కలం, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రివర్గం (Union Cabinet)లో ఈసారి భారీ మార్పులే జరగనున్నాయి. పలువురు మంత్రుల రాజ్యసభ పదవీ కాలం కంప్లీట్ కానున్నది. వీరు తప్పుకోవాల్సి వస్తున్నది. ఆ స్థానంలో కొత్తవారికి అవకాశాలు వస్తున్నాయి. మంత్రుల పనితీరు, కొన్ని రాష్ట్రాల త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు, వృద్ధాప్యం/యూత్ అనే మూడు అంశాల ఆధారంగా మార్పులు జరగనున్నట్లు అటు పవర్ కారిడార్స్ వర్గాలు, ఇటు బీజేపీ కేంద్ర కార్యాలయ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. ఆ ప్రకారమే జాబితా సిద్ధమవుతున్నదని తెలిపాయి. టాప్ త్రీగా ఉన్న హోమ్, డిఫెన్స్, ట్రాన్స్‌పోర్ట్ శాఖల్లో మార్పు ఉండకపోవచ్చని ఆ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఆర్థిక మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్‌ను విద్యా శాఖకు, వాణిజ్యశాఖ మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్‌ను ఫైనాన్స్‌కు మార్చే అవకాశమున్నది. రైల్వే మంత్రికి వాణిజ్య శాఖను కేటాయించవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. నీట్ వివాదం కారణంగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తప్పుకోనున్నారు. ఈ మార్పులన్నీ ఈ నెల సెకండ్ వీక్ తర్వాత ఉండొచ్చని సమాచారం.
ఎలక్షన్ టీమ్‌గా సెట్ చేసే పనిలో మోదీ :
కేంద్రంలో అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయిన సందర్భంగా, కొందరు మంత్రుల రాజ్యసభ పదీవకాలం పూర్తవుతున్నందున మంత్రివర్గ కూర్పులో మార్పులు చేయాలని ప్రధాని మోదీ (PM Modi) భావిస్తున్నారు. ఒకటి రెండు శాఖలకే పరిమితం చేయకుండా భారీ ప్రక్షాళన (మేజర్ ఓవర్‌హాల్) తరహాలో చేయనున్నట్లు తెలిసింది. గృహనిర్మాణం- పట్టణాభివృద్ధి శాఖ శాఖలో ఆశించిన స్థాయిలో వేగం లేదంటూ నివేదికలు రావడంతో ఆ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పోర్ట్‌ఫోలియోను మార్చే యోచనలో ప్రధాని ఉన్నట్లు తెలిసింది. అటవీ పర్యావరణం శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను పార్టీ సంస్థాగత బాధ్యతల్లోకి పంపే అవకాశమున్నట్లు తెలిసింది. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం కనీసం ఏడుగురు మంత్రులు, సహాయ మంత్రులకు ఈసారి క్యాబినెట్ నుంచి ఉద్వాసన తథ్యమని సమాచారం. సహాయ మంత్రుల్లో నలుగురి ప్రగతి నివేదిక నెగెటివ్‌గా వచ్చిందని, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఇద్దరికి ఉద్వాసన తప్పదని సమాచారం.
అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు పర్‌ఫెక్ట్ టీమ్ :
కొన్ని రాష్ట్రాల్లో రాబోయే ఏడాది కాలంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను, 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని ఇప్పటి నుంటే అటు పార్టీలో సంస్థాగతంగా, ఇటు ప్రభుత్వంలో పాలనాపరంగా మార్పులు చేయాలని ప్రధాని డిసైడ్ అయినట్లు తెలిసింది. కొందరు సీనియర్ లీడర్లను ఈ ఎన్నికల అవసరాలకు ఉపయోగించుకుని యూత్, మిడిల్ ఏజ్ ఉన్నవారిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జేడీయూ, ఎల్‌జేపీ తదితర పార్టీలకూ ప్రయారిటీ దక్కనున్నది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక టీడీపీ ఎంపీకి సహాయ మంత్రి పదవి, తెలంగాణలో ఒక బీసీ, ఒక ఓసీ సామాజికవర్గాల దక్కే అవకాశమున్నది. వీలైతే ఓసీ ప్లస్ మహిళ కోణంలో రెండింటినీ పరిగణనలోకి తీసుకునేలా ఆలోచనలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి తీవ్రంగా కృషి చేసిన యంగ్ లీడర్లకు, మహిళా ఎంపీలకు ప్రయారిటీ ఇచ్చే అవకాశాలున్నాయి. టెక్నాలజీ, ఫైనాన్స్ రంగాలపై పట్టున్న ఇద్దరు మాజీ బ్యూరోక్రాట్లకు సహాయ మంత్రులుగా చాన్సులు దక్కనున్నట్లు తెలిసింది.

