కలం, నిజామాబాద్ బ్యూరో : నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను (Labour Codes) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (TUCI) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద 4 లేబర్ కోడ్ ల ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా టీయుసీఐ ఆలిండియా ఉపాధ్యక్షులు వనమాల కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ లు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లను ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేయబోతుందన్నారు. ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం లేబర్ కోడ్ ల అమలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కంపెనీల యాజమాన్యాలకు ఊడిగం చేసేలా, కార్మికుల హక్కులను, చట్టాలను కాలరాస్తూ కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను 4 లేబర్ కోడ్ లుగా మార్పు చేసిందని ఆరోపించారు.
ఈ కోడ్ లు అమలైతే దశాబ్దాలుగా పోరాటం చేసి సాధించుకున్న హక్కులను కార్మికులు కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. పని గంటలు పెరిగి, వారి న్యాయమైన డిమాండ్లను, సమస్యలను కూడా పరిష్కరించుకోలేని పరిస్థితికి నెట్టబడతారన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో ఈ చట్టాల అమలును నిలిపివేయకపోతే కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళనలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు..
ఈ కార్యక్రమంలో టియుసిఐ (TUCI) జిల్లా ఉపాధ్యక్షులు రాజేశ్వర్, జిల్లా నాయకులు సాయరెడ్డి, కిరణ్, రవి, గంగాధర్, ఏఐపీకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు కే.గంగాధర్, ఒడ్డెన్న, నసీర్, సాయిబాబా, టియుసిఐ నాయకులు విజయ్ కుమార్, శాంతి కుమార్, అమూల్య, పద్మ, గంగాధర్, లక్ష్మణ్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Read Also: ‘హేట్ స్పీచ్’ బిల్లుతో ప్రజాస్వామ్యానికి ముప్పు : కేటీఆర్
Follow Us On : WhatsApp

