కలం, నేషనల్ డెస్క్: అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల కమిషన్ (Election Commission) షెడ్యూలు ప్రకటించనున్నది. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ఈసీ అత్యవసర మీడియా సమావేశాన్ని నిర్వహించి ఎన్నికల తేదీలను ప్రకటించనున్నది. ఈ ఐదు రాష్ట్రాలకు కలిపి ఒకేసారి షెడ్యూలు ప్రకటించేలా ఈసీ ప్లాన్ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పశ్చిమబెంగాల్‌లో ఎనిమిది విడతల్లో పోలింగ్ జరగ్గా ఈసారి మాత్రం ఐదు ఫేజ్‌లలో ముగించాలని చూస్తున్నది.
తమిళనాడు (Tamil Nadu), కేరళం (Keralam), పుదుచ్చేరి రాష్ట్రాలకు మాత్రమే సింగిల్ ఫేజ్‌లోనే నిర్వహించాలన్నది ప్లాన్. ఢిల్లీలో ఈసీ ప్రధాన కమిషనర్ సహా ఇద్దరు కమిషనర్లు మీడియా సమావేశంలో సాయంత్రం నాలుగు గంటలకు షెడ్యూలు ప్రకటించనున్నారు. ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సన్నద్ధతపై ఆయా రాష్ట్రాల ఎన్నికల ప్రధానాధికారులతో సమావేశమయ్యారు. పోలింగ్ నిర్వహణ కోసం చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. అంతా సంతృప్తికరంగా, ఏర్పాట్లు సిద్ధమయ్యాయని భావించడంతో ఇక షెడ్యూలు ప్రకటించడానికి ఈసీ సిద్ధమవుతున్నది. సాయంత్రానికి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

