కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా యుద్ధం చేస్తున్న వేళ ఇరాన్ దేశం హర్మూజ్ జలసంధిని నిలిపివేయగా.. కొద్ది రోజుల క్రితం కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. కేంద్రం చొరవతో హర్మూజ్ జలసంధి కూడా చమురు, ఎల్పీజీ సరఫరా నిరంతరంగా కొనసాగుతున్నా.. ప్రజల్లో ఇంక భయాలు వీడడం లేదు. యుద్ధం ఎఫెక్ట్ తో రానున్న కాలంలో ఎల్పీజీ, చమురు సరఫరా నిలిచిపోవచ్చని.. నిత్యావసర ధరలు కూడా పెరుగొచ్చనే ప్రచారం నెట్టింట జరుగుతోంది. దీంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో నిత్యావసర ధరలపై కేంద్రం (India Government) తాజాగా కీలక ప్రకటన చేసింది.
దేశంలో నిత్యావసర ధరలు పెరగలేదని, ఆహార ధాన్యాల ధరల్లో కూడా ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఉల్లి, టమాటా, ఆలుగడ్డతోపాటు గోధుమ, బియ్యం ధరల్లోనూ మార్పులేదని స్పష్టం చేసింది. దేశంలో గోధుమలు, బియ్యం నిల్వలు అవసరానికి మించి అందుబాటులో ఉన్నాయని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడించింది. బఫర్ స్టాక్ నిబంధనల కంటే మూడు రెట్లు అధికంగా నిల్వలు ఉన్నాయని పేర్కొంది. ఈ నిల్వలు ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) అవసరాలను తీర్చడమే కాకుండా, ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సరిపోతాయని వివరించింది.
అటు దేశంలో ఎల్పీజీ సరఫరా సమృద్ధిగా ఉందని కేంద్రం వెల్లడించింది. బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించింది. ముడి చమురు సరఫరా తగినంతగా ఉందని.. రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని తెలిపింది. అలాగే దిగుమతులు కూడా నిరంతరంగా కొనసాగుతున్నాయని పేర్కొంది. ప్రజలు వదంతులను నమ్మవద్దని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది.
Read Also: మంత్రి సొంత జిల్లాలో మంచినీళ్ళకు కరువు
Follow Us On : WhatsApp

