కలం, వెబ్‌డెస్క్: ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల (Tirumala) కొండపై ఉన్న హోటళ్లకు టీటీడీ (TTD) షాకిచ్చింది. హోటళ్లలో క్యాలీఫ్లవర్‌పై సంపూర్ణ నిషేధం (Cauliflower Ban) విధించింది. ఇటీవల టీటీడీ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు తిరుమలలోని పలు హోటళ్లు, చిన్న చిన్న ఫుడ్ స్టాళ్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అక్కడ వాడుతున్న క్యాలీఫ్లవర్లలో పురుగులు ఉండటాన్ని గమనించారు. అలాగే పరిసరాలు తీవ్ర అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఫుడ్ తయారీలో నాణ్యతా లోపాలను గుర్తించారు. ఇలాంటి ఆహారం తింటే భక్తుల అనారోగ్యం పాలవడం ఖాయమని భావించిన టీటీడీ అధికారులు తిరుమల కొండపై క్యాలీఫ్లవర్ వంటకాలను తయారు చేయడం, విక్రయించడం చేయకూడదని స్పష్టం చేశారు.
తిరుమలకు రోజూ వేలాది సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో కొండపై ఉన్న హోటళ్లలో భారీ ఎత్తున ఫుడ్ బిజినెస్ జరుగుతుంది. మెజార్టీ హోటళ్లలో వెజ్ ఫ్రైడ్ రైస్, క్యాలీఫ్లవర్ రైస్‌లు ఖచ్చితంగా ఉంటాయి. ఇక్కడ అధిక ధరలతో పాటు, అపరిశుభ్ర వాతావరణం ఉందని భక్తులు కూడా పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇక తాజాగా అధికారులు తీసుకున్న చర్యలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫుడ్ బదులు కొండపై మిల్లెట్స్‌తో చేసే ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.

