Mobile Popup Ad
Mobile Popup Ad

శ్రీరాంసాగర్ డెడ్ స్టోరేజ్.. సాగు సాధ్యమేనా!

కలం, నిజామాబాద్ బ్యూరో : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ (Sriram Sagar) ప్రాజెక్టు లో నీటి నిల్వలు గణనీయంగా తగ్గడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు కాగా, మొత్తం నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు. ప్రస్తుతం జలాశయంలో కేవలం 16 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఇందులో సుమారు 5 టీఎంసీలు డెడ్ స్టోరేజీ కాగా, మరో 5 టీఎంసీలు తాగునీటి అవసరాలకు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో సాగునీటికి అందుబాటులోని నీరు కేవలం 6 టీఎంసీలకే పరిమితమైంది. ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో సుమారు 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గత సీజన్‌లో ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద జలాలు వచ్చినప్పటికీ, జలాశయంలో పేరుకుపోయిన పూడిక కారణంగా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేకపోయారు. ఫలితంగా భారీగా నీటిని దిగువకు విడుదల చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో మెండోరా, బాల్కొండ, ముప్కాల్ మండలాల్లో భూగర్భ జలాలు క్షీణిస్తున్నాయని, బోర్లు ఎండిపోతున్నాయని రైతులు చెబుతున్నారు. జలాశయంలో పేరుకుపోయిన పూడికను తొలగించి నిల్వ సామర్థ్యాన్ని పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్తులో తాగునీరు, సాగునీటి సమస్యలు మరింత తీవ్రమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్రలో పడే వర్షాలపైనే ఆశలు..

ప్రధానంగా మహారాష్ట్రలో కురిసే వర్షాల ద్వారానే ప్రాజెక్టుకు వరద జలాలు చేరుతాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తేనే నీరు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలపై వస్తున్న హెచ్చరికలు ఆయకట్టు రైతులతో పాటు ప్రజల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీరాంసాగర్ (Sriram Sagar) ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే, ఎక్కువసార్లు ఆగస్టు చివరి వారం నుంచి సెప్టెంబర్ లో భారీ వరదలు వచ్చి జలాశయం నిండిన సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈసారి వర్షాభావ పరిస్థితులు కొనసాగి, జూన్, జులై, ఆగస్టు నెలల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోతే నీటి విడుదలలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులు ఏర్పడితే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>