Mobile Popup Ad
Mobile Popup Ad

జెన్-జీ జపం.. యువత ఓటు బ్యాంక్ కోసం పార్టీల కసరత్తు

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అన్ని ప్రధాన పార్టీలూ జెన్-జీ ఓటర్లపై ఫోకస్ పెట్టాయి. దానికి తగినట్లుగానే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటున్నాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ యువతపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకరించాలంటూ కింది స్థాయి కేడర్‌కు నేతలు సూచిస్తున్నారు. యంగ్ టాలెంట్ హంట్ పేరుతో యువతను పార్టీ అధికార ప్రతినిధులుగా ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. బీజేపీ తన సోషల్ మీడియా ద్వారా యూత్‌మీద ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సైతం పార్లమెంటరీ, అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల్లో యువతను ప్రోత్సహించాలనే మెసేజ్ ఇస్తున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ సమావేశంలో ఆ పార్టీ యంగ్ లీడర్ క్రిశాంక్ సైతం దీనిపై ప్రత్యేకంగా ఉపన్యాసమే ఇచ్చారు. ఇక కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత సైతం తమ పార్టీ మెయిన్ ఫోకస్ జెన్-జీ, మహిళలపైనే ఉంటుందని ఓపెన్‌గానే ప్రకటించారు. పన్నెండేండ్ల క్రితం 2014లో తెలంగాణ ఉద్యమం ప్రధాన ఎజెండాగా ఉంటే రాబోయే (2028) ఎన్నికల్లో ‘యూత్ అజెండా’ నిర్ణయాత్మకం కానున్నది.

ఫస్ట్ టైమ్ ఓటర్లు, 30 ఏజ్ గ్రూపు టార్గెట్ :

జెన్-జీ యూత్ గురించి సాధారణ నిర్వచనం ఎలా ఉన్నా రాజకీయ పార్టీలకు మాత్రం ఓట్ బ్యాంక్ కోణం నుంచి ప్రత్యేకమైన వ్యూహమే ఉన్నది. జనరల్ పర్‌సెప్షన్ ప్రకారం 1997-2012 మధ్య పుట్టినవారు జెన్-జీ కేటగిరీ. గతంలో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కులాలు, ప్రాంతాలు, ట్రెడిషనల్ కమ్యూనిటీల చుట్టూ తిరిగేవి. దానికి తగినట్లుగానే రాజకీయ వ్యూహం, పోల్ మేనేజ్‌మెంట్, మేనిఫెస్టో హామీలు కేంద్రీకృతమయ్యేవి. కానీ ఇప్పుడు అన్ని పార్టీలూ యువతపైనే ఫోకస్ పెట్టాయి. వారికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇందుకు కారణం ఫస్ట్ టైమ్ ఓటర్ల మైండ్‌సెట్, డిజిటల్ మీడియా వాడకంలో వారి స్పీడ్, నిర్ణయాలు తీసుకోవడంలో చొరవ, ఇతరులపై ఆధారపడడంకంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగే ముక్కుసూటితనం.. తదితరాలు. కేవలం వారి ఓటు మాత్రమే కాక కుటుంబ సభ్యుల్ని, బంధువులను, సన్నిహితులను, ఫ్రెండ్స్‌ను కూడా ప్రభావితం చేయగలుగుతారన్నదే రాజకీయ పార్టీల నిర్ణయం.

రాష్ట్రంలో 85 వేలకు పైగా జెన్-జీ ఓటర్లు :

జెన్-జీ ఓటర్ల సంఖ్య పెరుగుతుండటంతో ప్రధాన పార్టీలు వారిని ఆకర్షించేందుకు స్పెషల్ యాక్షన్ ప్లాన్‌లో పడ్డాయి. ఉద్యోగాలు, స్టార్టప్‌లు, డిజిటల్ కమ్యూనికేషన్, సోషల్ మీడియా ప్రభావం, రాజకీయాల్లో ప్రత్యక్ష భాగస్వామ్యం వంటి అంశాలను అస్త్రాలుగా ఎంచుకున్నాయి. ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. సంప్రదాయ ఓటర్లు, పార్టీకి కమిటెడ్‌గా ఉండే కార్యకర్తలు, పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండే కేడర్.. ఇలాంటి ఓట్లపై ప్రతీ పార్టీకి వారికంటూ నిర్దిష్టమైన లెక్కలున్నాయి. కానీ ఓడిపోయిన చోట చాలా తక్కువ మార్జిన్ ఉంటుండడంతో జెన్-జీని అట్రాక్ట్ చేయగలిగితే ఓటమి నుంచి బయటపవచ్చన్నది ఆ పార్టీల ప్లాన్. అందుకే వారి సెంట్రిక్‌గానే పార్టీ ప్రచార కార్యక్రమాలను, సోషల్ మీడియా క్యాంపెయిన్‌ను, మేనిఫెస్టోల్లో హామీలపై నాయకత్వం దృష్టి పెట్టింది. ఇప్పుడు కులాలు, ప్రాంతాలు, సీనియారిటీ, పార్టీకి లాయల్, వృద్ధతరం నేతలు.. ఇలాంటి లెక్కలేవీ ఎన్నికల్లో ఓట్లకు పనిచేయవనే నిర్ణయానికి వచ్చాయి.

టాలెంట్ హంట్‌తో కాంగ్రెస్ కొత్త ఫార్ములా :

కాంగ్రెస్ ఇటీవల ‘టాలెంట్ హంట్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. చాలా రాజకీయ పార్టీలు దీనిపై చర్చించుకున్నాయి. పార్టీ అధికార ప్రతినిధులుగా నియమించేందుకు ఈ తరహా రిక్రూట్‌మెంట్ డ్రైవ్ చేపట్టింది. సాధారణంగా పార్టీలో పదవులను సీనియారిటీ, సామాజిక సమీకరణాలు, నాయకుల సిఫార్సుల ఆధారంగా ఇచ్చే ట్రెడిషన్ ఉండేది. కానీ ఈసారి కార్పొరేట్ స్టైల్ విధానాన్ని అనుసరించింది. యువతలో ప్రతిభావంతులను ఎంపిక చేసి అధికార ప్రతినిధులు, పార్టీ కమ్యూనికేటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. సోషల్ మీడియాలో బీజేపీ, బీఆర్ఎస్‌లను ఢీకొట్టేలా సమర్థంగా కౌంటర్ ఇవ్వడం ఒక ఉద్దేశం. రాజకీయాలపై ఆసక్తి ఉండి చదువుకున్న యువతను పార్టీలోకి ఆకర్షించడ ద్వారా కేవలం వారు ఓటర్లుగా మాత్రమే కాక ఆ జెనరేషన్ వ్యక్తుల్ని ప్రభావితం చేస్తారన్నది మరో భావన.

‘యువత రాజకీయాల్లోకి రావాలి’ : బీఆర్ఎస్ అప్పీల్

రాష్ట్రంలో పవర్ కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ సంస్థాగత పునర్నిర్మాణంపై దృష్టి పెట్టింది. రాజకీయాల్లోకి రావాలంటూ యూత్కు బహిరంగంగా పిలుపునిస్తున్నది. భవిష్యత్ రాజకీయ శక్తి యువతే అంటూ ఇటీవల కేసీఆర్, తరచూ కేటీఆర్ కామెంట్ చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్‌లు కూడా యువతను లక్ష్యంగా చేసుకుని స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాయి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి, యువత పోషించిన కీలక పాత్రను గుర్తుచేస్తూ అదే తరహా భావోద్వేగాన్ని తీసుకురావాలని, చైతన్యపరచాలని భావిస్తున్నది. దానికి తగిన వ్యూహంపైనా ఫోకస్ పెట్టింది. నిరుద్యోగులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, ఐటీ ఉద్యోగులు వంటి వర్గాల గురించి ఆలోచిస్తున్నది.

ఐడియాలజీతో పాటు డిజిటల్ వార్ : బీజేపీ

తెలంగాణలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో బీజేపీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయడానికి రాష్ట్ర నాయకత్వం డిజిటల్ సభ్యత్వాన్ని కంప్లీట్ చేసింది. యువతపైనే పదేండ్లుగా బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇది తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా అన్ని రాష్ట్రాల్లో ఈ ఫార్ములాను చేపట్టింది. విద్యార్థి సంఘాలు, యువ మోర్చా, సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల ద్వారా యువతను చేరుకునే ప్రయత్నాలను కొనసాగుతున్నది. శిక్షణా శిబిరాలు, డిజిటల్ క్యాంపెయిన్లు, జాతీయవాద అంశాలపై చర్చలు పెట్టి దేశ ఫ్యూచర్, ఉపాధి అవకాశాలు, కెరీర్‌ ఇంప్రూవ్‌మెంట్.. ఇలాంటివితో యువతను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నది. మొదటిసారి ఓటు వేయబోయే యువతపై మరింత దృష్టి పెట్టింది. కేవలం ఈ పర్పస్ కోసమే ప్రత్యేక డిజిటల్ కంటెంట్, షార్ట్ వీడియోలు, ఇన్‌ఫ్లూయెన్సర్ బేస్డ్ క్యాంపెయిన్, ఉద్యోగాలు-స్టార్టప్‌లపై చర్చలు పెడుతున్నది.

మహిళలు, యూత్‌పైనే మా ఫోకస్ : కవిత

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన తర్వాత తెలంగాణ రక్షణ సేన పేరుతో కొత్త రాజకీయ పార్టీని పెట్టిన కల్వకుంట్ల కవిత అనేక సందర్భాల్లో ఓపెన్‌గానే యూత్, మహిళలే తమ పార్టీ సైన్యంగా ఉంటారని ప్రకటించారు. ఇటీవల నిర్వహిస్తున్న కార్యక్రమాల్లోనూ వారికి ప్రాధాన్యం పెరిగింది. మహిళా సాధికారత, యువత రాజకీయ భాగస్వామ్యం, నాయకత్వ అవకాశాలు తదితర అంశాలను తరచుగా ప్రస్తావిస్తున్నారు. పార్టీ విస్తరణలో మహిళా ఓటు బ్యాంకు, యువ ఓటర్లను కలిపి ఒక కొత్త సామాజిక సమీకరణాన్ని నిర్మించాలనేది ఆమె ఆలోచన. పట్టణ ప్రాంతాల్లో చదువుకున్న యువతులు, ఉద్యోగినులను ఆకర్షించేందుకూ ప్రయత్నాలు మొదలయ్యాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ఓటు హక్కు కూడా లేని తరం ఇప్పుడు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే స్థాయికి చేరుకుంది.

అన్ని పార్టీల దృష్టి యువత పైనే :

యూత్ సెంట్రిక్‌గా రాజకీయ పార్టీల వ్యూహాలకు అనేక కారణాలున్నాయి. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో ఫస్ట్ టైమ్ ఓటర్లు జాబితాలో చేరుతున్నారు. ఈ తరంవారికి సంప్రదాయ రాజకీయాలపై విసుగుతో పాటు సింపతీ ఉండదు. కుల, కుటుంబ రాజకీయాల కంటే అవకాశాలు, ఉద్యోగాలు, అభివృద్ధి, పర్సనల్ డెవలప్‌మెంట్, కెరీర్ గ్రోత్.. వీటికే ప్రాధాన్యం. యువ ఓటర్ర ప్రభావం కుటుంబం, స్నేహితుల వర్గంపై గణనీయంగా ఉంటుంది. అందుకే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను పొలిటికల్ పార్టీలు కీలకంగా భావిస్తున్నాయి. సోషల్ పోస్టులు, షార్ట్ వీడియోలు, రీల్స్, మీమ్స్.. ఇవే నేటి పాపులర్ ప్రచార రూపాలు. ఫస్ట్ టైమ్ ఓటర్ లేదా యూత్‌గా పార్టీలో చేరితే రాబోయే ముప్పై ఏండ్ల వరకూ నాయకులుగా, ప్రచారకర్తలుగా, ఓటర్లుగా కొనసాగుతారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ అవకాశాలను కల్పిస్తున్నది. ఉద్యమ వారసత్వాన్ని బీఆర్ఎస్ గుర్తుచేస్తున్నది. జాతీయ రాజకీయాలను బీజేపీ ప్రస్తావిస్తున్నది. యూత్‌ను ఆకర్షించడానికి ప్రకటనలు, కార్యక్రమాల కంటే ఉద్యోగాల కల్పన, నియామకాలు, విద్యా అవకాశాలు, స్టార్టప్ ప్రోత్సాహం, రాజకీయాల్లో నిజమైన భాగస్వామ్యం వంటి అంశాలను ఎంచుకుంటున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>