epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇండిగో ఎఫెక్ట్.. డ్యూటీ టైమింగ్స్ మార్చాలంటున్న రైల్వే లోకో పైలట్స్

కలం డెస్క్ : విమానం నడిపే పైలట్ల (Pilot) పై పనిభారం ఎక్కవవుతున్నదని, తగినంత రెస్టు ఉండాలని, లేదంటే ప్రయాణికుల భద్రతకు ముప్పు ఏర్పడుతుందంటూ ఇటీవల పౌర విమానయాన శాఖ (DGCA) కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దీన్ని సక్రమంగా పాటించలేదన్న ఆరోపణలతో ఇండిగో (INDIGO) సంక్షోభం తలెత్తింది. ఆ వరుసలోనే ఇప్పుడు రైల్వే లోకో పైలట్లు (Loco Pilots) సైతం ఆరు గంటల పనివిధానం కావాలని డిమాండ్ చేస్తున్నారు. 1940వ దశకం చివర్లోనే దీని కోసం కార్మికులు కొట్లాడారని, చివరకు దాన్ని 10 గంటలకు కుదించారని అఖిల భారత లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (AILRSA) ప్రస్తావించింది. ప్రైవేటు ఎయిర్ లైన్స్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోని రైల్వే శాఖపై మాత్రం భిన్నమైన వైఖరి తీసుకోవడం సరైంది కాదని అసోసియేషన్ పేర్కొన్నది.

లోకో పైలట్ల (Loco Pilots) కు తగిన విశ్రాంతి కావాలి :

కొద్దిమంది పైలట్లు 22-23 గంటల పాటు అవిశ్రాంతంగా డ్యూటీ చేస్తున్నారని, రెస్ట్ ఉండడం లేదని, పనిభారం ఎక్కువ కావడంతో శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారని అసోసియేషన్ పేర్కొన్నది. వేలాది మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చే బాధ్యతల్లో ఉన్న లోకో పైలట్లు ఎప్పడూ అప్రమత్తంగా ఉండక తప్పదని అసోసియేషన్ ప్రతినిధులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం వరుసగా రెండు నైట్ షిప్ట్ డ్యూటీలు లోకో పైలట్లకు ఉండకూడదని గుర్తుచేశారు. శారీరక, మానసిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిబంధన వచ్చిందని, కానీ ఇప్పుడు దీనికి భిన్నంగా డ్యూటీలు పడుతున్నాయన్నారు. వీక్లీ రెస్ట్ నిబంధన సైతం సక్రమంగా అమలుకావడంలేదన్నారు. ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తే రైల్వే శాఖ, రైల్వే బోర్డు వారిపై క్రమశిక్షణా చర్యలంటూ మెమోలు, నోటీసులు జారీచేస్తున్నదన్న ఆందోళన వ్యక్తం చేశారు.

అనిల్ కకోడ్కర్ కమిటీ సిఫారసుల్లోనే… :

విమానాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పాటు గ్రౌండ్ స్టాఫ్ నుంచి ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అందుతూ ఉంటుందని, రైల్వే శాఖలో గతంతో పోలిస్తే టెక్నాలజీ పెరిగినా ఇప్పటికీ చాలా పనులు మాన్యువల్‌గానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలు, రైలు ప్రమాదాలు, కల్పించాల్సిన భద్రతపై గతంలో (2012) అనిల్ కకోడ్కర్ కమిటీ, ఆ తర్వాత 2013లో డీపీ త్రిపాఠి కమిటీలు లోతుగా స్టడీ చేసి డ్యూటీ అవర్స్ (Duty Hours)పై స్పష్టమైన సిఫారసులు చేసిందని ప్రస్తావించారు. కానీ రైల్వే శాఖ లోకో పైలట్ల (Loco Pilots) ఆరోగ్య, డ్యూటీ అంశాల్లో తీవ్ర నిర్లక్ష్యంగా ఉన్నదని ఆరోపించారు. ఇటీవల జరిగిన రెండు రైలు ప్రమాదాల్లో ఒక లోకో పైలట్ కంటిన్యూగా 20 గంటలుగా డ్యూటీలోనే ఉన్నట్లు తేలిందని గుర్తుచేశారు. మరో ప్రమాదంలో అసిస్టెంట్ లోకో పైలట్ దాదాపు 23 గంటలు విశ్రాంతి లేకుండా డ్యూటీలోనే ఉండాల్సి వచ్చిందన్నారు.

రెస్ట్ అవర్స్ పై రైల్వే శాఖ నిర్లక్ష్యం :

నిబంధనల ప్రకారం ప్రతీ లోకో పైలట్‌కు సంవత్సరానికి 52 రెస్ట్ హాలీడేస్ ఉండాలని కానీ చాలా సందర్భాల్లో ఇది మాగ్జిమమ్‌గా 48 దాటడం లేదన్నారు. లెక్క ప్రకారం ఒక రెస్ట్ హాలీడే అంటే 30 గంటలు అని గుర్తుచేశారు. రోజుకు కనీసంగా 16 గంటల పాటు రెస్ట్ ఉండాలన్న నిబంధన విషయంలోనూ నిర్లక్ష్యం ఉన్నదన్నారు. ఒకవైపు కార్మికు భద్రత కోసం సంస్కరణలు, లేబర్ కోడ్‌లు అని కేంద్ర ప్రభుత్వం చెప్తూనే మరోవైపు లోకో పైలట్‌ల విషయంలో మాత్రం శీతకన్ను వేస్తున్నదని వ్యాఖ్యానించారు. పైలట్‌లు ఒక డ్యూటీ చేసిన తర్వాత తప్పనిసరిగా 16 గంటల రెస్టు అవసరమని, డ్యూటీ అవర్స్ 6 గంటలకు మించరాదని డిమాండ్ చేశారు.

Read Also: మీ డబ్బు మీరు తీసుకోండి : ప్రధాని మోదీ

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>