పాపన్న గుట్టలు.. చెక్కు చెదరని చారిత్రక ఆనవాళ్లు!

కలం, మెదక్ బ్యూరో : కుతుబ్ షాహీల పాలన అనంతరం 300 ఏళ్ల కింద నాటి సుబేదార్లు, జాగీర్‌దార్ల పాలనను, అరాచకాలను ఎదిరించి తెలంగాణ పౌరుషాన్ని చాటిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna Goud). ఢిల్లీ మొఘల్ చక్రవర్తులను ఓడించి గోల్కొండ కోటపై విజయ పతాకం ఎగరేశాడు. రాజుగా ఆయన చరిత్రలో నిలిచాడు. నేడు పాపన్నగౌడ్ 376 జయంతి సందర్భంగా ఆయన వీరత్వానికి, సైనిక వ్యూహాలకు నిలయమైన చారిత్రక క్షేత్రాలపై‘ క‌లం’ ప్రత్యేక కథనం.

తిరుగుబాటు -రాజ్యస్థాపన

నేటి జనగామ జిల్లాలోని ఖిలాషాపూర్ (Khilashapur) లో సర్వాయి పాపన్న గీత కార్మిక కుటుంబంలో జన్మించారు. ఆ కాలంలో ప్రజలపై మొఘల్ చక్రవర్తులు, వారి సామంతులైన సుబేదార్లు ఇష్టారీతిగా పన్నులు వేసి వసూలు చేసేవారు. చెల్లించకుంటే నిర్దాక్షిణ్యంగా చంపేసేవారు. ఎవరైనా ప్రశ్నిస్తే బంధించేవారు. చిన్నప్పటి నుంచే నాయకత్వ లక్షణాలున్న పాపన్న ఇవన్నీ చూస్తూ పెరిగాడు. త‌న‌ స్నేహితులుతో కలిసి మొఘలులపై తిరుగుబాటు జెండా ఎత్తాడు.

‘కొడితే గోల్కొండ కోటను కొట్టాలి.. తాళ్లు ఎక్కితే ఏమస్తది’ అనేవాడు సర్వాయి పాపన్నగౌడ్. ముందుగా తాటికొండ, వరంగల్, భువనగిరి, కొలనుపాక తదితర ప్రాంతాల్లో తన ఆధిపత్యాన్ని విస్తరించాడు. గోల్కొండపై దండయాత్ర చేసి అప్పటి మొఘల్ పాలకులకు సవాల్ విసిరాడు. ఇలా ప‌లు ప్రాంతాల‌ను జయిస్తూ.. తిరుగుతూ హుస్నాబాద్, సైదాపూర్ మండలం ఉమ్మాపూర్, సర్వాయిపేట ప్రాంతాలకు మకాం మార్చారు. హుస్నాబాద్ ప్రాంతం దట్టమైన అటవీ కావడంతో రహస్య జీవితం గడిపేందుకు పాపన్న దాన్ని ఎంచుకున్నారు.

ఉమ్మాపూర్, సర్వాయిపేటకు ఆనుకొని ఉన్న కోట, నేటి పాపన్న గుట్ట వద్ద తన సైనికులకు శిక్షణ ఇచ్చాడు. సమీప గ్రామాల ప్రజలు రెండు వేల మంది సైన్యంలో చేరారు. చుట్టు పక్కల గ్రామాల్లో ధనికుల నుంచి డబ్బును సేకరించేవారు. 1675లో తన తల్లి సర్వమ్మ పేరు మీద సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలోని ఉమ్మాపూర్, సైదాపూర్ మండలం సర్వాయిపేట, శివరాంపల్లి చుట్టుప‌క్కల గ్రామాల‌ను కేంద్రంగా చేసుకుని పాపన్న రాజ్యస్థాపన చేశాడు. దట్టమైన అటవీప్రాంతం కావడంతో ఇక్కడి నుంచే పాప‌న్న త‌న కార్యకలాపాలను నిర్వహించేవాడు.

గడీలను కొల్లగొట్టిన ధనంతో 12 ఎకరాల్లో 30 అడుగుల ఎత్తైన ముఖద్వారం, 80 అడుగుల ఎత్తైన 4 బురుజులతో కోటను నిర్మించాడు. పాపన్న గుట్ట వద్ద సైన్యానికి గెరిల్లా పోరాటంలో శిక్షణనిచ్చి సైన్యాన్ని విస్తరించాడు. 1698లో తాటికొండ కోట, 1785లో ఖిలాషాపురం కోటతో పాటు మొత్తం 21 కోటలను కట్టించాడు. ఇక్కడి నుంచే బయలుదేరి గోల్కొండ కోటను జయించి బహుజన రాజ్యాన్ని స్థాపించాడు. వ్యూహకర్తగా, పోరాట యోధుడిగానే కాకుండా సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు బహుజన నేతగానూ పేరుంది. తన సైన్యంలో 12 వేల మందికి పైగా యోధులు ఉండేవారు. వీరిలో దళిత, బహుజనులే ఎక్కువగా ఉండడం విశేషం.

మొఘల్ పాలనకు వ్యతిరేకంగానే కాకుండా, ప్రజలను పీడించే జమీందారీ, భూస్వామ్య వ్యవస్థలపై పోరాటాలు చేసి ప్రజలను కాపాడేవాడు. పాపన్న గౌడ్ ఆనాటి సామాజిక, ఆర్థిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి అణగారిన వర్గాల్లో ఆత్మగౌరవం, ధైర్యం, సమానత్వ భావనను పెంపొందించాడు. పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకం.

పాపన్న గుట్టలు – చారిత్రక ఆనవాళ్లు

ఉమ్మాపూర్ వద్ద గుట్టలు పాపన్నగెరిల్లా సైన్యానికి ప్రధాన స్థావరంగా నిలిచాయి. సుమారు 2 కిలోమీట‌ర్ల మేర కొండపైకి వెళ్లే దారిలో భారీ రాతి ద్వారం రక్షణ కవచంగా ఉంది. పాపన్న సైనికులు రాతి గుట్టలపై ఉంటూ 24 గంటలు గస్తీ కాసేవారు. ఆ గుట్ట‌ల్లో పాత ఖిల్లా, కొత్త ఖిల్లా, కమాన్, విశ్రాంతి గదులు, పెద్ద పెరడు, సైనికులు ఆడిన పచ్చీసుల బండ ఆనవాళ్లు ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ఆయన ప‌రిపాలన‌ ఆనవాళ్లుగా రక్షణ ద్వారాలు, గెరిల్లా స్థావరాలు క‌న్పిస్తాయి.

శత్రువుల దాడిని తిప్పికొట్టేందుకు కోట చుట్టూ కిలోమీటర్ దూరాన వెయ్యి గజాల విస్తీర్ణంతో కందకం తవ్వించారు. శత్రువుల నుంచి రక్షణకు ఇక్కడ ఎత్తయిన కోట గోడలు, బురుజులు నిర్మించారు. ఇక్కడి కోటగిరి గట్లు, గొలుసుకట్టు గుట్టలు, విశాలమైన బయ్యన్న గుట్టలు, సర్వన్న చెరువు, గుట్టపైన పాపన్న ఆనవాళ్లు నేటికీ కనిపిస్తాయి. పాపన్న నిత్యం ఆరాధించే బయ్యన్నగుండుపై భైరవుని ప్రతిమతో పాటు శివాలయం, హనుమాన్ ఆలయం ఉండగా.. పోరాటంలో అమరులైన ఆయన సైనికుల జ్ఞాపకార్థం చెక్కిన వీరగళ్లు విగ్రహాలు కూడా గుట్ట‌ల‌పైన చాలాప్రాంతాల్లో దర్శనమిస్తాయి.

హుస్నాబాద్‌లోని ప్రసిద్ధ ఎల్లమ్మ గుడిని కూడా పాపన్నే కట్టించారని స్థానికులు చెప్తారు. త‌న సైన్యానికి నీటి స‌మ‌స్య లేకుండా సహ‌జ‌సిద్ధంగా చెరువుల‌తో పాటు , కొండలపై సైన్యం కోసం ఏర్పాటు చేసిన ‘ఒంటెద్దు బావి’, ఎంతటి కరువు వచ్చినా ఇంకిపోని ‘కోనేరు’, సర్వన్న చెరువులు ఏకాలంలోనూ ఎండిపోని నీటి వనరులుగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పాపన్న గుట్టలు.. పర్యాటకంగా అభివృద్ధి

గుట్టలపై నిఘా లేకపోవడం, ప్రభుత్వాలు పరిరక్షణ చర్యలు లేకపోవడంతో గుప్త నిధుల తవ్వకాలతో కొన్ని నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. సుమారు 3,200 ఎకరాల అటవీ విస్తీర్ణంలో 36 గుట్టల సమూహం విస్తరించి ఉంది. సర్వాయి పాపన్నవీరత్వాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేయాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఈ చారిత్రక క్షేత్రాన్ని పునరుద్ధరించేందుకు శ్రీకారం చుట్టింది. ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులను వేగవంతం చేసింది.

హుస్నాబాద్ మండలం జిల్లాజెల్లగడ్డలో ప్రాంత చుట్టుపక్క‌ల గ్రామాలైన స‌ర్వాయిప‌ల్లి, మందాపూర్, ఉమ్మాపూర్లో సహజసిద్ధంగా ఏర్పడిన గుట్టలు, అటవీ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దుతోంది. స‌ర్ధార్ పాప‌న్నగుట్ట‌ల్లో అర్బన్ పార్క్ పనులు చేపట్టగా.. ఈ ప్రాంతాన్నిఅభివృద్ధి చేసేందుకు రూ.10 కోట్ల నిధులతో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారు.

తొలి విడతగా రూ.3 కోట్లు మంజూరు చేసి గత జనవరిలో పనులు ప్రారంభించారు. పాప‌న్న విగ్రహంతో పాటు గుట్టల‌ను వీక్షించేందుకు వాచ్ ట‌వ‌ర్ నిర్మించారు. పర్యాటకులను ఆకట్టుకునేలా, సేదతీరేలా వివిధ రకాల నిర్మాణాలను చేపట్టగా.. ఇప్పటికే తొలి విడత పనులు సగానికి పైగా పూర్తయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>