కలం, నిజామాబాద్ బ్యూరో: ఉమ్మడి నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో అకాల వర్షాలు (Unseasonal Rains) అన్నదాతలను నిండా ముంచేశాయి. అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. నిజామాబాద్, కామారెడ్డి రెండు జిల్లాలలో అనేక చోట్ల వర్షం కురిసింది. దీంతో చాలా చోట్ల వందలాది ఎకరాల్లో వరి పైర్లు నేల వాలాయి. వడ్ల గింజలు నేల రాలాయి. కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది. మొక్కజొన్న పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీగా మామిడి కాయలు రాలిపోయాయి.
అకాల వర్షాలకు నిజామాబాద్ (Nizamabad) జిల్లాలోని బీమ్ గల్ బాల్కొండ ఆర్మూర్ నియోజక వర్గాలతో పాటు కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్, గాంధారి, మాచారెడ్డి మండలాల్లో వివిధ పంటల నష్టం జరిగింది. ఈరోజు కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించడంతో రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఆర్మూర్ (Armoor) నియోజకవర్గంలోని నందిపేట్, దొంకేశ్వర్ మాక్లూర్, ఆలూరు మండలాల్లోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురిసింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి ధాన్యం పొలాల్లోనే నేలరాలిపోగా, కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిసి నష్టపోయింది. మొక్కజొన్న పంటలు కూడా ఈదురు గాలుల ప్రభావంతో నేలకొరిగి, కంకులు తడిసి పాడైపోయాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పంటను కోత దశకు తీసుకురావడానికి ఇప్పటికే భారీగా ఖర్చు చేసిన రైతులు, అకాల వర్షాలతో పంట చేతికి రాకపోవడంతో తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్ట పోయిన పంటను అంచనా వేసి, తక్షణ సహాయం అందించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
బాల్కొండ (Balkonda) నియోజక వర్గం భీంగల్ ప్రాంతంలో సైతం పంట నష్టం జరిగింది. వరి మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వరి మొక్కజొన్న పంటలు చేతికొచ్చే దశలో ఉండటంతో అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయని చెప్పాలి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో ప్రాథమిక అంచనా వేసే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే అకాల వర్షాలకు నష్టపోయిన తమను ఆదుకోవాలని బాధిత రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
Read Also: సినిమా వాళ్లకు డ్రగ్స్ టెస్టు మస్ట్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే
Follow Us On : WhatsApp

