కలం, వరంగల్: వరంగల్ ఉర్సుగుట్టలోని రంగలీలా మైదానంలో ఈ నెల 10 నుంచి 20 వరకు నిర్వహించనున్న బతుకమ్మ, దసరా ఉత్సవాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత (CP Swetha) సూచించారు. జిల్లా కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఉత్సవాల సన్నాహక సమావేశానికి సీపీ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఉత్సవాలకు భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్నందున శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ప్రణాళికతో ముందస్తు చర్యలు చేపడుతుందని తెలిపారు. పారిశుధ్యం, మౌలిక వసతులు, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
ఈ సమావేశంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, కలెక్టర్ సత్య శారద, మున్సిపల్ కమిషనర్ వెంకన్నతో పాటు వివిధ శాఖల అధికారులు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

