నీట్ అవకతవకలపై జవాబు చెప్పాలి : ఎంపీ చామల

కలం, భువనగిరి: పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ ఎంపీలు నల్ల దుస్తులు ధరించి తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. ఈ ఆందోళనలో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ, కే.సి. వేణుగోపాల్‌లు ప్రధానమంత్రి నివాసం ముందు నిరసన తెలిపారని గుర్తుచేశారు.

ఆ సమయములో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ చర్చలు జరపగా, రాహుల్ గాంధీ 5 కీలక డిమాండ్లను కేంద్రం ముందుంచారని వెల్లడించారు. నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, నీట్ అవకతవకలు, పేపర్ లీకేజీలపై పార్లమెంట్‌లో పూర్తిస్థాయి చర్చ జరగాలని, విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జ్ ఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు, శాంతియుత నిరసనలపై జరిగిన దాడిపై అమిత్ షా పార్లమెంట్ వేదికగా పూర్తి వివరణ ఇవ్వాలని పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ప్రతిపాదించిన ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం నెరవేరిస్తేనే, పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షంగా సహకరిస్తామని తెలిపారు. 18వ లోక్‌సభను కేంద్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా నడుపుతోందని ఎంపీ విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ చేస్తున్నారని, దీనిని నిరసిస్తూ తాము స్పీకర్ వెల్‌లోకి వెళ్తే అక్రమంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. పార్లమెంట్‌లో 2/3 వంతు మెజారిటీ సాధించి, దేశంలో ప్రాంతీయ పార్టీల ఉనికి లేకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజాస్వామ్య విరుద్ధ వైఖరిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని, రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పార్లమెంట్‌ను నడపాలని ఈ సందర్భంగా ఎంపీ (MP Chamala) డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>