కలం, వెబ్ డెస్క్: ఒకప్పుడు 60 నుంచి 70 ఏళ్ల వయసులోకి వచ్చేసరికి కండరాల బలం తగ్గిపోవడం, నడక మందగించడం, చిన్న చిన్న పనులు చేయగానే అలసిపోవడం వంటి లక్షణాలు కనిపించేవి. కానీ నేటి డిజిటల్ యుగంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నలభై ఏళ్లు రాగానే ఈ లక్షణాలు కనిపించడం మొదలవుతున్నాయి.
40 ఏళ్లు మీదపడే సరికి రోజూవారీ పనులు చేసుకోవడం కూడా కష్టతరంగా మారే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ లక్షణాలు కనిపించినప్పుడు మనం పని ఎక్కువైందనో లేదా నిద్ర సరిపోలేదనో సాధారణ కారణాలు వెతుక్కుంటాం. కానీ, దీనికి ప్రధాన కారణం.. కండరాల క్షీణత కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత జిరియాట్రిక్ సొసైటీ ప్రకారం.. సార్కోపెనియా (Sarcopenia) అనే కండరాలను కరిగించే వ్యాధి ఈ లక్షణాలకు కారణం అంటున్నారు. సార్కోపెనియా అంటే కండరాల బలంతో పాటు కండరాల పరిమాణం తగ్గిపోతుంది. అంతే కాకుండా శారీరక సామర్థ్యం క్రమంగా క్షీణిస్తుంది. అయితే ఈ లక్షణాలను ఒకప్పుడు వృద్ధాప్య లక్షణాలుగా భావించేవారు. అంటే వృద్ధాప్యంలో వచ్చే కండరాల క్షీణతగా చెప్పుకునే వారు.
కానీ నేటి మారుతున్న జీవనశైలి కారణంగా ఈ లక్షణాలు 40 ఏళ్ల వయసులో ఉన్నవారిలో కూడా కనిపిస్తున్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. దీనికి ప్రధాన కారణం నేటి ఆధునిక జీవనశైలి. గంటల తరబడి కూర్చొని పని చేసే ఉద్యోగాలు, వ్యాయామం చేయకపోవడం, పోషకాహార లోపం, మానసిక ఒత్తిడి.. ఇవన్నీ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తాయని హెచ్చరిస్తుంది భారత జిరియాట్రిక్ సొసైటీ.
సార్కోపెనియా లక్షణాలు
వయసు పెరిగే కొద్ది కండరాలు క్షీణించడం సర్వసాధారణం. కానీ ఈ వ్యాధిలో ప్రారంభదశలోనే కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. చిన్న చిన్న పనులు చేయగానే అలసిపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, వేగంగా నడవలేకపోవడం, సమతుల్యత కోల్పోయి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధిలో కండరాల నిర్మాణం వేగంగా దెబ్బతింటుంది. షుగర్ వ్యాధి ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో లేకపోతే కండరాల నిర్మాణం మరింత దెబ్బతినే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
వ్యాధి రావడానికి కారణాలు
సాధారణంగా వయసు పెరిగే కొద్దీ కండరాల పెరుగుదలకు సహాయపడే హార్మోన్లు తగ్గడం వల్ల ఈ వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కానీ నేటి ఆధునిక జీవనశైలితో పాటు ఆహార అలవాట్లు కూడా మారిపోయాయి. ఈ క్రమంలో శరీరానికి తగినంత ప్రొటీన్ అందకపోవడం ప్రధాన కారణంగా చెప్పవచ్చు. తొందరగా బరువు తగ్గాలని భావించి ఈ మధ్యకాలంలో కొంతమంది క్రాష్ డైట్లు, ఉపవాసాలు చేస్తున్నారు, మరికొంత మంది బరువు తగ్గేందుకు టాబ్లెట్లు వాడుతున్నారు. వీటి వల్ల కొవ్వుతో పాటు కండరాలు కూడా కరిగిపోయే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల శరీరం బలహీనపడే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడేందుకు కొన్ని రకాల ఆహారపదార్థాలు మన రోజువారీ ఆహారంలో జతచేయాలని సూచిస్తున్నారు. కండరాలు ఆరోగ్యంగా ఉండేందుకు రోజువారీ ఆహారంలో ప్రొటీన్ తగిన మోతాదులో ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. దీనికోసం పాలు, గుడ్లు, చేపలు, చికెన్, పెరుగు, సోయా, పప్పులు వంటి ఆహార పదార్థాలు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
వీటితో పాటు విటమిన్–డి, విటమిన్–బి12, కాల్షియం లోపాలు లేకుండా చూసుకోవడం ముఖ్యం. అంతే కాకుండా రోజువారీ నడకతోపాటు వారానికి 2, 3 రోజులు వెయిట్ ట్రైనింగ్, రెసిస్టెంట్ వ్యాయామాలు, స్క్వాట్స్ వంటివి తప్పనిసరిగా చేయాలని చెబుతున్నారు. ప్రతిరోజూ 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర, వ్యాయామం ద్వారా ఈ ముప్పును అడ్డుకోవచ్చని భారతీయ జెరియాట్రిక్ సొసైటీ స్పష్టం చేస్తోంది.
(Note: ఈ సమాచారం కేవలం పాఠకుడి ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఇవి వైద్యుడి సలహాకు లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా సందేహాలు ఉంటే వైద్యుడిని సంప్రదించగలరు)

