కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని ఐటీ హబ్ కొండాపూర్ పరిధిలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు ముమ్మర తనిఖీలు (TGMC Raids) చేపట్టారు. ఎలాంటి అర్హతలు, అనుమతులు లేకుండా చర్మ, కేశ సంరక్షణ చికిత్సలు అందిస్తున్న పలు క్లినిక్‌లపై ఈ దాడులు జరిగాయి. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన మూడు ప్రముఖ సంస్థల అక్రమాలు వెలుగుచూశాయి.
కొండాపూర్‌లోని నియో స్కిన్ క్లినిక్‌లో కనీస అర్హత గల డెర్మటాలజిస్ట్ లేరని, అవసరమైన ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఇక్కడ చికిత్సలు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అలాగే ఓరా ఈస్తటిక్స్ క్లినిక్‌లో డెంటిస్టులుగా రిజిస్టర్ అయిన వైద్యులు, తమ పరిధి దాటి చర్మ, కేశ సౌందర్య చికిత్సలు చేస్తున్నట్లు దాడుల్లో తేలింది. వీటితో పాటు ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ త్రయా హెయిర్ లాస్ సొల్యూషన్స్ సంస్థ ఎలాంటి క్లినికల్ రిజిస్ట్రేషన్ లేకుండా, క్వాలిఫైడ్ డెర్మటాలజిస్టులు లేకుండానే ఆన్‌లైన్ కన్సల్టేషన్లు నిర్వహిస్తోందని అధికారులు స్పష్టం చేశారు.
ఈ ఉల్లంఘనలపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC), సదరు సంస్థలపై నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 లోని సెక్షన్ 34, 54 కింద చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. ఈ అనధికారిక కేంద్రాలను సీజ్ చేయాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయడంతో పాటు, ఇలాంటి నకిలీ క్లినిక్‌లకు సహకరిస్తున్న రిజిస్టర్డ్ వైద్యులపై కూడా కఠిన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని హెచ్చరించింది. నిబంధనలు మీరిన వైద్యుల లైసెన్స్‌లను సైతం రద్దు చేస్తామని కౌన్సిల్ స్పష్టం చేసింది.
Read Also: నేటి నుంచే ఫిఫా వరల్డ్ కప్.. ఈసారి ఆ చరిత్రను తిరగరాస్తారా?
Follow Us On : WhatsApp

