అయ్యర్‌కు అగ్నిపరీక్ష.. జింబాబ్వేతో టీ20 ఫైట్!

కలం, స్పోర్ట్స్ బ్యూరో : ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లు ముగించుకున్న టీమిండియా.. ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి జింబాబ్వేతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగే ఈ సిరీస్‌లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని యువ భారత జట్టు బరిలోకి దిగుతున్నది. గత నెలలోనే టీ20 జట్టు కెప్టెన్‌గా అయ్యర్ (Shreyas Iyer) బాధ్యతలు చేపట్టాడు. అతడి నేతృత్వంలో జరిగిన రెండు టీ20 సిరీస్‌లలోనూ భారత్ జట్టు ఓడిపోయింది. అటు ఐర్లాండ్, ఇటు ఇంగ్లండ్‌తోనూ ఓడింది. దీంతో జింబాబ్వే సిరీస్‌ అయ్యర్‌‌కు అగ్నిపరీక్షలా మారింది.

ఈ సిరీస్‌లో భారత జట్టును శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) నడిపించనుండగా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, రింకూ సింగ్, శివమ్ దూబే వంటి దూకుడైన బ్యాటర్లు జట్టులో ఉన్నారు. పేస్ విభాగంలో మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్, అశోక్ శర్మ వంటి యువ పేసర్లు ఉండగా.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి ఉన్నాడు. ఈ సిరీస్‌లో అశోక్ శర్మ, యశ్ ఠాకూర్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌ అంతర్జాతీయ అరంగేట్రం చేసే అవకాశం కూడా ఉంది.

అటు బ్యాటింగ్.. ఇటు బౌలింగ్

బ్యాటింగ్ పరంగా భారత్‌ బలంగా ఉంది. అభిషేక్ శర్మ పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగలడు. శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్‌కు బలంగా నిలుస్తాడు. రింకూ సింగ్ ఫినిషర్ పాత్రలో ప్రమాదకరుడు. ఇషాన్ కిషన్ ఆరంభంలోనే వేగంగా పరుగులు చేయగలడు. తిలక్ వర్మ స్థిరత్వంతో పాటు దూకుడును చూపగలడు. జింబాబ్వేలో మాత్రం సికందర్ రజాపైనే ఎక్కువ భారం ఉంటుంది. అతను బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ ప్రభావం చూపాల్సి ఉంటుంది.

టాప్ ఆర్డర్ నిలబడితేనే ఆ జట్టు పోటీ ఇవ్వగలదు. బౌలింగ్ విభాగంలోనూ భారత్ వైవిధ్యంగా ఉంది. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ ప్రత్యర్థికి సవాల్‌గా మారుతుంది. మయాంక్ యాదవ్ వేగం మరో ప్రధాన ఆయుధం. యశ్ ఠాకూర్, అశోక్ శర్మ కొత్త బంతితో ప్రభావం చూపాలని చూస్తున్నారు. జింబాబ్వే బౌలింగ్‌లో బ్లెస్సింగ్ ముజరబానీ ప్రధాన బలం. అతనికి సికందర్ రజా స్పిన్ తోడైతే భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టే అవకాశం ఉంటుంది.

జింబాబ్వే తక్కువేమీ కాదు..

జింబాబ్వేకు సొంత మైదానం పెద్ద బలం. కెప్టెన్ సికందర్ రజా అనుభవజ్ఞుడు. అతనితో పాటు బ్రియాన్ బెన్నెట్, క్లైవ్ మదాండే, రిచర్డ్ నగరవా, బ్లెస్సింగ్ ముజరబానీ వంటి ఆటగాళ్లు జట్టుకు కీలకం. హరారే పరిస్థితులు వారికి బాగా తెలుసు. భారత్ బలమైన జట్టే అయినా ఈ సిరీస్ ఏకపక్షంగా ఉండదని సికందర్ రజా ముందే స్పష్టం చేశాడు.

భారత్‌దే పైచేయి

భారత్, జింబాబ్వే ఇప్పటివరకు 14 టీ20 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో భారత్ 11 మ్యాచ్‌లలో, జింబాబ్వే 3 మ్యాచ్‌లలో గెలిచాయి. ఇటీవల రెండు జట్ల మధ్య జరిగిన సిరీస్‌ను కూడా భారత్ సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు భారత్‌దే పైచేయి. అయితే జింబాబ్వే గెలిచిన మ్యాచ్‌లన్నీ భారత్‌ను ఆశ్చర్యానికి గురిచేసినవే. అందుకే ఈసారి కూడా తొలి మ్యాచ్ కీలకంగా మారే అవకాశం ఉంది.

ప్రస్తుత జట్ల బలం, ఆటగాళ్ల ఫామ్, బెంచ్ స్ట్రెంగ్త్, అంతర్జాతీయ అనుభవం అన్నింటినీ పరిశీలిస్తే భారత్‌కే స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లోనూ బలంగా ఉంది. జింబాబ్వేకు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉన్నా.. భారత్‌ను నిలువరించడం అంత సులభం కాదు.

వీళ్లే కీలకం

శ్రేయస్ అయ్యర్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, వరుణ్ చక్రవర్తి, మయాంక్ యాదవ్‌పైనే అందరి దృష్టి ఉంది. మయాంక్ వేగం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు జింబాబ్వేకు సికందర్ రజా, బ్లెస్సింగ్ ముజరబానీ, బ్రియాన్ బెన్నెట్ ప్రదర్శన చాలా కీలకం కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>