనుభవజ్ఞులైన ఆటగాళ్లు, మిడ్ఫీల్డ్లో సంచలనాలు సృష్టిస్తున్న స్టార్ ప్లేయర్ జూడ్ బెల్లింగ్హామ్ ఫామ్లో ఉండటం జట్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్.
స్టార్ ప్లేయర్: జూడ్ బెల్లింగ్హామ్

స్పెయిన్: యమాల్ ఫిట్నెస్ కీలకం

యూరో 2024 విజేతగా నిలిచిన స్పెయిన్ జట్టు కొండంత ఆత్మవిశ్వాసంతో ఈ ప్రపంచకప్ బరిలోకి దిగుతున్నది. ఈ జట్టు టైటిల్ ఆశలన్నీ పూర్తిగా వారి యువ సంచలనం లామిన్ యామల్ ప్రదర్శనపైనే ఆధారపడి ఉన్నాయి. దురదృష్టవశాత్తూ గాయం కారణంగా మెక్సికోతో జరిగే తొలి మ్యాచ్కు అతడు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తుండటం స్పెయిన్ శిబిరంలో ఆందోళన కలిగిస్తున్నది. దీనికి తోడు జట్టు కీలక మిడ్ఫీల్డర్లు రోడ్రి, పెడ్రి పూర్తి ఫిట్నెస్పై కూడా ఇంకా స్పష్టత లేకపోవడం జట్టుకు పెద్ద మైనస్గా మారింది. ఒకవేళ యామల్ త్వరగా కోలుకుని తన సహజసిద్ధమైన ఆటను చూపిస్తే స్పెయిన్ను ఆపడం ఎవరికైనా కష్టమే, లేదంటే మాత్రం ఆ జట్టుకు ఆరంభం నుంచే గండం తప్పకపోవచ్చు.
స్టార్ ప్లేయర్: లామిన్ యమాల్

బ్రెజిల్: ఆనాటి ‘సాంబార్’ మ్యాజిక్ తగ్గినట్లేనా?

బ్రెజిల్ పేరు వినగానే ప్రపంచాన్ని వణికించిన దిగ్గజ ఫుట్బాల్ స్టార్ల జాబితా గుర్తుకొస్తుంది. కానీ ఈసారి ఆ జట్టు పరిస్థితి కొంత భిన్నంగా, ఆందోళనకరంగా కనిపిస్తున్నది. వినీసియస్ జూనియర్, రాఫిన్హా, గాబ్రియెల్ మగల్హాయెస్ వంటి కొద్దిమంది మినహా, గత బ్రెజిల్ జట్లతో పోలిస్తే ప్రతిభ (టాప్ క్వాలిటీ టాలెంట్) పరంగా ఈ జట్టు కొంత వెనుకబడి ఉందనే అభిప్రాయం ఫుట్బాల్ విశ్లేషకుల్లో వ్యక్తమవుతున్నది. మైదానంలో పాత బ్రెజిల్ మార్కు కరువైందనే విమర్శలు ఉన్నప్పటికీ.. ప్రపంచంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన వ్యూహకర్త కార్లో అంచెలొట్టి కోచ్గా ఉండటం ఒక్కటే ప్రస్తుతానికి ఆ జట్టుకు కొండంత బలం.
స్టార్ ప్లేయర్: వినీసియస్ జూనియర్

ఫ్రాన్స్: అత్యంత బలమైన జట్టు.. కానీ,

మైదానంలో అత్యంత భీకరమైన అటాకింగ్ లైనప్ ఉన్న ఫ్రాన్స్ను ఈ టోర్నీలో (FIFA World Cup) అత్యంత బలమైన జట్టుగా (హాట్ ఫేవరెట్గా) మెజారిటీ ఫుట్బాల్ విశ్లేషకులు భావిస్తున్నారు. కైలియన్ ఎంబాపే, ఉస్మాన్ డెంబెలే వంటి వరల్డ్ క్లాస్ స్టార్ ఆటగాళ్లతో ప్రత్యర్థి గుండెల్లో వణుకు పుట్టించేంత శక్తివంతంగా కనిపిస్తున్నది. అయితే, ఈసారి గ్రూప్ దశలోనే సెనెగల్, నార్వే వంటి ప్రమాదకరమైన ప్రత్యర్థులు ఎదురుకానుండటం వారికి పెద్ద సవాలుగా మారొచ్చు. ఒకవేళ ఆరంభంలో ఒకటి రెండు మ్యాచుల్లో ఆశించిన ఫలితం రాకపోతే జట్టుపై ఒత్తిడి ఒక్కసారిగా పెరిగే ప్రమాదం ఉంది. అయినప్పటికీ పెద్ద టోర్నీల్లో ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని స్థిరంగా రాణించే అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉండటం ఫ్రాన్స్ జట్టుకు ఉన్న అతిపెద్ద ప్రత్యేకత.
స్టార్ ప్లేయర్: ఎంబాపే

అర్జెంటీనా: అతిగా ఆధారపడటమే ప్రమాదం

డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతున్న అర్జెంటీనా.. వరుస విజయాల జోష్తో ఈ టోర్నీకి వచ్చింది. 2022 వరల్డ్ కప్, 2024 కోపా అమెరికా టైటిళ్లు గెలవడం ఆ జట్టుకు కొండంత బలాన్ని ఇచ్చింది. అయితే, నాలుగేండ్ల కింద టైటిల్ గెలిపించిన ప్రధాన ఆటగాళ్లే ఇప్పటికీ జట్టులో కొనసాగుతుండటం ఒక రకంగా ఆందోళన కలిగించే విషయమే. ఎందుకంటే కీలక ఆటగాళ్ల వయసు పెరగడం వల్ల ఫిట్నెస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఫుట్బాల్ మాంత్రికుడు లియోనెల్ మెస్సీ ఇప్పటికీ జట్టుకు గుండెకాయలా ఆడుతున్నప్పటికీ.. టోర్నీ ఆద్యంతం అతని శారీరక పరిస్థితి ఎలా ఉంటుందనేది అత్యంత కీలకం. గ్రూప్ దశలో ఆస్ట్రియా, అల్జీరియా వంటి ఉత్సాహవంతమైన యువ జట్లు అర్జెంటీనాకు గట్టి సవాల్ విసిరే ప్రమాదం ఉంది.
స్టార్ ప్లేయర్: లియోనెల్ మెస్సీ

పోర్చుగల్: రొనాల్డో ప్లస్సా.. మైనస్సా?

ఈ టైటిల్ ఫేవరెట్ల జాబితాలో ముందు వరుసలో నిలుస్తున్న జట్టు పోర్చుగల్. జట్టులో బోలెడంత మంది నాణ్యమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ప్రపంచం దృష్టి మాత్రం ఇంకా క్రిస్టియానో రొనాల్డోపైనే ఉంది. 41 ఏండ్ల వయసులో కూడా అతడు గోల్స్ చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నప్పటికీ.. గత వరల్డ్ కప్ తర్వాత అత్యున్నత స్థాయి అంతర్జాతీయ మ్యాచ్లలో స్థిరంగా ఆడిన సందర్భాలు తక్కువగా కనిపించాయి. దీనికి తోడు జట్టులో రొనాల్డోకు ప్రత్యామ్నాయంగా నిలిచే మరో ప్రధాన స్ట్రైకర్ ఎంపిక చాలా పరిమితంగా ఉండటం కూడా మేనేజ్మెంట్ను కలవరపెడుతున్నది. మైదానంలో జట్టు వ్యూహాలు మళ్లీ రొనాల్డో చుట్టూనే తిరిగే పరిస్థితి కనిపిస్తున్నది. అయితే ఇదే వారి విజయానికి అతిపెద్ద బలం కావచ్చు లేదా కొంపముంచే బలహీనత కూడా కావచ్చు.
స్టార్ ప్లేయర్: క్రిస్టియానో రొనాల్డో

ఒక్క తప్పిదం.. భారీ మూల్యం

దిగ్గజ జట్లు పేపర్పై టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నప్పటికీ.. వరల్డ్ కప్ అసలు సిసలు మజా ఏమిటంటే.. ఇక్కడ మైదానంలో జరిగే ‘ఒక్క చిన్న తప్పిదం’ కూడా కోలుకోలేని దెబ్బతిస్తుంది. 39 రోజుల పాటు సుదీర్ఘంగా సాగే ఈ మెగా టోర్నీలో కేవలం ఆటగాళ్ల పేర్లు, పాత రికార్డులు మాత్రమే కప్పును తెచ్చిపెట్టవు. మైదానంలో ఆటగాళ్ల అత్యుత్తమ ఫిట్నెస్, నరాలు తెగే ఒత్తిడిలోనూ సెకన్ల వ్యవధిలో సరైన నిర్ణయాలు తీసుకునే టైమ్ మేనేజ్మెంట్, ప్రత్యర్థి వ్యూహాలను తిప్పికొట్టే కోచ్ల టెక్నికల్ ప్లాన్స్ ఎవరైతే పక్కాగా అమలు చేస్తారో వారే విశ్వవిజేతగా నిలుస్తారు. మరి రికార్డుల వేటలో ఫేవరెట్లు నిలుస్తాయో లేక సరికొత్త చరిత్ర ఆవిష్కృతమవుతుందో చూడాలి.

తాజా ఫిఫా ర్యాంకింగ్స్ లో టాప్-6 స్థానాలు

ప్రస్తుత ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న జట్ల అధికారిక బలాబలాలను స్పష్టం చేస్తూ ఫిఫా ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో టాప్-6 స్థానాలు ఇలా ఉన్నాయి.
1. అర్జెంటీనా – 1877.27 పాయింట్లు
2. స్పెయిన్ – 1874.71 పాయింట్లు
3. ఫ్రాన్స్ – 1870.70 పాయింట్లు
4. ఇంగ్లండ్ – 1827.05 పాయింట్లు
5. పోర్చుగల్ – 1766.18 పాయింట్లు
6. బ్రెజిల్ – 1765.86 పాయింట్లు
– ఫిఫా మ్యాచ్‌లను టీవీలో Unite8 Sports ఛానళ్లలో, మొబైల్ లేదా ల్యాప్టాప్లో అయితే జీ5 యాప్‌ ద్వారా చూడొచ్చు.
– ఓపెనింగ్ మ్యాచ్: జూన్ 11న మెక్సికో వర్సెస్ సౌత్ ఆఫ్రికా
ఫైనల్ మ్యాచ్: జులై 19న (వేదిక: మెట్‌లైఫ్ స్టేడియం, న్యూజెర్సీ)

Read Also: కేంద్ర కేబినెట్ భేటీ.. తెలంగాణకు మళ్లీ గాడిద గుడ్డు!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>