జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికకు సమయం దగ్గర పడుతోంది. పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. రాజకీయ పార్టీలు కూడా వ్యూహ రచన, ప్రచారాలను ఫుల్ జోష్‌లో కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చీఫ్ ఎలక్షన్ అధికారి సుదర్శన్ రెడ్డి(CEO Sudarshan Reddy).. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఇందులో పార్టీలకు పలు కీలక సూచనలు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ తీసుకొచ్చిన కొత్త ఎన్నికల సంస్కరణలను అమల్లోకి రానున్నట్లు వెల్లడించారు. ఆ సంస్కరణలు ఏంటి అనే అంశాన్ని పార్టీలకు వివరించారు. ఈ కొత్త ఎన్నికల సంస్కరణలు తొలిసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల ఉపఎన్నికల్లో అమల్లోకి రానున్నట్లు వివరించారు. ఓటర్ల సౌకర్యం, పారదర్శకత, ఎన్నికల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు చేసినట్లు చెప్పారు.
చేసిన సంస్కరణలు ఇవే..
• ఒక్కో పోలింగ్ కేంద్రంలో గరిష్టంగా 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు.
• వృద్ధులు, దివ్యాంగుల కోసం సౌకర్యాలు — వీల్‌చెయిర్లు, ర్యాంపులు, పిక్-అప్/డ్రాప్ సదుపాయాలు.
• ఓటర్లు తమ అభ్యర్థులను సులభంగా గుర్తించేందుకు ఈవీఎంలపై రంగు ఫోటోలు ఉంచడం.
• మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) ఉల్లంఘనలపై కఠిన చర్యలు, టెక్నాలజీ ఆధారిత పర్యవేక్షణ.
• మహిళా ఓటర్ల పాల్గొనడం పెంచేందుకు మహిళా సిబ్బందిని అదనంగా నియమించడం.
• పర్యావరణహిత ఎన్నికలు — పేపర్ వినియోగం తగ్గించడం, డిజిటల్ సమాచార మార్పిడి ప్రోత్సాహం.
• రియల్‌టైమ్ ఓటింగ్ టర్నౌట్ మానిటరింగ్ కోసం డిజిటల్ డ్యాష్‌బోర్డులు, మొబైల్ యాప్‌లు.
• సున్నితమైన పోలింగ్ కేంద్రాల్లో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత పర్యవేక్షణ, జీపీఎస్ ట్రాకింగ్.

