ప్రాతినిధ్యం సున్నా.. తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్!

కలం, తెలంగాణ బ్యూరో: బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం దక్కలేదు. మొత్తం 66 పోస్టుల్లో ఒక్కటంటే ఒక్క పదవి కూడా తెలంగాణ నేతలకు ఇవ్వలేదు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీదే అధికారమని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌పై ప్రజలకు నమ్మకం లేదని.. తామే ప్రత్యామ్నాయమని అంటున్నారు.

ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మొదలు కేంద్ర మంత్రులు, రాష్ట్ర చీఫ్ వరకు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కానీ జాతీయ కార్యవర్గ కూర్పులో తెలంగాణను పరిగణనలోకే తీసుకోలేదు. ఇప్పటివరకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న డీకే అరుణకు, ప్రధాన కార్యదర్శిగా ఉన్న బండి సంజయ్‌కు, నేషనల్ ఓబీసీ మోర్చా చైర్మన్‌గా ఉన్న ఎంపీ లక్ష్మణ్‌కు ఈసారి మొండి చేయే ఎదురైంది.

గ్రూపు తగాదాలు, తరచూ ఫిర్యాదులు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ మూడు రోజులపాటు తెలంగాణలో పర్యటించి రాష్ట్ర నాయకులతో సమావేశాలు నిర్వహించారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై సూచనలు ఇచ్చారు. గ్రూపు తగాదాలు, వర్గాలుగా విడిపోవడం, సమన్వయం లేకపోవడం, బేధాబిప్రాయలు కనిపించడంతో సున్నితంగా హెచ్చరించారు.

దీనికి కొనసాగింపుగా పార్టీ జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్‌ను రాష్ట్రానికి పంపి బండి సంజయ్, ఈటల మధ్య ఉన్న గ్యాప్‌ను భర్తీ చేసేలా చొరవ తీసుకున్నారు. ఇద్దరినీ ఒక్కటి చేసి హమ్ ఏక్ హై.. అనే తీరులో ఒక మెసేజ్ పంపారు. అది అక్కడి ఫోటో షూట్ వరకే పరిమితమైంది. ఆ తర్వాత యధావిధిగా ఎడమొహం పెడమొహంగానే కంటిన్యూ అవుతున్నది. గ్రూపులు, వర్గాలుగా విడిపోయి ఉన్నంతకాలం రాష్ట్ర నాయకులకు జాతీయ స్థాయిలో అవకాశాలుండవ్ అని తాజా కూర్పుతో మెసేజ్ ఇచ్చినట్లయింది.

గతంలోని ప్రాధాన్యత ఇప్పుడేది?

అమిత్ షా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రానికి చెందిన మురళీధర్‌రావు జాతీయ కార్యదర్శిగా వ్యవహరించారు. ఆ తర్వాత జేపీ నడ్డా అధ్యక్షుడైన తర్వాత రాష్ట్ర పార్టీ బాధ్యతలను బండి సంజయ్‌కు అప్పగించారు. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి అయ్యారు. ఎంపీ డీకే అరుణ జాతీయ వైస్ ప్రెసిడెంట్ అయ్యారు. లక్ష్మణ్ ఓబీసీ జాతీయ మోర్చా అధ్యక్షుడిగా వ్యవహరించారు. రాష్ట్ర నాయకుల స్వయంకృతాపరాధం వల్లే ఎవరికి పదవులు దక్కలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక్కరికీ అవకాశం దక్కని రాష్ట్రం తెలంగాణే.

మొండిచేయి వెనక అంతరార్థమేంటి?

తెలంగాణలో బీజేపీ (BJP Telangana) నేతలకు మొండిచేయి ఇవ్వడం వెనుక అంతరార్థమేమిటి? అన్న చర్చ సాగుతున్నది. తెలంగాణలో అధికారంలోకి వచ్చేటంత సీన్ లేదని బీజేపీ హైకమాండ్ భావించిందా? లేదంటే కొంతమంది నాయకుల తీరుపట్ల అసహనంగా ఉందా? అన్న చర్చ సాగుతున్నది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బీజేపీ దూకుడుగా వ్యవహరించింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సాధించింది.

ఆ ప్రభావం 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిబింబించింది. కానీ ప్రస్తుతం జాతీయ టీమ్‌లో ఒక్క పోస్ట్ ఇవ్వకపోవడం వెనక కారణమేంటనేది లీడర్లను కన్‌ఫ్యూజన్‌లోకి నెట్టింది. జాతీయ టీమ్‌లో అనుభవజ్ఞులతో పాటు ఎన్నికల అవసరాలకు అనుగుణంగా స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్ వంటి నేతలకు కీలక బాధ్యతలు దక్కాయి. తెలంగాణ నెక్స్ట్ టార్గెట్ అంటూనే ఒక్కరినీ తీసుకోకపోవడం రాష్ట్ర నాయకులకు మింగుడుపడలేదు. తెలంగాణను టార్గెట్ లిస్టు నుంచి తీసేసుకున్నదా?.. అనే చర్చలూ లేకపోలేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>