గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోరు.. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బిగ్ ఝలక్..!

కలం, తెలంగాణ బ్యూరో: రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు (Graduate MLC Elections) అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్ ముందస్తు వ్యూహాన్ని రూపొందించుకున్నది. గత ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన విధానాన్ని ఈసారి కాంగ్రెస్ అమలు చేసింది. త్వరలో బీఆర్ఎస్ సైతం అభ్యర్థులను ఖరారు చేయనున్నది. కాంగ్రెస్ రెండు స్థానాలనూ రెడ్డి సామాజికవర్గానికి కేటాయించడంతో దీనికి కౌంటర్‌గా బీఆర్ఎస్ భిన్నమైన వ్యూహాన్ని అమలు చేయాలని అనుకుంటున్నది.

ఒక స్థానంలో ‘రెడ్డి’ అభ్యర్థిని నిలబెట్టి, మరో స్థానంలో బీసీ అభ్యర్థిని బరిలోకి దించాలని బీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తున్నది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం సెగ్మెంట్ నుంచి గతంలో పోటీ చేసి, సెకండ్ ప్లేస్‌లో నిలిచిన రాకేశ్‌రెడ్డికి అక్కడ అవకాశం ఇవ్వాలని.. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ సెగ్మెంట్‌లో బీసీ వ్యక్తిని నిలబెట్టాలని ప్రాథమికంగా చర్చించింది. హైదరాబాద్‌ నుంచి పోటీ చేసేందుకు నాగేందర్ గౌడ్, కాసాని వీరేశం ఆసక్తి చూపుతున్నట్టు సమాచారం అందుతోంది. త్వరలో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో అభ్యర్థులు ఎవరనేది ఖరారు కానున్నది.

ఓవైపు సామాజికవర్గ సమీకరణాలతో కాంగ్రెస్‌ను దెబ్బకొట్టాలని, మరోవైపు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవాలని గులాబీ పార్టీ వ్యూహం రచిస్తున్నది. హైదరాబాద్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడంతో పాటు నల్లగొండ స్థానాన్ని కూడా చేజిక్కించుకోవాలని కసరత్తు చేస్తున్నది.

ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపై ఆశలు

ప్రభుత్వంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ఉన్న వ్యతిరేకత.. వివిధ రంగాల ప్రొఫెషనల్స్, మేధావులు, నిరుద్యోగ గ్రాడ్యుయేట్లలో ఉన్న అసంతృప్తిని బీఆర్ఎస్ అనుకూలంగా మల్చుకోవాలనుకుంటున్నది. రానున్న రోజుల్లో పీఆర్సీ, పెండింగ్ డీఏలు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, బిల్లుల బకాయిలు, జాబ్ క్యాలెండర్ అమలు కాకపోవడం, నోటిఫికేషన్లు విడుదల కాకపోవడం.. ఇలాంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నది.

రెండు సీట్లకు రెండు అస్త్రాలు

ఆరేండ్ల క్రితం ఈ రెండు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. హైదరాబాద్ స్థానంలో పీవీ నర్సింహారావు కుమార్తె సురభి వాణిదేవి పూర్తికాలం ఆ పదవిలో కొనసాగారు. కానీ నల్లగొండ సెగ్మెంట్‌లో మాత్రం ఎమ్మెల్సీగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్) 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసిన తీన్మార్ మల్లన్న గెలుపొందారు.

దీంతో ఈ రెండు స్థానాల్లోనూ బీఆర్ఎస్‌కు బలమైన మద్దతు ఉన్నదనేది ఆ పార్టీ నేతల ఆలోచన. దీంతో ఈసారి రెండింటినీ గెల్చుకుని కాంగ్రెస్‌కు విద్యావంతుల మద్దతు లేదని నిరూపించాలనుకుంటున్నది. ఇక్కడ గెలుపును అసెంబ్లీ ఎన్నికలకు కూడా వాడుకోవాలని బీఆర్ఎస్ ఆలోచిస్తోంది. అందుకే ఆలస్యమైనా ఓవైపు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వ్యతిరేకతను వాడుకుంటూనే.. మరోవైపు సామాజికవర్గ సమీకరణాలను కూడా అనుకూలంగా మల్చుకుని కాంగ్రెస్ ‘బీసీ వ్యతిరేకి’ అనే అస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటున్నది.

ఓటర్ల నమోదులో చొరవ

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఓటర్లుగా పేర్లను కొత్తగా నమోదు చేసుకోవాల్సిందే. ఇందుకోసం ఈసారి కూడా గ్రాడ్యుయేట్లను చేర్పించడంలో బీఆర్ఎస్ చొరవ తీసుకోవాలనుకుంటున్నది. గతంలో పల్లా రాజేశ్వరరెడ్డి సైతం ఇదే తరహా ఫార్ములాను ప్రయోగించారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్లు ఓటర్లుగా పేర్లను నమోదు చేసుకునే ప్రక్రియ మొదలైంది. నవంబర్ 6వ తేదీ వరకు అవకాశం ఉన్నందున.. అప్పటికల్లా గ్రాడ్యుయేట్లకు దగ్గరయ్యేందుకు గులాబీ పార్టీ నిర్దిష్ట యాక్షన్ ప్లాన్‌ను రూపొందించుకోనున్నది.

ప్రతి వందమంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు ఒకరిని పర్యవేక్షకులుగా నియమించి, ఓటర్లుగా నమోదు చేయడంపై ఫోకస్ పెట్టనున్నది. ఓటర్లుగా పేర్లను నమోదు చేయడం మొదలు పోలింగ్ వరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకరికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పజెప్పాలనుకుంటున్నది. ఇందుకోసం నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలకూ ప్లాన్ చేస్తున్నది. స్వయంగా ఈ అంశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేస్తారని, బాధ్యతలు చేపట్టే లీడర్లతో త్వరలో సమావేశమవుతారని పార్టీ వర్గాల సమాచారం. అభ్యర్థుల్ని ఖరారు చేసిన తర్వాత స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నారని టాక్. గెలుపుపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏది ఏమైనా ఫిబ్రవరిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగే అవకాశం ఉన్నందున అప్పటివరకు సీరియస్‌గా దృష్టి పెట్టి, అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ అధిష్ఠానం భావిస్తోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>