జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన 24 గంటల్లోనే కాంగ్రెస్ పార్టీకి ఊహించని తలనొప్పి మొదలైంది. నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కీలక నేత, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్ట్ లో ఉన్న నవీన్ యాదవ్(Naveen Yadav) పై క్రిమినల్ కేసు నమోదైంది. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు నవీన్ యాదవ్ ఓటరు ఐడి కార్డులు పంపిణీ చేస్తున్నట్లు వీడియోలు వైరల్ గా మారాయి. ఇది ఎన్నికల నిబంధనలను ప్రత్యక్షంగా ఉల్లంఘించడమేనని ఎన్నికల అధికారి రంజిత్ రెడ్డి మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో నవీన్ యాదవ్ పై బీఎన్ఎస్ 170, 171, 174తో పాటు ప్రజాప్రాతినిధ్య చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నిక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలకి చాలా కీలకమైన ఎన్నిక కానుంది. నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం ఖాళీ అయింది. గోపీనాథ్ భార్య సునీతా గోపీనాథ్‌ను BRS అభ్యర్థిగా ప్రకటించగా, కాంగ్రెస్ అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ను రెడీ చేసింది. నేడో, రేపో అభ్యర్థి పేరు ప్రకటన చేసే అవకాశం ఉంది. బీజేపీ మాత్రం ఇంకా అభ్యర్థుల కోసం వెతుకుతోంది.
నవీన్ యాదవ్(Naveen Yadav) కి టికెట్ దక్కేనా?
నవీన్ యాదవ్ గత ఎన్నికల్లో గోపీనాథ్ చేతిలో ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి ఎంఐఎం అభ్యర్థిగా ఓడిపోయారు. ఇక నవీన్ యాదవ్ కాకుండా, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్ మోహన్, సీఎన్ రెడ్డి పేర్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో తాజా కేసులు నవీన్ యాదవ్ కి టికెట్ ని దూరం చేస్తాయనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

