కలం, వెబ్ డెస్క్ : హేట్ స్పీచ్ బిల్లు (Hate Speech Bill) తో రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య మూలాలకే ముప్పు వాటిల్లుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆందోళన వ్యక్తం చేశారు. ఈ బిల్లును ప్రజల హక్కులను హరించే ఒక క్రూరమైన ఆయుధంగా అభివర్ణిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే వారి నోళ్లు మూయించేందుకు ఇలాంటి నిరంకుశ చట్టాలను తీసుకువస్తోందని ఆరోపించారు. సామాజిక సామరస్యాన్ని కాపాడటం ప్రభుత్వం భాద్యతే అయినా, ఈ బిల్లు లోని నిబంధనలు అత్యంత ఉన్నాయన్నారు. అలాగే అధికారుల వ్యక్తిగత అభిప్రాయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా బిల్లు రూపకల్పన చేశారని.. ఇది ఖచ్చితంగా దుర్వినియోగానికి దారి తీస్తుందన్నారు.
ప్రభుత్వం వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా హేట్ స్పీచ్ బిల్లు (Hate Speech Bill) తీసుకొస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను విమర్శిస్తే వాటిని ఫేక్ వార్తలుగా ముద్రవేసి జైలుకు పంపే ప్రమాదం ఉందన్నారు. ‘శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును కేటీఆర్ గుర్తుచేశారు. ఈ బిల్లుతో భావ ప్రకటన స్వేచ్ఛ హరించడమేనని చెప్పారు. జైలు శిక్షను ప్రతిపాదించడం ద్వారా ప్రభుత్వం.. ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించాలని చూస్తోందని విమర్శించారు. జర్నలిస్టులు, విద్యార్థులు, సామాన్యులు తమ అభిప్రాయాలను పంచుకోవాలంటే భయం కలిగించేలా ఈ శిక్షలు ఉన్నాయన్నారు. దేశంలో ఇప్పటికే హేట్ స్పీచ్ పై చట్టాలు ఉండగా.. అదనంగా ఈ చట్టం తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటి అని.. వెంటనే ఈ బిల్లను పునర్విమర్శించాలని ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు.
Read Also: మావోయిస్టు గణపతికి మెరుగైన వైద్యం అందిస్తాం : డీజీపీ
Follow Us On : WhatsApp

