వానల్లేవ్.. యూరియా వద్దు!

కలం, కరీంనగర్ బ్యూరో: రామగుండం ఫర్టిలైజర్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సీఎల్)పై కూడా ఎల్ నినో (El Nino) ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఖరీఫ్ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వ్యవసాయ పనులు మొదలు కాలేదు. బావులు, బోర్ల కింద సాగునీరు అందుబాటులోని ప్రాంతాల్లో మాత్రమే వరి నాట్లు వేశారు. మిగతా ప్రాంతాల్లో కొనసాగించడం లేదు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా యూరియా డిమాండ్ (Telangana Urea Demand) గణనీయంగా తగ్గిపోయింది. గతంలో తరచూ సాంకేతిక లోపాల కారణంగా ఆర్ఎఫ్‌సీఎల్ ప్లాంట్ షట్‌డౌన్ కావడంతో రైతులు యూరియా కొరతను ఎదుర్కొన్నారు.

ప్రస్తుతం ప్లాంట్‌లో ఉత్పత్తి కొనసాగుతున్నప్పటికీ, వర్షాభావం కారణంగా సాగు విస్తీర్ణం తగ్గడంతో యూరియా అవసరం కూడా తగ్గింది. ఫలితంగా కొనుగోళ్లు తగ్గి, కేంద్ర సబ్సిడీ విడుదలపై ప్రభావం పడడంతో ప్లాంట్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా సుమారు లక్ష టన్నుల యూరియా నిల్వలు ఉన్నట్లు తెలిసింది.

మార్క్‌ఫెడ్ గోదాముల్లో స్టాక్ ఫుల్

తెలంగాణలోని ఏకైక యూరియా ఉత్పత్తి ప్లాంట్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఆర్ఎఫ్‌సీఎల్‌. ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఏప్రిల్, మే నెలల్లో రాష్ట్రానికి 65 వేల టన్నులు, జూన్‌లో 55 వేల టన్నుల యూరియాను అధికారులు కేటాయించారు. జులై నెలకు గాను 45 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్నినిర్దేశించారు. అయితే ఇటీవల ప్లాంటులో ఏర్పడిన సాంకేతిక సమస్యలతో ఇప్పటివరకు కేవలం 10 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరిగింది. మిగిలిన రోజుల్లో లక్ష్యాన్ని చేరుకునేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.50 లక్షల టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు రైతులు కేవలం లక్ష టన్నులే కొనుగోలు చేశారు.

ఇందులో సుమారు 1.50 లక్షల టన్నులు మార్క్‌ఫెడ్ గోదాముల్లో నిల్వ ఉన్నట్లు సమాచారం. ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో వరి వంటి అధిక నీటి పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని ప్రభుత్వం రైతులకు సూచించింది. ఫలితంగా యూరియా డిమాండ్‌పై ప్రత్యక్ష ప్రభావం పడింది. అదే సమయంలో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వర్షపాతం తగ్గి, ఎగువన ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పడిపోతే, ఆర్ఎఫ్‌సీఎల్‌కు అవసరమైన పారిశ్రామిక నీటి సరఫరాపైనా ప్రభావం పడే అవకాశం ఉంది.

ఏడు రాష్ట్రాలకు కల్పతరువు

ఆర్ఎఫ్‌సీఎల్‌కు అవసరమైన సహజవాయువు ప్రధానంగా పశ్చిమాసియా దేశాల నుంచి వస్తోంది. ప్లాంట్‌ రోజుకు సుమారు 2 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల రీగ్యాసిఫైడ్ లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఆర్‌ఎల్‌ఎన్‌జీ)ను వినియోగిస్తుంది. ఖతార్ నుంచి దహేజ్ ఎల్‌ఎన్‌జీ టర్మినల్‌కు నౌకల ద్వారా గ్యాస్ చేరుతుంది. అక్కడి నుంచి పెట్రోనెట్ ఎల్‌ఎన్‌జీ, గెయిల్ పైప్‌లైన్ల ద్వారా కాకినాడకు, అనంతరం మల్లవరం–బోపాల్–బిల్వారా గ్యాస్ పైప్‌లైన్ ద్వారా రామగుండం ప్లాంట్‌కు సరఫరా అవుతోంది.

రామగుండం ఎరువుల కర్మాగారంలో ఏడాదికి 12.7 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి లక్ష్యంగా ఉంది. రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ లకు యూరియాను సరఫరా చేస్తోంది. తెలంగాణ అవసరాల్లో సుమారు 11 శాతం ఇక్కడి ప్లాంట్ నుంచే అందుతోంది. అందువల్ల దీన్ని ఏడు రాష్ట్రాలకు కల్పతరువుగా భావిస్తారు.

తరచూ లీకేజీలు.. షట్‌డౌన్లు

సాంకేతిక లోపాలు, అమ్మోనియా గ్యాస్ కొరత వంటి కారణాలతో ఆర్ఎఫ్‌సీఎల్ ప్లాంట్ తరచూ షట్‌డౌన్ అవుతోంది. గతంలో స్టీమ్ పైప్‌లైన్ పగిలిపోవడం, అమ్మోనియా గ్యాస్ లీకేజీలు, గ్యాస్ సరఫరాలో అంతరాయం వంటి కారణాలతో యూరియా ఉత్పత్తికి తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం కూడా గ్యాస్ సరఫరాపై పడడంతో ఉత్పత్తి దెబ్బతిన్న సందర్భాలు ఉన్నాయి. గత రెండు, మూడేళ్లుగా ఏటా మూడు నుంచి నాలుగు నెలలపాటు వివిధ సాంకేతిక సమస్యలతో ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిచిపోతూ వస్తోంది. మరమ్మతుల అనంతరం తిరిగి ఉత్పత్తి ప్రారంభమవుతోంది.

తాజాగా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అమ్మోనియా పైప్‌లైన్ లీకేజీ కారణంగా మరోసారి ప్లాంట్ పూర్తిగా నిలిచిపోయి తాత్కాలికంగా షట్‌డౌన్ ప్రకటించారు. జూన్‌లో రాష్ట్రానికి 48 వేల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసిన ప్లాంట్, జులై మొదటి పది రోజుల్లో సరిగా పనిచేయలేకపోయింది. దీంతో యూరియా కొరతపై రైతుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే పది రోజుల తర్వాత మరమ్మతులు పూర్తి చేసి ఉత్పత్తిని పునరుద్ధరించారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో సాగు పనులే మందగించడంతో యూరియా అవసరం కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు చెప్పులు క్యూలో పెట్టి యూరియా కోసం ఎదురుచూసిన రైతులు, ఇప్పుడు వర్షాభావం కారణంగా యూరియా అవసరం లేక గోదాముల్లోనే భారీగా నిల్వలు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>