వేములవాడ ఆలయాన్ని కృష్ణ శిలతో నిర్మించాలి.. కవిత డిమాండ్

కలం, కరీంనగర్: కాంక్రీట్ తో వేములవాడ రాజన్న గుడి కడుతూ భక్తుల విశ్వాసాన్ని దెబ్బ తీస్తున్నారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటనలో భాగంగా వేములవాడ భీమేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఆమె మీడియాతో మాట్లాడారు. రాజన్న ఆలయాన్ని కృష్ణ శిలలతో ఆగమ శాస్త్రం ప్రకారం నిర్మించాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్ హిట్ జోడీ కాదని.. ఇడుపు కాయితం జోడీ అంటూ దుయ్యబట్టారు. నవంబర్ వరకు రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. అడుక్కుంటారో, కొనుక్కు వస్తారో కానీ రైతులకు కరెంట్ ఇవ్వకపోతే ఊరుకోమని హెచ్చరించారు.

సిరిసిల్ల సెస్ లో జరిగిన రూ. 32 కోట్ల అవినీతిపై విచారణ జరపాలని కవిత డిమాండ్ చేశారు. సిరిసిల్ల జిల్లా అయిన తర్వాత కూడా నీటి పారుదల రంగంలో అన్యాయమే జరుగుతోందని మండిపడ్డారు. అప్పర్ మానేర్ – మిడ్ మానేర్ లింక్ పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. కాళేశ్వరంతో సిరిసిల్ల, వేములవాడ నియోజకర్గాలకు ఒరిగిందేమీ లేదన్నారు. నేరెళ్ల బాధితుల పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి వాళ్లను మళ్లీ మోసం చేశారని విమర్శించారు. వారికి న్యాయం జరిగే వరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని దుయ్యబట్టారు.

సిరిసిల్ల జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇక్కడ ఏం జరిగిందన్నది ప్రజలందరికీ తెలియాలని కవిత అన్నారు. ముఖ్యంగా వేములవాడ రాజన్న ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని.. చోళుల కన్నా ముందు నుంచే గొప్ప చరిత్ర ఉందని కొనియాడారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు తన భార్య జాంబవతికి సంతానం కోసం ఇక్కడ కోడె మొక్కులు చెల్లించారని.. ఆనాటి నుంచే కోడె మొక్కుల సంప్రదాయం ప్రారంభమైందని చెప్పారు. తమ పార్టీకి, తమ పిల్లలకు రాజన్న ఆశీస్సులు ఉండాలని తాము కూడా కోడెలు కట్టేశామని వివరించారు. వేములవాడలో కోడెను కట్టేసే సంప్రదాయాన్ని కొంగు బంగారం అంటారని తెలిపారు. అలాంటి ఈ ఆలయంలో కోడెలు సరైన పశుగ్రాసం లేకుండా చనిపోవటం బాధాకరమని అన్నారు.

కోడెలు చనిపోతే శాస్త్రం ప్రకారం అంత్యక్రియలు కూడా చేయటం లేదని అన్నారు. ఇక్కడి ఎంపీ బండి సంజయ్ మాట్లాడితే హిందూత్వం అంటారు కానీ.. వేములవాడలో కోడెలు చనిపోతుంటే పట్టించుకోవటం లేదని దుయ్యబట్టారు.  వాటికి మంచి పశుగ్రాసం అందించి మంచిగా చూసుకోవాలని కోరుతున్నానని అన్నారు.  వేములవాడ ఆలయానికి రూ. 250 కోట్లు మేము ఇచ్చామంటే మేము అంటూ బీఆర్ఎస్, కాంగ్రెస్ లు విమర్శలు చేసుకుంటున్నాయని దుయ్యబట్టారు.

ఆలయానికి నిధులిచ్చిన విషయంలో రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అటు వేములవాడ గుడిని కాంక్రీట్ తో నిర్మిస్తున్నారని.. దీనివల్ల ఆలయం ఎక్కువ కాలం నిలవదని అన్నారు. కృష్ణశిలతో ఆగమ శాస్త్ర ఆచారం ప్రకారం ఈ గుడిని నిర్మించాలని డిమాండ్ చేశారు.  కృష్ణశిల ఉందని.. ఆగమ శాస్త్రం తెలిసిన వాళ్లు ఉన్నారని.. అయినప్పటికీ ఎందుకు కాంక్రీట్ తో నిర్మిసున్నారో చెప్పాలి? అని డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>