కలం, తెలంగాణ బ్యూరో: కొన్ని రోజులుగా రాష్ట్రంలో పాలిటిక్స్ క్షుద్ర పూజలు, అఘోరా పూజలు, చేతబడుల చుట్టూ తిరుగుతున్నాయి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు (Harish Rao vs Congress) తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరువు రావాలంటూ హరీశ్‌రావు ఇతర రాష్ట్రాల్లో క్షుద్ర పూజలు చేయిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే.. హరీశ్ రావును అఘోరారావు అంటూ దుయ్యబట్టారు.
వీటిపై హరీశ్ రావు లీగల్గా నోటీసులు ఇస్తున్నా ఏ మాత్రం కాంగ్రెస్ నేతలు వెనక్కి తగ్గడం లేదు. పక్క రాష్ట్రాల్లోకి వెళ్లి రహస్యంగా పూజలు ఎందుకు చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాలని హరీశ్‌ను డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ఈ ప్రచారంతో హరీశ్‌రావు డిఫెన్సులో పడ్డట్లయిందని, ఆ పూజల వ్యవహారం సాధారణ ప్రజానీకంలో చర్చకు దారితీసిందని బీఆర్ఎస్ కార్యకర్తలూ అంటున్నారు.
సమాధానం చెప్పాలంటున్న కాంగ్రెస్
మార్చి 2న తమిళనాడులోని తిరుచ్చి, జూన్ ఒకటిన కర్నాటకలోని శివమొగ్గకు హరీశ్ రావు వెళ్లారని.. ఆ వివరాలను ఎందుకు దాస్తున్నారని ఇటీవల పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. తిరుమల వెళ్లిన వివరాలను బయటపెట్టిన హరీశ్.. అదే తిరుచ్చి, శివమొగ్గ పర్యటన వివరాలను ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో వర్షాలు పడొద్దని, కరువు రావాలని పక్క రాష్ట్రాల్లో క్షుద్ర పూజలు చేయిస్తున్నట్లు అనుమానం కలుగుతున్నదని ఆయన అన్నారు.
తాను హరీశ్ రావుపై తప్పుడు ప్రచారం చేయడం లేదని, అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకుముందు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా ఇదే అంశంపై హరీశ్ రావును ప్రశ్నించారు. మూడు రోజుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బహిరంగ సభల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ‘‘రాష్ట్రంలో కరువు రావాలని బీఆర్ఎస్ నేతలు పక్క రాష్ట్రాలకు వెళ్లి క్షుద్ర పూజలు, చేతబడులు చేయిస్తున్నారు. తప్పుడు ఆలోచనలతో చేసే ఇలాంటి చేతబడులు తిరగబడితే ఏమౌతుందో తెలుసు కదా? ఫామ్ హౌస్లో నుంచి కూడా వాళ్లు బయటకురాలేరు” అని సీఎం వ్యాఖ్యానించారు.
హరీశ్ రావును అఘోరారావు అంటూ విమర్శిస్తున్నారు. సమాధానం చెప్పాలని అడిగితే తమ నేతలకు నోటీసులు ఇస్తున్నారని, పదేండ్లు అధికారంలో ఉన్న నాయకులు ఇలాంటి పూజలా చేసేది అని సీఎం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్లతో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.
గుడికి వెళ్తే తప్పేంది?: కేటీఆర్
హరీశ్‌రావుపై ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్, కాంగ్రెస్ నేతలు క్షుద్రపూజలు, అఘోరా పూజలు అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. “హరీశ్‌రావు గుడికి వెళ్లడం తప్పా? మాకు క్షుద్ర రాజకీయాలు తెలియవు. స్ట్రైట్ పాలిటిక్స్ మాత్రమే తెలుసు..” అని రియాక్ట్ అయ్యారు.
కాంగ్రెస్ నేతలకు హరీశ్ నోటీసులు
తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలకు హరీశ్‌రావు లీగల్ నోటీసులు పంపించారు. తాను క్షుద్రపూజలు చేశానంటూ నేరపూరిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు పంపించినట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇలాంటి ఆధారాల్లేని ఆరోపణలు చేయడం కాంగ్రెస్ నేతల మానసిక అసమతౌల్యతకు నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
వెంటనే బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే కోర్టులో సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తానని హరీశ్ స్పష్టంచేశారు. అయినా.. కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు ఆగడం లేదు. ఎందుకు తిరుచ్చి, శివమొగ్గ వెళ్లారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. తాజాగా వరంగల్ పర్యటనలోనూ సీఎం రేవంత్ రెడ్డి ‘హరీశ్ రావు.. అఘోరారావు’ అంటూ మరోసారి విమర్శించారు.
ప్రజల్లోనూ ఇదే చర్చ
హరీశ్ రావుపై అధికార పార్టీ నేతలంతా ఆరోపణలు చేస్తుండటంతో ఇది ప్రజల్లోకి బలంగా వెళ్లింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ దీనిపై జనం మాట్లాడుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లోకి ఎందుకు వెళ్లారో హరీశ్ రావు వివరణ ఇవ్వకపోవడం మరింత చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి వరుసగా బహిరంగ సభల్లో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తుండటం హీట్ పెంచుతున్నది. బీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్గా పేరున్న హరీశ్రావు ఇప్పుడు కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలతో ట్రబుల్లోకి వెళ్లిపోయారని పొలిటికల్ సర్కిల్స్ లో డిస్కషన్స్ నడుస్తున్నాయి.

