ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంగళవారం ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ భేటీ అయింది. ఈ భేటీలో నాలుగు రైల్వే ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్గడ్ లోని 18 జిల్లాలను కవర్ చేసే నాలుగు మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులను(Mutitracking Railway Projects) దాదాపు రూ.24,634 కోట్ల వ్యయంతో నిర్మించడానికి నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాజెక్టులు భారత రైల్వేల ప్రస్తుత నెట్‌వర్క్‌ను దాదాపు 894 కి.మీ. మేర పెంచుతాయని కేంద్రం తెలిపింది. ప్రయాణికులు, గూడ్స్, ఇతర సేవలకి సజావుగా కనెక్టివిటీని అందించడంలో సహాయపడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.
నాలుగు రైల్వే ప్రాజెక్టుల(Railway Projects) వివరాలు:
1.వార్ధా – భూసావల్ (3వ, 4వ లైన్లు)
ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 314 కి.మీ, ఖర్చు రూ. 9,197 కోట్లు. ఇది మహారాష్ట్ర పారిశ్రామిక ప్రాంతాలకు వేగవంతమైన రైలు కనెక్టివిటీని అందిస్తుంది. ఏటా సుమారు 90 మిలియన్ లీటర్ల డీజిల్ ఆదా చేస్తుంది.
2. గోండియా-డోంగర్‌గఢ్ (4వ లైన్)
రూ. 4,600 కోట్ల వ్యయంతో 84 కి.మీ. మేర ఈ ప్రాజెక్ట్ నిర్మించనున్నారు. ఈ లైన్ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ పర్యాటక సర్క్యూట్‌ల గుండా వెళుతుంది. రాయ్‌గఢ్, తాల్చేర్, కోర్బా, ఐబి వ్యాలీలోని గనుల నుండి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు తరలింపు ఈ ప్రాజెక్టు ద్వారా సులభతరం కానుంది. ఇది ఏటా 46 మిలియన్ లీటర్ల డీజిల్‌ను కూడా ఆదా చేస్తుందని అంచనా.
3. వడోదర – రత్లామ్ (3వ, 4వ లైన్లు)
గుజరాత్, మధ్యప్రదేశ్ మధ్య 259-కి.మీ మేర ప్రాజెక్ట్ నిర్మాణం జరగనుంది. సుమారు రూ. 7,600 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు వలన ఏటా 76 మిలియన్ లీటర్ల డీజిల్ ఆదా అవుతుందని భావిస్తున్నారు.
4. ఇటార్సి – భోపాల్ – బినా (4వ లైన్)
రూ. 3,237 కోట్ల వ్యయంతో 237-కి.మీ లైన్ నిర్మించనున్నారు. దీని వలన ఏటా 64 మిలియన్ లీటర్ల డీజిల్ ఆదా అవడంతో పాటు సరుకు రవాణా పెరుగుతుందని రైల్వే శాఖ అంచనా.

