US Economy | కీలకమైన బిల్లులపై అధికార, విపక్ష చట్టసభ సభ్యుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ను ఎదుర్కొంటోంది. ఇప్పటికే 31 రోజులుగా షట్ డౌన్ కొనసాగుతుండగా, దేశ ఆర్థిక వ్యవస్థకు 7 బిలియన్ డాలర్ల (రూ.62,000 కోట్లకు పైగా) సీబీవో అంచనా వేసింది. సీబీఓ నివేదిక ప్రకారం ఈ షట్‌డౌన్ ఆరు వారాల పాటు కొనసాగితే నష్టం 11 బిలియన్ డాలర్లకు, ఎనిమిది వారాలైతే 14 బిలియన్ డాలర్లకు చేరుతుంది.
ప్రభుత్వానికి అవసరమైన నిధుల విడుదల బిల్లుపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. కొన్ని సామాజిక, రక్షణ, భద్రతా అంశాలపై ఇరువర్గాల మధ్య రాజీ లేకపోవడంతో నిధుల మంజూరు ఆగిపోయింది. దాంతో అనేక ఫెడరల్ కార్యాలయాలు మూతపడ్డాయి. పాస్‌పోర్ట్, వీసా, జాతీయ పార్కులు, విమాన సురక్షిత విభాగం వంటి పలు సేవలు నిలిచిపోయాయి.
ఉద్యోగులు వేతనాలు బంద్
ఉద్యోగులు వేతనాలు లేకుండా ఇంట్లోనే ఉండిపోతున్నారు. ప్రభుత్వ సేవల నిలుపుదల కారణంగా పౌరులు రోజువారీ వ్యవహారాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ షట్‌డౌన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తోందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేపీఎంజీ చీఫ్ ఎకానమిస్ట్ డయాన్ స్వాంక్ మాట్లాడుతూ “ఇది తాత్కాలిక సమస్య కాదు. షట్‌డౌన్ కొనసాగితే ఆర్థిక వ్యవస్థపై తీవ్ర నష్టం వాటిల్లుతుంది.’’ అని అన్నారు. మూడీస్ అనలిటిక్స్‌కు చెందిన మార్క్ జాండీ కూడా “అమెరికా ఆర్థిక పరిస్థితి ఇప్పటికే సున్నితంగా ఉంది. ప్రభుత్వ మూసివేత వల్ల పెట్టుబడులు తగ్గి, మార్కెట్లు కుదేలవుతాయి’’ అని తెలిపారు.
ఉద్యోగాల కల్పన ఆగిపోనున్నదా?
ఇప్పటికే బలహీనంగా ఉన్న ఉద్యోగ మార్కెట్‌పై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్థిక, విధానపరమైన అనిశ్చితి కారణంగా అనేక సంస్థలు కొత్త నియామకాలు నిలిపివేశాయి. కొన్ని కంపెనీలు కృత్రిమ మేధ, ఆటోమేషన్ వైపు మొగ్గుచూపుతూ ఉద్యోగాల కోతకు దారితీస్తున్నాయి. ప్రతివారం షట్‌డౌన్ కొనసాగితే దేశ జీడీపీ వృద్ధి 0.1 నుంచి 0.2 శాతం పాయింట్లు తగ్గవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
1981 నుంచి అమెరికా ప్రభుత్వం 15 సార్లు షట్ డౌన్‌కు గురైంది. 2018–19లో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 35 రోజులపాటు కొనసాగిన షట్‌డౌన్ దేశ చరిత్రలోనే సుదీర్ఘమైనదిగా నిలిచింది. ప్రస్తుత పరిస్థితుల్లో చట్టసభలో రాజీ సూచనలు కనబడకపోవడంతో, ఈ సారి రికార్డును మించిపోతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రపంచ మార్కెట్లపై ప్రభావం
అమెరికా ఆర్థిక వ్యవస్థ కుదేలయితే ప్రపంచ వ్యాపార వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం తప్పదని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. డాలర్ బలహీనత, వడ్డీ రేట్ల పెరుగుదల, గ్లోబల్ పెట్టుబడుల్లో తగ్గుదల వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరతకు దారితీసే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇరుపార్టీల మధ్య రాజకీయ సయోధ్యే ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం కావొచ్చని విశ్లేషకులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ప్రభుత్వ మూసివేత అమెరికా చరిత్రలో మరో సుదీర్ఘ, సంక్లిష్టమైన అధ్యాయంగా నిలవవచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. “షట్‌డౌన్ రాజకీయ విభేదాల ఫలితం అయినా, దాని మూల్యం చెల్లించేది సాధారణ ప్రజలే’’ అని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
షట్‌డౌన్ అంటే ఏమిటి?
‘షట్‌డౌన్’ అంటే అమెరికా ప్రభుత్వ కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిచిపోవడం. ప్రభుత్వం పనిచేయడానికి అవసరమైన నిధుల ఆమోదం కాంగ్రెస్ (సెనేట్, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్)లో ఆగిపోతే, ప్రభుత్వానికి నిధులు విడుదల చేసే అధికారం ఉండదు. ఫెడరల్ ఉద్యోగులు వేతనాలు లేకుండా ఇంట్లో ఉండిపోతారు. అత్యవసర సేవలు (పోలీసు, ఆరోగ్యం, రక్షణ) మాత్రమే కొనసాగుతాయి. పాస్‌పోర్ట్, వీసా, పన్ను, పార్కులు, పరిశోధనా సంస్థలు వంటి విభాగాలు మూతపడతాయి. ఇలా ప్రభుత్వం పనిచేయకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ(US Economy) మందగిస్తుంది. పెట్టుబడులు తగ్గుతాయి. ఉద్యోగ కల్పన ఆగిపోతుంది. మార్కెట్ మీద గణనీయమైన ప్రభావం పడుతుంది. మరి అమెరికా ప్రభుత్వం ఎప్పటికి ఈ సమస్యకు పరిష్కారం చూపుతుందో వేచి చూడాలి.
Read Also: బీహార్‌లో పోటాపోటీ హామీలు.. అమలు సాధ్యమేనా?
Follow Us On : Instagram

