కలం డెస్క్: గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన ప్రాణహిత-చేవెళ్ళ సాగునీటి ప్రాజెక్టును(Pranahita Chevella Project) టాప్ ప్రయారిటీతో పూర్తి చేస్తామని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. మైలారం నుంచి 71 కి.మీ. గ్రావిటీ కెనాల్ ద్వారా నీటిని ప్రాణహిత నుంచి తీసుకుని సుందిళ్ళ పంప్ హౌజ్ కు చేర్చడం ఒక మార్గం కాగా, ఎల్లంపల్లి నుంచి నీటిని తరలించడానికి కొత్తగా ఒక పంప్ హౌజ్ ను నిర్మించడం రెండో ప్రత్యామ్నాయమని తెలిపారు.
ఈ రెండింటికి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక అంశాలతో పాటు విద్యుత్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని రిపోర్టులు రెండు వారాల్లో అధికారులు రెడీ చేస్తారని, ఈ నెల 22 తర్వత జరిగే రాష్ట్ర మంత్రివర్గంలో చర్చించి ఫైనల్ అవుతాయన్నారు. ఇరిగేషన్ అధికారులతో మంగళవారం జరిపిన రివ్యూ మీటింగ్ లో మంత్రి పై క్లారిటీ ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram) భాగంగా ఉన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలను సైతం ఎన్డీఎస్ఏ సిఫారసుల మేరకు రిపేర్ చేసి వినియోగంలోకి తేవడానికి రాష్ట్ర సర్కార్ అడుగులు వేసింది. భవిష్యత్తులో నీటి నిల్వతో ఈ బ్యారేజీలకు ముప్పు లేకుండా ఏ తరహాలో నిర్మించాలో డిజైన్ విషయంలోనూ నిపుణుల నుంచి సూచనలు, సలహాలను తీసుకుంటున్నామన్నారు. రుతుపవనాలకు ముందు, తర్వాత పరిస్థితులను అధ్యయనం చేస్తామన్నారు. ఇప్పటికే నిర్మాణ సంస్థలను ఫైనల్ చేసేలా టెండర్లు విడుదలైనట్లు గుర్తుచేశారు. సంవత్సర కాలంలో ఈ బ్యారేజీల మరమ్మత్తు పనులు పూర్తికావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రముఖ ఐఐటీ ఇందుకు టెక్నికల్ భాగస్వామిగా ఉంటుందన్నారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్సెల్బీసీ) టన్నెల్ గురించి మంత్రి ఉత్తమ్ ప్రస్తావిస్తూ, 43 కి.మీ. ఈ మార్గం టెక్నికల్ గా సవాళ్ళతో కూడుకుని ఉన్నదని, హెలికాప్టర్ ద్వారా ఏరియల్ మాగ్నెటిక్ సర్వే నిర్వహిస్తామని, ఇందుకోసం ఇప్పటికే పౌర విమానయాన శాఖ అనుమతి కోసం డైరెక్టర్ జనరల్ కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. టన్నెల్ తవ్వకం పనుల్లో ఇటీవల జరిగిన ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని నేషనల్ జియోలాజికల్ సర్వే సంస్థ సహకారాన్ని తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండేండ్లలో (2027 డిసెంబరు నాటికి) టన్నెల్ పనులను పూర్తిచేసి వినియోగంలోకి తేవాలనుకుంటున్నట్లు మంత్రి(Uttam Kumar Reddy) తెలిపారు.

