కలం, వెబ్డెస్క్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) లోని జైళ్లలోని భారతీయ ఖైదీల్లో 900 మంది త్వరలో స్వదేశానికి చేరుకోనున్నారు. వీరిలో వివిధ కేసుల్లో దీర్ఘకాల శిక్ష అనుభవిస్తున్నవాళ్లు సైతం ఉన్నారు. ఈ మేరకు ఖైదీల వివరాలతో కూడిన జాబితాను యూఏఈ ప్రభుత్వం శుక్రవారం అబుదాబిలోని ఇండియన్ ఎంబీసీ (UAE – India) కి అందజేసింది.
గతేడాది డిసెంబర్ 2న జాతీయ వేడుక ‘ఈద్ అల్ ఎతిహాద్’ సందర్భంగా 2,937 మంది ఖైదీలకు యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ క్షమాభిక్ష ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఖైదీలను విడుదల చేయడంతోపాటు వారిని స్వదేశానికి పంపేందుకు అయ్యే ఖర్చంతా యూఏఈనే భరించనున్నట్లు అప్పట్లో ఓ ప్రకటనలో వెల్లడించింది. ఖైదీలు తమ కుటుంబాలను కలసి సరికొత్త జీవితం ప్రారంభించేలా, వాళ్ల కుటుంబాల్లో ఆనందం నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది. ఇందులో భాగంగా మొత్తం ఖైదీల్లో తొలి విడతగా 900 మంది పేర్లతో కూడిన జాబితాను భారత్కు యూఏఈ (UAE – India) అందజేసింది.
కాగా, రెండ్రోజుల కిందట యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్కు వచ్చి వెళ్లిన సంగతి తెలిసిందే. కేవలం మూడు గంటలు మాత్రమే భారత్లో పర్యటించిన ఆయనను ప్రధాని నరేంద్ర మోదీ విమానాశ్రయానికి వెళ్లి మరీ ఆహ్వానించారు. అనంతరం ఇద్దరూ రెండు గంటలు చర్చలు జరిపారు. ఇందులో రక్షణ, వాణిజ్యం, ఇంధన వనరులు తదితర ముఖ్యాంశాలు ఉన్నాయి. ఈ క్రమంలో యూఏసీ ప్రెసిడెంట్ తిరిగి స్వదేశానికి వెళ్లిన వెంటనే.. ఆ దేశ అధికారులు భారతీయ ఖైదీల విడుదల జాబితా అందజేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. నేడో రేపో ఖైదీల వివరాలను భారత ఎంబీసీ వెల్లడించే అవకాశం ఉంది.
Read Also: అమెజాన్ ఉద్యోగులకు ముంచుకొస్తున్న లేఆఫ్ గడువు!
Follow Us On: Sharechat


