కలం, తెలంగాణ బ్యూరో : “సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఒక అధికారిక గుర్తింపు సంఘం ఉంటుంది. ఆర్టీసీ కార్మికులకూ అదే తరహా వ్యవస్థ అమలవుతున్నది. కానీ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వివిధ డిపార్టుమెంట్ల ఎంప్లాయీస్ సంఘాలు/అసోసియేషన్లలో (Employee Unions) దేనికీ అధికారికంగా గుర్తింపు లేదు” అని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు , ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 113 సంఘాలకు ప్రభుత్వ గుర్తింపు ఉన్నా.. స్వరాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో మాత్రం పుష్కరకాలంగా ఏ ఒక్క సంఘానికీ అధికారిక గుర్తింపు లేదని వారు అంటున్నారు. కొన్ని సంఘాలను ప్రభుత్వం తాత్కాలిక అవసరాల కోసం ‘డీమ్డ్ టు బి రికగ్రైజ్డ్’ అని పేర్కొన్నది. ఉద్యోగుల పీఆర్సీ, డీఏ తదితర డిమాండ్లపై పరిష్కారం కనుగొనడానికి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేసి అందులో కొన్ని సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించింది. కానీ ఇది తాత్కాలిక అవసరాలకే తప్ప.. ‘ఆన్ రికార్డ్’ గుర్తింపు సంఘాలుగా దేనినీ ప్రభుత్వం గుర్తించలేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు వాపోతున్నారు.
ఉద్యోగుల జేఏసీలో 206 సంఘాలు
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, రెవెన్యూ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు.. ఇలా అనేక రకాల సంఘాలకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీలో ప్రాతినిధ్యం ఉన్నది. మొత్తం 206 సంఘాలకు చెందిన జేఏసీ అంటూ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ జేఏసీలోనే టీఎన్జీవో, టీజీవో లాంటి సంఘాలు/యూనియన్లు ఉన్నాయి.
అయితే రాష్ట్రంలో 250కు పైగానే సంఘాలు ఉండగా, వాటిలో 206 జేఏసీలో భాగస్వాములుగా ఉన్నాయి. ఈ జేఏసీకి తోడు రెవెన్యూ డిపార్టుమెంట్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ లచ్చిరెడ్డి అధ్యక్షతన మరో జేఏసీ ఉన్నది. ఇందులో ఇంకొన్ని ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇటీవల రెండు జేఏసీలతో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు పెండింగ్ డీఏలపై చర్చించింది. రెండు డీఏలు విడతల వారీగా విడుదల చేసేందుకు ఆమోదం తెలిపింది.
టీచర్లలో అసంతృప్తి
కొన్ని ఉద్యోగుల, ఉపాధ్యాయ సంఘాలు జేఏసీలలో సభ్యులుగా ఉన్నప్పటికీ.. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్‌లో పరస్పరం కుదుర్చుకున్న రెండు డీఏల క్లియరెన్స్ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉంటే, రెండింటికే ఎలా ఒప్పుకున్నారంటూ జేఏసీ ప్రతినిధులపై కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఒక దశలో కొన్ని సంఘాలు జేఏసీ నుంచి బయటకు వచ్చి, కొత్త జేఏసీని ఏర్పాటు చేసుకుంటాయన్న మాటలూ వినిపించాయి. ఇంకోవైపు ఉద్యోగ సంఘాల్లో చీలిక కూడా తప్పదనే వాతావరణం నెలకొన్నది. దీనికంతటికీ కారణం ప్రభుత్వం అధికారికంగా ఉద్యోగ సంఘాలను గుర్తించకపోవడమేనని, ఆ గుర్తింపే ఇచ్చినట్లయితే మీటింగుకు హాజరై తమ వాదనను వినిపించగలిగేవారమని అసంతృప్తితో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయలు అంటున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్జీవో, గెజిటెడ్ ఆఫీసర్ల యూనియన్లు/అసోసియేషన్లతో పాటు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కీలకమైనవిగా ఉండేవని, డిపార్టుమెంట్లవారీగా ఏర్పడిన ఉద్యోగుల సంఘాలు కూడా గుర్తింపు పొందినవిగానే ఉండేవని గుర్తుచేశారు.
విధివిధానాలపై భిన్న వాదనలు
ప్రభుత్వం ఏదేని ఒక ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘానికి గుర్తింపు ఇవ్వాలంటే అందుకు అనుసరించాల్సిన విధానమేంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు సంఘాలుగా ఉన్నవాటిని యథాతథంగా తెలంగాణ ప్రభుత్వం సైతం గమనంలోకి తీసుకోవచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే.. ఈ పన్నెండేండ్లలో కొత్తగా పుట్టుకొచ్చిన సంఘాలను గుర్తించేందుకు ఎలాంటి విధానం అనుసరించాలో స్పష్టత లేదనే అంశాన్నీ ఉద్యోగులు ప్రస్తావిస్తున్నారు.
టీఎన్జీవో, టీజీవో, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ అసోసియేషన్/యూనియన్లను ప్రధాన సంఘాలుగా గుర్తిస్తూనే మిగిలిన వాటికీ గుర్తింపు ఇవ్వాలన్నది ఒక వాదన ఉంది. ఇకపైన ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనే రెండు కేటగిరీలు మాత్రమే చేసి వాటికి ఎన్నికలు నిర్వహించి గెలిచినవాటినే ప్రభుత్వ గుర్తింపు సంఘాలుగా ప్రకటించాలన్నది మరో వాదన వినిపిస్తోంది.
సింగరేణి, ఆర్టీసీ కార్మిక సంఘాలను గుర్తించే విధానానికి (ట్రేడ్ యూనియన్ తరహా స్వభావం), ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయ సంఘాలను గుర్తించే విధానానికి (వీటికి అసోసియేషన్ తరహా స్వభావం) తేడా ఉంటుందన్న అంశాన్ని మాజీ నేతలు కొందరు గుర్తుచేశారు.
సరైన ప్లాట్‌ఫామ్ ఏదీ?
ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, డిపార్టుమెంట్ ఎంప్లాయీస్ సంఘాలు జేఏసీలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ, విడిగా తమ గొంతు వినిపించే అవకాశం లేదని గుర్తింపు సంఘాలు ఉండాలనే వాదించేవారి నుంచి మాటలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో 113 సంఘాలను గుర్తించినప్పుడు తెలంగాణలో అలాంటి విధానమే ఎందుకు కంటిన్యూ కావొద్దని వారు ప్రశ్న లేవనెత్తుతున్నారు.
కొన్ని సందర్భాల్లో డిపార్టుమెంట్ ఉద్యోగుల సంఘాలకు భిన్నమైన సమస్యలు ఉంటాయని, వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చర్చలు జరిపి పరిష్కరించుకోవడానికి ఇప్పుడు తగిన ప్లాట్‌ఫామ్ లేదని వారు అంటున్నారు. అందరికీ వర్తించే విషయంలో జేఏసీ చర్చలు జరిపినా, కేవలం ఒక సంఘానికి మాత్రమే నిర్దిష్టంగా ఉండే సమస్యల పరిష్కారినికి ఫోరమ్ లేదని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా స్పష్టమైన విధివిధానాలను ఖరారు చేసి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, డిపార్టుమెంట్లలోని ఎంప్లాయీస్ సంఘాలను గుర్తించడానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.

