తెలంగాణలో జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నిక హీట్ రోజురోజుకు పెరుగుతోంది. అందరి కళ్లు ఈ ఉపఎన్నికపైనే ఉన్నాయి. అంతేకాకుండా ఈ ఉపఎన్నికలో పోటీ చేయడానికి టికెట్ కోసం పోటీ పడుతున్న నేతల సంఖ్య కూడా అంతే అధికంగా ఉంది. పక్క జిల్లాల నుంచి జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ కోసం పోటీ పడుతున్న నేతలు ఉన్నారు. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వారిలో కొందరు పేర్లు అధికంగా వినిపిస్తున్నాయి. వారిలో మాజీ మేయర్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బొంతు రామ్మోహన్(Bonthu Rammohan) పేరు కూడా ఒకటి. అయితే తాజాగా ఉపఎన్నిక బరిలో తన అభ్యర్థిత్వంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను అసలు పోటీలోనే లేనని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకు తాను జూబ్లీహిల్స్ టికెట్ కావాలని అడగలేదన్నారు.
‘‘అభ్యర్థిని అధిష్ఠానమే నిర్ణయిస్తుంది. టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా ఎప్పుడూ కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేస్తా. జూబ్లీహిల్స్ అభ్యర్థి కోసం నలుగురు పేర్లను పీసీసీ ప్రతిపాదించింది’’ అని చెప్పారు. అయితే సీఎం రేవంత్ సూచనలతో.. నవీన్ యాదవ్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్(Bonthu Rammohan), కార్పొరేటర్ సీఎన్ రెడ్డిల పేర్లను అధిష్ఠానానికి పంపింది. వీరిలో ఒకరి పేరును ఏఐసీసీ అధికారింగా ప్రకటించనుంది.
ఇదిలా ఉంటే జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్‌కు ఖరారు అయినట్లు పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఈ ఉపఎన్నికలో స్థానిక నేతకే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్(Naveen Yadav) వైపే సీఎం రేవంత్ రెడ్డి మొగ్గు చూపారని, ఆయన సూచనల మేరకు అధిష్ఠానం కూడా నవీన్‌ను ఖరారు చేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

