కలం, వనపర్తి: కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా, పార్టీ అధిష్ఠానం, ముఖ్యమంత్రి, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి (Chinna Reddy) పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వనపర్తి ఎమ్మెల్యే (Wanaparthy MLA) తూడి మేఘారెడ్డి (Thudi Megha Reddy) డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వనపర్తి నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి కల్వకుర్తిలోని క్యాంపు కార్యాలయంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవిని కలిసి ఫిర్యాదు చేశారు.
ఈ నెల 16న గోపాల్‌పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రెండో కార్యాలయ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారెడ్డి పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడారని మేఘారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్ఠానం కోట్లాది రూపాయలు తీసుకుని తనకు బీఫామ్ ఇచ్చిందంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీని అవమానించేలా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశంపై సమగ్రంగా విచారించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
అధిష్ఠానాన్ని కలుస్తా: ఎమ్మెల్యే మేఘా రెడ్డి
ఈ వ్యవహారంపై మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌లను కలిసి పరిస్థితిని వివరిస్తానని ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు.
పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ.. చిన్నారెడ్డి బీఆర్‌ఎస్ నాయకులతో కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాము 20–30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ, గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఎన్నో అవమానకర పరిస్థితులను ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రస్తుతం ఎమ్మెల్యే మేఘారెడ్డి పాలనలో కాంగ్రెస్ కార్యకర్తలకు సమాజంలో గౌరవం లభిస్తోందని, ఈ సమయంలో పార్టీని బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. చిన్నారెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని మల్లు రవిని కోరారు.
అధిష్ఠానంతో చర్చిస్తాం: మల్లు రవి
నాయకుల ఫిర్యాదుపై స్పందించిన మల్లు రవి.. ఈ అంశంపై పార్టీ అధిష్ఠానంతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీనియర్ నాయకులు పార్టీ ప్రతిష్ఠను కాపాడాల్సిన బాధ్యత ఉందని, అందుకు భిన్నంగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో పాటు వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

