బీహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు(Bihar Polls) సమీపిస్తున్నాయి. దీంతో ఎన్డీయే, మహాగట్‌బంధన్ కూటములు హామీల వరదలు కురిపిస్తున్నాయి. అయితే అసలు ఆ హామీలు ఆచరణ సాధ్యమేనా? కేవలం ఎన్నికల్లో గట్టేక్కేందుకే పార్టీలు ఇటువంటి హామీలు ఇస్తున్నాయా? అన్న చర్చ సాగుతోంది. రెండు కూటములు ప్రకటించిన హామీలు అమలు చేయాలంటే భారీగా నిధులు అవసరమని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక కూటమి ఇచ్చిన హామీకి మరో కూటమి రెండింతలు పెంచి హామీ ఇస్తున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ‘ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం’ ఇస్తామంటూ హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని యువతను ఆకట్టుకోనేందుకే ఆయన ఆ వాగ్దానాన్ని నమ్ముకున్నారు. “బిహార్‌లో ఎవరూ ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. పాత మిల్లులను పునరుద్ధరిస్తాం, కొత్త పరిశ్రమలు, ఐటీ పార్కులు, ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతాం. బిహార్‌ను విద్యా కేంద్రంగా, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం.” అంటూ తేజస్వీ హామీ ఇచ్చారు.
తేజస్వీ యాదవ్(Tejashwi Yadav) వాగ్దానం ప్రకారం రాష్ట్రంలోని సుమారు 2.2 కోట్ల కుటుంబాలకు ఒక ఉద్యోగం అంటే దాదాపు 20–25 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒక్కో ఉద్యోగానికి సంవత్సరానికి కనీసం ₹5 లక్షల వ్యయం వస్తుందని అంచనా. అంటే ₹1.25 లక్ష కోట్లకు పైగా అదనపు భారమవుతుంది. బిహార్ రాష్ట్ర ప్రస్తుత బడ్జెట్ (₹2.6 లక్షల కోట్లు)లో ఇది దాదాపు 50%కు సమానం. ఆ హామీ ఆచరణ సాధ్యమేనా? అన్న చర్చ సాగుతోంది.
NDA ప్రతిస్పందన
దీనికి ప్రతిస్పందనగా సీఎం నీతీశ్ కుమార్(Nitish Kumar) నేతృత్వంలోని ఎన్డీయే కూడా భారీగా హామీలు ప్రకటించింది. రాష్ట్రంలో కోటి ఉద్యోగాలు సృష్టిస్తామంటూ ఎన్డీయే కూడా హామీ ఇచ్చింది. కోటి ఉద్యోగాల కల్పన అంత తేలికఏమీ కాదు. అందుకు భారీగా నిధులు అవసరం. మరి ఎన్డీయే ఈ హామీని ఎలా నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి. మహిళలకు నెల నెలకు కొంత మొత్తం జమ చేస్తామని హామీ ఇచ్చింది. విద్యుత్ మారుమూల ప్రాంతాలకు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చింది. గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, మహిళా సాధికారత, పాఠశాలల్లో ఆధునిక సదుపాయాలు, రైతులకు పంట బీమా వంటి హామీలను తీసుకొచ్చింది. బీజేపీ వర్గాలు తేజస్వీ హామీలను ఆర్థికంగా అసాధ్యం, ఎన్నికల ప్రచార స్టంట్”గా కొట్టిపారేస్తున్నాయి.
వాస్తవ పరిస్థితి ఏమిటి?
Bihar Polls | బిహార్ రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధి రేటు దేశంలోనే అతి తక్కువ. పన్ను ఆదాయం కేవలం ₹50–60 వేల కోట్లు మాత్రమే. మిగతా వ్యయం కేంద్ర నిధులపై ఆధారపడుతుంది. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున ఉద్యోగాలు సృష్టించడం, మౌలిక సదుపాయాలను పెంచడం ఆర్థికంగా కఠినమైనదే. మరి రెండు కూటములు ఎన్నికల్లో గెలిచేందుకు ఎడాపెడా హామీలు గుప్పిస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఎన్డీయే అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజిన్ సర్కారుతో అభివృద్ధి సాధ్యమని నితీశ్ చెబుతుండగా.. మార్పు కోసం తమకే ఓటు వేయాలని మహా గట్ బంధన్(Mahagathbandhan) చెబుతోంది. మరి ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారో వేచి చూడాలి.
Read Also: కేరళ అరుదైన ఘనత.. ముఖ్యమంత్రి కీలక ప్రకటన
Follow Us On : Instagram

