కలం, వరంగల్ బ్యూరో: ‘చీప్ లిక్కర్ పడ్తలేదు… బంద్ చేసిన… పెద్దదే బ్రాండెడ్ మందు తాగుతాన్న.. జరా గదే ఇయ్యండి.. లేకుంటే వద్దు’ తెలంగాణ పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) వేళ ప్రస్తుతం ఊళ్లల్లో మద్యం ప్రియులైన ఓటర్ల నుంచి ఈ డిమాండ్ వినిపిస్తోందంట. సర్పంచ్, వార్డ్ సభ్యులుగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో పల్లెలు మత్తులో జోగుతున్నాయి. చీకటి పడితే చాలు పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొంటోంది. అభ్యర్థులు ఓటర్లకు చుక్క, ముక్క పంపిణీ చేస్తూ గెలుపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. యువతను సైతం ఆకర్షిస్తున్నారు. వారికి కూడా మద్యం సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పల్లెలు ఎన్నికల కిక్కుతో ఉగిపోతున్నాయి.
ఓట్ల కోసం పాట్లు
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత ప్రచారం ముగిసింది. ఇక పోలింగ్ జరగడమే తరువాయి. మరి కొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా ఓట్లు రాబట్టుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే మద్యం డంప్ చేసుకున్న అభ్యర్థులు చీకటి పడితే చాలు ఓటర్లను కలిసి క్వార్టర్ సీసాలు అందజేస్తున్నారు. ఎక్కడిక్కడే ఆయా వార్డుల్లో తన మనుషులను ఎంపిక చేసుకుని వ్యవహారం చక్కబెడుతున్నారు. జర మా గుర్తుంచుకుని ఓటేసి గెలిపించండి. ఏమైనా తక్కువైతే తర్వాత చూసుకుందాం అంటూ హామీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది.
నోటుకు ఓటు
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో (Panchayat Elections) మందుతోపాటు మనీ కూడా ఓటర్లను ప్రభావితం చేస్తోంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి పలువురు పోటీదారులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. నామినేషన్ నాటి నుంచి ప్రచారం నిర్వహించిన క్రమంలో ఉదయం టీ, టిఫిన్‌లు మొదలుకుని పాన్, సిగరెట్, సాయంత్రం మందు ఖర్చు కూడా భరిస్తున్నారు. ఇక ఓటర్లను ప్రభావితం చేసుకునేందుకు ఓటుకు రూ. 500 నుంచి రూ. 1000 పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. కొన్ని గ్రామాల్లో డబ్బులు ఇస్తే కానీ ఓటసేది లేదని ఖరా ఖండిగా చెబుతున్నట్లు తెలుస్తోంది. ఫలానా వాళ్ళు మూకుమ్మడిగా ఓట్లు వేసే పరిస్థితి ఉన్న చోట పెద్ద మొత్తంలో ప్యాకేజిలు ఇస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మేజర్ గ్రామ పంచాయతీ స్థానాలకు పోటీలో చేసే సర్పంచ్ అభ్యర్థులకు ఖర్చు తడిసి మోపెడు అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
Read Also: గూగుల్ ఏఐ ప్లస్ వచ్చేసింది
Follow Us On: Youtube


