తెలంగాణ కాంగ్రెస్ లో పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్(Adluri Laxman) వివాదం తారాస్థాయికి చేరుకుంది. దున్నపోతు అంటూ పొన్నం ప్రభాకర్ తన చేసిన వ్యాఖ్యలు పార్టీలో అంతర్గత విభేదాలకు దారి తీసింది. దళిత మంత్రిని అవమానించారంటూ పొన్నం ప్రభాకర్ పై అడ్లూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనతోపాటు మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా తనని కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నం తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేదంటే ఈ వ్యవహారం పార్టీ హై కమాండ్ వరకు తీసుకెళ్తానని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కి లేఖ రాసినట్టు తెలిపారు.
అయితే, ఈ వివాదంపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)… తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తాను అడ్లూరి పేరు ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చూసి అడ్లూరి తప్పుగా అనుకున్నట్లు ఉన్నారన్నారు. ఈ విషయంపై అడ్లూరితో మాట్లాడేందుకు ట్రై చేసినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని స్పష్టం చేశారు. ఈ విషయంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కూడా మాట్లాడినట్టు తెలిపారు. ఇదంతా కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఇంకేం లేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే ఇదే వ్యవహారంపై సోమవారం మాట్లాడిన పొన్నం… అడ్లూరి లక్ష్మణ్ అంటే మాకెంతో గౌరవం. ఢిల్లీ వెళ్లేందుకు టికెట్స్ ఇంకా కన్ఫర్మ్ కాకపోవడంతో నా సిబ్బందిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారని చెప్పుకొచ్చారు.

