కలం, వెబ్ డెస్క్: ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో అలిపిరి వద్ద వాహనాలు బారులు తీరాయి. శుక్రవారం ఒక్కరోజే 84,468 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 40,203 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం అన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.48 కోట్లు వచ్చినట్లు టీటీడీపీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తమిళనాడు సీఎం విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ శ్రీవారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ అధికారులు స్వాగతించారు. దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అటు హీరో రవితేజ కూతురు మోక్షద, తమ్ముడి కొడుకు మహధన్ స్వామివారిని దర్శించుకున్నారు.
ఎన్‌ఆర్‌ఐలకు తిరుమల (Tirumala) తిరుపతి దేవస్థానం శుభవార్త తెలిపింది. తిరుమల శ్రీవారి సుపథం దర్శనం కోసం ఎన్‌ఆర్‌ఐలకు ఉన్న అర్హత గడువును 30 రోజుల నుంచి 90 రోజులకు టీటీడీ పెంచింది. విదేశాల నుంచి వచ్చిన భక్తులు దేశంలో అడుగుపెట్టిన తేదీ నుంచి 90 రోజుల వరకు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. అపన్న హృదయ పథకం కింద గుండె సంబంధిత అత్యవసర చికిత్సల కోసం ఆర్థిక సహాయాన్ని పెంచే నిర్ణయం కూడా తీసుకుంది. టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.
ప్రయోగాత్మకంగా ‘శ్రీవారి వైద్య సేవ’..
అటు శ్రీవారి భక్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు మరో వినూత్న కార్యక్రమానికి టీటీడీ శ్రీకారం చుట్టింది. ప్రయోగాత్మకంగా ‘శ్రీవారి వైద్య సేవ’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ దేశవ్యాప్తంగా ఉన్న వైద్య నిపుణులకు స్వచ్ఛంద సేవల కోసం ఆహ్వానం పలికింది. ఈ కార్యక్రమం ద్వారా అనుభవజ్ఞులైన వైద్యులు, నిపుణులు తిరుమలలోని టీటీడీ ఆస్పత్రుల్లో సేవలు అందించనున్నారు. భక్తులకు మరింత నాణ్యమైన వైద్య సేవలు అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా టీటీడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ‘శ్రీవారి వైద్య సేవ’ కార్యక్రమం కింద వివిధ వైద్య రంగాలకు చెందిన నిపుణులు స్వచ్ఛందంగా నమోదు చేసుకుని తమ సేవలను అందించవచ్చు. తిరుమలలో రోజూ లక్షలాది మంది భక్తులు దర్శనానికి వస్తుండటంతో వైద్య సేవల అవసరం కూడా అధికంగా ఉండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది.

