కలం, నల్లగొండ బ్యూరో : రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు బిల్లుల చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో చేసిన పనులకు సంబంధించిన రూ.20 వేల కోట్లకు పైగా బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ (Telangana Builders Association) డిమాండ్ చేసింది. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పనులను నిలిపివేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తమ ఆవేదనను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ నెల 18న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అష్యూరెన్స్‌తో అమలు చేసిన స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ (SDF) పనులకు సైతం ఇప్పటికీ చెల్లింపులు జరగలేదని చెబుతున్నారు. గతంలో బిల్లులు వేగంగా చెల్లించేవారని, ప్రస్తుతం ఏళ్లు గడిచినా నిధులు విడుదల కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటున్నారు.
అప్పులకు వడ్డీలు చెల్లించలేక..
పనులు పూర్తి చేసేందుకు బ్యాంకులు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తీసుకున్న కాంట్రాక్టర్లు ఇప్పుడు వాటి వడ్డీలు చెల్లించలేని పరిస్థితికి చేరుకున్నారు. కార్మికులకు వేతనాలు, సరఫరాదారులకు బకాయిలు చెల్లించలేక ఆర్థికంగా కుదేలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిల్లుల చెల్లింపులో సీనియారిటీ విధానం పాటించడం లేదని, పాత బిల్లులు పెండింగ్‌లో ఉండగానే కొత్త బిల్లులు క్లియర్ అవుతున్నాయని ఆరోపిస్తున్నారు.
అనవసర పనులు రద్దు
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని తాము అర్థం చేసుకుంటున్నామని, అయితే నిధులు లేని పరిస్థితిలో కొత్త పనులకు అనుమతులు ఇవ్వకుండా, నాన్-ప్రయారిటీ పనులను రద్దు చేసి తమ డిపాజిట్లు తిరిగి చెల్లించాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. తద్వారా రుణభారం నుంచి బయటపడే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు.
18న ‘చలో హైదరాబాద్’
తమ సమస్యలను నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దృష్టికి తీసుకెళ్లేందుకు కాంట్రాక్టర్లు ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలను సంప్రదించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చర్చలు జరపకపోతే రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులను నిలిపివేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపులు, కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం కోసం జూన్ 18న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్ (Telangana Builders Association) ప్రకటించింది.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్టర్లు ఇందులో పాల్గొననున్నట్లు తెలిపింది. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాలేదన్న విషయాన్ని తాము కూడా అర్థం చేసుకుంటామని, అందుకే అనవసరమైన పనులను వెంటనే రద్దు చేసి, తమ డిపాజిట్లను తమకు తిరిగి ఇచ్చేసి రుణ విముక్తులను చేయాలని కాంట్రాక్టర్లు కోరుతున్నారు. గతంలో పక్క రాష్ట్రంలో కూడా కొత్త ప్రభుత్వం రాగానే ఇలాంటి పనులను రద్దు చేసి కాంట్రాక్టర్లను ఆదుకున్న జీవోలను వారు గుర్తు చేస్తున్నారు. తమ ఆవేదనను నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు, ఇప్పటికే జానారెడ్డి, ప్రొఫెసర్ కోదండరామ్ వంటి పెద్దలను సంప్రదించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేయకపోతే, ఎక్కడికక్కడ పనులు నిలిపివేస్తామని కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
Read Also: కేంద్ర కేబినెట్ భేటీ.. తెలంగాణకు మళ్లీ గాడిద గుడ్డు!
Follow Us On: Instagram

