కలం, వెబ్ డెస్క్ : రామాయణ కాలంలోనూ తెలుగు భాష ఉన్నట్లు ఇటీవల కొన్ని ఆధారాలను గుర్తించారని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) తెలిపారు. గుంటూరులో జరుగుతున్న తెలుగు మహాసభల్లో (Telugu Mahasabhalu) ఆయన పాల్గొని ప్రసంగించారు. నన్నయ్య, తిక్కన, వేమన, కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామ్మూర్తి, ఉన్నవ లక్షీనారాయణ, సురవరం ప్రతాపరెడ్డి, ఎన్టీఆర్, రామోజీరావు లాంటి చాలామంది మహనీయులు తెలుగు భాష ఉన్నతికి పాటుపడ్డారని గుర్తు చేశారు. మాతృభాషలోనే చదువుకున్న చాలామంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారని ఆయన తెలిపారు.
కానీ, ఈ తరం తల్లిదండ్రులు తెలుగు భాష నేర్చుకోవడం అవసరం లేదని భావిస్తున్నారని వెంకయ్యనాయుడు చెప్పారు. తెలుగు వాళ్లు అయ్యుండి తెలుగు భాష మాట్లాడకపోతే ఏదో లోపం ఉన్నట్లేనని వెంకయ్యనాయుడు తెలిపారు. అమ్మ అని పిలుస్తే అంతరాళం నుంచి వస్తుంది.. అదే మమ్మీ అని పిలిస్తే నోటి నుంచి మాత్రమే వస్తుందన్నారు. మాతృభూమిని, మాతృభాషను, మాతృమూర్తిని మరిచినవాళ్లు మనుషులే కాదని వెల్లడించారు. మతృభాషను మరిచిపోతే శ్వాస పోయినట్లేనని.. తెలుగు భాషను కాపాడుకోవడానికి తెలుగులో మాట్లాడితే సరిపోతుందని వెంకయ్యనాయుడు సూచించారు.

Read Also: చంద్రబాబుతో ధోనీ మీటింగ్.. ఎందుకంటే..?
Follow Us On: Pinterest


