కలం, మెదక్ బ్యూరో: ప్రజా భాగస్వామ్యంతో నషా ముక్త్ భారత్ సాధ్యమవుతుందని రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla) అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని, నషా ముక్త్ భారత్ ర్యాలీని పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మాట్లడుతూ.. భారత్ ప్రపంచంలోనే యువత ఎక్కువగా ఉన్న దేశాల్లో ఒకటన్నారు. యువశక్తి డ్రగ్స్ బారిన పడితే దేశ అభివృద్ధికి తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. నషా ముక్త్ ఉద్యమం ఇంటి నుంచే ప్రారంభం కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు.
కుటుంబం నుంచి పాఠశాల, గ్రామం, మండలం, జిల్లా స్థాయికి అవగాహన విస్తరించాలని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూచించారు. డ్రగ్స్ నిర్మూలనకు సంబంధించి సమర్థవంతమైన చర్యలు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టినందుకు తెలంగాణ పోలీసులకు దేశంలోనే తొలి ట్రోఫీ లభించడం గర్వకారణమన్నారు. మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు.

