విశాఖపట్నం జిల్లాలో పర్యటించడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్(YS Jagan) సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే విశాఖ నుంచి మాకవరపాలెం(Makavarapalem) వరకూ రోడ్ షో నిర్వహించాలని వైసీపీ నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే రోడ్‌షోకు అనుమతులు కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేసుకుంది. అయితే రోడ్ షోకు పర్మిషన్ ఇవ్వలేమని అనకాపల్లి జిల్లా ఎస్పీ తూహిన్ సిన్హా వెల్లడించారు. మాకవరపాలెంలో నిర్మితమవుతున్న మెడికల్ కాలేజీ పనులను పరిశీలించడం కోసం జగన్.. అక్టోబర్ 9న వెళ్లనున్నారు. ఇందులో భాగంగానే రోడ్ షో నిర్వహించాలని భావించారు. ఈ మేరకు జగన్ పర్యటన వివరాలను ఎస్పీ వెల్లడించారు.
‘‘మాజీ ముఖ్యమంత్రి జగన్(YS Jagan).. విశాఖ నుంచి మాకవరపాలెం వరకు 63 కిలోమీటర్ల జాతీయ రాహదారిపై కాన్వాయ్‌తో రావడానికి వైసీపీ శ్రేణులు అనుమతులు కోరాయి. కాగా, విశాఖ నుంచి మాకవరపాలెం వరకు హెలికాప్టర్‌లో వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. జాతీయ రహదారి రోడ్డ మార్గంలో కూడళ్ల దగ్గర జనసమీకరణ చేసే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం అందింది. అలా జరిగితే ట్రాఫిక్ సమ్యలు, ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది. అందుకనే జగన్ రోడ్ షో కు అనుమతులు ఇవ్వలేదు. మాకవరపాలెం మెడికల్ కాలేజీ దగ్గర హెలిపాడ్ ఏర్పాటు చేసి జగన్.. మెలికాప్టర్‌లో వచ్చేలా అనుమతులు ఇచ్చాం’’ అని చెప్పారు. ఇటీవల తమిళనాడులో విజయ్ నిర్వహించిన రోడ్‌షోలో ప్రమాదం సంభవించి 41 మంది మరణించారని, అటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటం కోసమే తాము అనుమతులు ఇవ్వలేదని అన్నారు.

