పేదల సొంతింటి కల సాకారమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం!: ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ రాష్ట్రంలో ఇకపై ఎవరూ గుడిసెల్లో నివసించకూడదన్నదే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas) అన్నారు.పేదలందరికీ సొంత ఇల్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన వివిధ కారణాల వల్ల నిర్మించుకోని వారి స్థానంలో అర్హులైన వారిని ఎంపిక చేసి, శనివారం హన్వాడ మండల కేంద్రంలోని రైతు వేదిక దగ్గర లబ్దిదారులకు ఎమ్మెల్యే ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు సొంత ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో ఇళ్ల నిర్మాణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని,పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతం మరింత విస్తరించామని తెలిపారు. హన్వాడ మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 1,200 ఇళ్లను మంజూరు చేశామని, ఆయా గ్రామాల్లో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్నారని చెప్పారు. రాబోయే రెండు, మూడు నెలల్లో చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. ప్రత్యేకంగా గుడిసెల్లో నివసిస్తున్న పేద కుటుంబాలను గుర్తించి వారికి కూడా ఇళ్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. మరో విడతలో 1,500 ఇళ్లను మంజూరు చేస్తున్నామని, హన్వాడ మండలానికి అదనంగా మరో 500 ఇళ్లు మంజూరు చేయడంతో పాటు అవసరాన్ని బట్టి మరిన్ని ఇళ్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ప్రతి గ్రామంలో సొంత ఇల్లు నిర్మించుకోవాలనే ఆకాంక్ష ఉన్న పేదలకు, ఆర్థిక స్థోమత లేని కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. గతంలో ఎన్ని ఇళ్లు నిర్మించారో, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఇళ్లు నిర్మిస్తుందో ప్రజలు గమనించాలని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో హన్వాడ గ్రామంలో కేవలం 16 ఇళ్లు నిర్మిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అదే గ్రామంలో వందలాది ఇళ్లను నిర్మించి పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని తెలిపారు. పేదలందరికీ ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, అలాగే పేదలకు సన్నబియ్యం అందేలా చర్యలు చేపట్టామని చెప్పారు.

రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు సహా అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రజలకు ఉచిత విద్యుత్, రైతులకు రైతు భరోసా, మహిళలకు కల్యాణలక్ష్మి, రైతులకు పంటలపై బోనస్ తదితర అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. పేదలకు ఆహారం, ఉండేందుకు ఇల్లు, పిల్లలకు మంచి విద్య, రైతులకు అండ, ఉచిత విద్యుత్, మెరుగైన రహదారులు వంటి అనేక సౌకర్యాలను కల్పిస్తున్నామని తెలిపారు.

రుణమాఫీ విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసిందని, 35 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచిందని ఎమ్మెల్యే చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విడతల వారీగా పరిమిత మొత్తాల్లో రుణమాఫీ చేసిన పరిస్థితి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతుల రుణాలను మాఫీ చేసిందని గుర్తు చేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గమనించాలని, ఎవరు ఏం చెప్పినా విని మోసపోవద్దని ఎమ్మెల్యే సూచించారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, మహబూబ్ నగర్ కార్పొరేషన్ మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బుద్దారం సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వేముల కృష్ణయ్య, సిరాజ్ ఖాద్రీ, టంకర కృష్ణయ్య యాదవ్, హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వి.మహేందర్, మహిళా అధ్యక్షురాలు నవనీత, వెంకటయ్య, తిరుపతయ్య, శంకర్ నాయక్, యాదిరెడ్డి , దాసరి రఘు , వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>